Begin typing your search above and press return to search.

టీడీపీ అధిష్ఠానం షాక్.. వంగవీటి, దేవినేనికీ నిరాశే.. న్యాయం ఎప్పుడు?

టీడీపీ అధిష్ఠానం తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది.

By:  Tupaki Desk   |   10 March 2025 5:00 AM IST
టీడీపీ అధిష్ఠానం షాక్.. వంగవీటి, దేవినేనికీ నిరాశే.. న్యాయం ఎప్పుడు?
X

విజయవాడ రాజకీయాల్లోనే కాదు యావత్ ఏపీ రాజకీయాల్లోనూ ఆ రెండు కుటుంబాల గురించి తెలియని వారు ఉండరు.. ఒకప్పుడు రాజకీయంగా ఎంతగా పేరు గడించాయో చిత్రంగా ఇప్పుడు అంతే సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. టీడీపీ అధిష్ఠానం తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది.

వంగవీటి రాధాక్రిష్ణ.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమారుడు. రంగా చనిపోయి 35 ఏళ్లు దాటినా ఏపీ రాజకీయాల్లో ఆయన పేరు ఇంకా వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి నాయకుడి వారసుడిగా 2004లో తొలిసారి ఎమ్మెల్యే అయిన రాధాక్రిష్ణ మళ్లీ ఇంతవరకు చట్ట సభల్లో అడుగుపెట్టలేదు. 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమితో రాధాకు పదవి దక్కే అవకాశమే లేకపోయింది.

జనసేన, బీజేపీతో పొత్తు నేపథ్యంలో 2024 ఎన్నికల్లో రాధాకు టీడీపీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయనను ఎమ్మెల్సీగా చేస్తారని భావించారు. అయితే, తాజాగా టీడీపీ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల్లో ఆయన పేరు కనిపించలేదు.

ఇక దేవినేవి ఉమా మహేశ్వరరావు. 1999 నుంచి 2014 వరకు నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి.. 2014-19 మధ్య నీటి పారుదల మంత్రిగా పనిచేసిన ఉమాకు టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ దక్కలేదంటేనే ఆశ్చర్యం. మైలవరం టికెట్ ను వైసీపీ నుంచి వచ్చిన వసంత క్రిష్ణప్రసాద్ కు ఇవ్వడంతో ఉమాకు అవకాశం లేకపోయింది. ఇక తాజాగా ఎమ్మెల్సీ చేయడం ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ, దీనికీ చాన్స్ లేకపోయింది. ఉమాను కూడా కాదని టీడీపీ అధిష్ఠానం వేరే నాయకులకు అవకాశం ఇచ్చింది.

ఆ ఇద్దరి దెబ్బతో..

జనసేన నుంచి నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో టీడీపీలో అదే కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రాధాకు టికెట్ దక్కలేదు. ఇటీవల కమ్మ సామాజిక వర్గం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలవడం దేవినేని ఉమాపై ప్రభావం పడిందని అంటున్నారు. మరి వీరిద్దరికీ న్యాయం జరిగేది ఎప్పుడో?