టీడీపీ హౌస్ ఫుల్...అయినా నేతల క్యూ..ఎందుకంటే ?
తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇపుడు వైసీపీ నేతలు కూడా క్యూ కడుతున్నారు. టీడీపీలో చేరితే తమ కెరీర్ పది కాలాల పాటు పదిలంగా ఉంటుందని కూడా గట్టిగా నమ్ముతున్నారు.
By: Tupaki Desk | 14 Oct 2024 7:30 PM GMTఏపీలో తెలుగుదేశం పార్టీ అత్యంత బలమైన పార్టీగా ఉంది. 2024 ఎన్నికల తరువాత ఇంకా పటిష్టమైన స్థితికి ఆ పార్టీ చేరుకుంది. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇపుడు వైసీపీ నేతలు కూడా క్యూ కడుతున్నారు. టీడీపీలో చేరితే తమ కెరీర్ పది కాలాల పాటు పదిలంగా ఉంటుందని కూడా గట్టిగా నమ్ముతున్నారు.
దానికి గల కారణాలు విశ్లేషించుకుంటే టీడీపీకి అతి పెద్ద ఓటు బ్యాంక్ ఉంది. గ్రామ స్థాయిలో పోలింగ్ బూత్ లెవెల్ వరకూ కరడు కట్టిన పార్టీ కేడర్ ఉంది. అంతే కాదు అంగబలం అర్ధ బలం దండీగా పార్టీకి ఉంది. ఇక చంద్రబాబు నాయకత్వం టీడీపీకి ఎప్పటికీ శ్రీరామ రక్షగానే ఉంటూ వస్తోంది.
బాబు ఏజ్ ఇపుడు ఏడున్నర పదులే కానీ ఆయన పూర్తి ఫిట్ నెస్ తో పాలిటిక్స్ చేస్తున్నారు. ఇదే ఊపులో ఆయన మరో పదేళ్ళ పాటు సులువుగా పాలిటిక్స్ చేయగలరని కూడా అంతా విశ్వసిస్తున్నారు. ఇంకో వైపు చూస్తే నారా లోకేష్ అనూహ్యంగా రాణిస్తున్నారు. అందరి అంచనాలు తప్పు అన్నట్లుగా లోకేష్ రాజకీయ పరిణతి సాధిస్తున్నారు. నాలుగు పదుల వయసులో ఉన్న లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరో మూడు దశాబ్దాల పాటు సులువుగా మెయిన్ స్ట్రీమ్ లో ఉంటుందని కూడా అంతా నమ్ముతున్నారు.
ఇక ఇతర ప్రాంతీయ పార్టీలతో పోల్చుకుంటే టీడీపీలోనే కొంతవరకూ ప్రజాస్వామ్య పోకడలు ఉన్నాయని కూడా నేతలు అంటూంటారు. టీడీపీలో ప్రతీ వారి అభిప్రాయాన్ని అధినాయకత్వం సేకరిస్తుంది. చివరిని ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలో ఉన్న వారికి ఆ విధంగా ఒక విలువను గౌరవాన్ని ఇస్తుంది అని కూడా చెప్పుకుంటారు.
అంతే కాదు చంద్రబాబుని నమ్ముకుంటే ఏదో నాటికి పదవులు వస్తాయన్నది కూడా అంతా భావిస్తూంటారు. అదే జరుగుతోంది కూడా. అందుకే ఇపుడు టీడీపీయే ఏపీలో బెస్ట్ పార్టీ అని భావించి ఆ వైపుగా క్యూ కడుతున్నారు.
ఇక చూస్తే ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. చూడబోతే నాయకులు ఒక్కో నియోజకవర్గంలో ఎక్కువగానే ఉన్నారు. టికెట్ ఆశించే వారి సంఖ్య చాలానే ఉంది. అయితే అందరినీ సర్దుబాటు చేయగల సామర్థ్యం చంద్రబాబుకు ఉందని కూడా రాజకీయ నేతలు భావిస్తున్నారు.
దానికి తోడు 2026 నాటికి ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 225 దాకా పెరుగుతుందని కూడా అంతా భావిస్తున్నారు. అంటే ఇపుడున్న వాటికి అదనంగా మరో యాభై సీట్లు అన్న మాట. ఆ విధంగా సీట్లు పెరిగితే ఆశావహులు ఎంత మంది ఉన్నా వారికి సర్దుబాటు చేయవచ్చు. అందువల్లనే టీడీపీలో చేరేందుకే వైసీపీ నేతలతో పాటు చాలా మంది క్యూ కడుతున్నారు అని అంటున్నారు.
మరో వైపు టీడీపీ కూడా వచ్చిన వారిని వచ్చినట్లుగా చేర్చుకుంటోంది. వైసీపీని వీక్ చేసే వ్యూహం కూడా ఇందులో ఉంది. వైసీపీకి ఉన్న బలమైన నేతలను తీసుకుంటే ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో దెబ్బ పడుతుందని అపుడు వైసీపీ పొలిటికల్ గా బాగా తగ్గిపోతుంది అన్న లెక్కలు కూడా టీడీపీకి ఉన్నాయి.
దాంతో పాటు వచ్చిన నేతలు ఎంత మంది ఉన్నా వారందరికీ ఏదో విధంగా అకామిడేట్ చేసే కెపాసిటీ కూడా టీడీపీ అధినాయకత్వానికి ఉంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో టీడీపీ ఇపుడు రాజకీయ నేతలకు హాట్ ఫేవరేట్ గా ఉంది. టీడీపీలో చేరి తమ రాజకీయాన్ని మరింత కాలం కొనసాగించగలమన్న ధీమాతో నేతలు ఉన్నారు. ఇదే విధంగా ముందుకు సాగితే మాత్రం టీడీపీ ఏకపక్ష రాజకీయమే చాలా కాలం కొనసాగే చాన్స్ ఉంది అని అంటున్నారు.