Begin typing your search above and press return to search.

టీడీపీ హౌస్ ఫుల్... బయట భారీ క్యూ !

తెలుగుదేశం పార్టీ కిటకిటలాడుతోంది. పాతతరంతో పాటు కొత్త తరం కూడా టీడీపీ లోనే ఉంది. వారసులతో పాటు నవతరం కూడా టీడీపీలో చేరింది.

By:  Tupaki Desk   |   30 Aug 2024 1:30 AM GMT
టీడీపీ హౌస్ ఫుల్... బయట భారీ క్యూ !
X

తెలుగుదేశం పార్టీ కిటకిటలాడుతోంది. పాతతరంతో పాటు కొత్త తరం కూడా టీడీపీ లోనే ఉంది. వారసులతో పాటు నవతరం కూడా టీడీపీలో చేరింది. పార్టీ అధికారంలో ఉండటంతో అంతా యాక్టివ్ అయ్యారు. విభజన తరువాత చూస్తే కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి టీడీపీలో కలిశారు. ఆ తరువాత వైసీపీ నుంచి అప్పట్లో వచ్చి చేరిన వారు ఉన్నారు.

ఇపుడు మళ్ళీ వైసీపీ నుంచి భారీ ఎత్తున చేరికలకు రంగం సిద్ధం అవుతోంది. టీడీపీలో జాగా ఎక్కడ ఉందని అంతా వచ్చి చేరుతున్నారు అన్నది అసలైన తమ్ముళ్ల మాట. ఇలా వచ్చిన వారిని చేర్చుకోవద్దు వారంతా రాజకీయ ఊసర వెల్లులు అని పార్టీని కష్టకాలంలో ఆదుకున్న వారికే ప్రయారిటీ ఇవ్వాలని తమ్ముళ్ళు కోరుతున్నారు.

ప్రతీ నియోజకవర్గంలో నిన్నటిదాకా పోటా పోటీగా నిలిచి పోట్లాడుకున్న వారు ఇపుడు సైకిలెక్కడానికి సిద్ధపడుతూంటే తమ్ముళ్ళు ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. ససేమిరా వారిని చేర్చుకోవద్దు అని కూడా అధినాయకత్వానికి చెబుతున్నారు. అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకోవాలని భావిస్తోంది.

వైసీపీని పూర్తిగా బలహేనం చేయడానికి అంది వచ్చిన ఈ అవకాశాన్ని అసలు వదులుకోరాదు అని భావిస్తోంది. వైసీపీలో బలమైన నేతలుగా ఎవరూ ఉండకూడదు అన్నట్లుగా జిల్లాలకు జిల్లాలను ఊడ్చిపారేయాలని ఆలోచిస్తోంది. అయితే వచ్చిన వారు అన్ కండిషనల్ గా చేరాలని షరతు పెడుతోంది. పదవులు వస్తాయని భావించవద్దు అని సూచిస్తోంది.

ఇలా కూడా అంగీకరించి వెళ్లే వారు చాలా మంది ఉండడం ఏపీ రాజకీయాల్లో విశేషంగా చెప్పుకుంటున్నారు. అయిదేళ్ళ పాటు టీడీపీ అధికారంలో ఉంటుంది కాబట్టి అధికార పార్టీ నేతలుగా ఎంతో కొంత వెలుగు వెలగవచ్చు అని 2026లో సీట్ల పెరుగుదలతో అసెంబ్లీలలో మరిన్ని చాన్సులు వస్తాయని అపుడు తమకు కూడా అవకాశం వస్తుందని కూడా భావిస్తున్నారు.

ఇక తన వ్యాపార వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే అధికార పార్టీ నీడ అవసరం అని భావించే వారు ఉన్నారు. దాంతో మొత్తం మీద చూస్తే వైసీపీ నుంచే ఎక్కువ మంది వచ్చేందుకు రెడీ అవుతున్నారు. సాధారణంగా ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్ధి పార్టీని చూసి మేము గేట్లు ఎత్తేస్తే అక్కడంతా ఖాళీ అని చెబుతూ ఉంటుంది. ఇది సాధారణ రాజకీయ విమర్శగానే అంతా చూస్తారు.

కానీ ఇపుడు ఏపీలో అలాంటి సన్నివేశమే కనిపిస్తోంది అని అంటున్నారు దానికి తోడు చంద్రబాబు కూడా ఎన్నడూ లేని విధంగా వైసీపీలోని బలమైన నేతలను ఆ మాత్రం ఈ మాత్రం పలుకుబడి ఉంటే చాలన్న వారిని కూడా చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అని అంటున్నారు. ఇక వైసీపీలో లీడర్లనే కాదు ఆ పార్టీ క్యాడర్ ని కూడా టీడీపీలో చేర్చుకోవడం ద్వారా సమీప భవిష్యత్తులో అసలు వైసీపీ కోలుకోలేని విధంగా దెబ్బ తీయాలన్నది టీడీపీ మాస్టర్ ప్లాన్ గా ఉంది.

అయితే ఇదంతా బాగానే ఉంది కానీ అనుకున్నది నెరవేరకపోతే మాత్రం అసలైన ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. నిన్నటి దాకా బద్ధ శత్రువులు ఇపుడు ఒకే పార్టీలో ఉంటే వర్గ పోరు పెచ్చరిల్లుతుందని కూడా టీడీపీలో కీలక నాయకులు అంటున్నారు. టీడీపీలో వారికే పదవులు ఇవ్వాలని వారికే అన్ని అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

అంతే కాదు కొత్తగా వచ్చే వారు ఎలాంటి అధికార జులుం ప్రదర్శించకుండా నియంత్రించాలని లేకపోతే సైకిల్ కి పంక్చర్లు కూడా ప్రమాదం ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ హౌస్ ఫుల్ బోర్డు పెట్టేసినా బయట భారీ క్యూలు కనిపించడంతో ఏపీ రాజకీయాలు ఇంతలా వన్ సైడ్ గా మారిపోయాయా అని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఫిరాయింపులు కామన్ కానీ మొదటి నుంచి వైసీపీలో ఉన్న వారు సైతం ఆ పార్టీని కాదనుకుని రావడం అంటే ఫ్యాన్ పార్టీ చాలా ఆలోచించాల్సిందే అని అంటున్నారు.