Begin typing your search above and press return to search.

బాబుతో బీజేపీకి పెద్ద పని ఉందా ?

ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో కేంద్రం ప్రత్యేకంగా వ్యవహరిస్తోంది. అది కనిపిస్తోంది కూడా.

By:  Tupaki Desk   |   6 Sep 2024 7:30 AM GMT
బాబుతో బీజేపీకి పెద్ద పని ఉందా ?
X

ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో కేంద్రం ప్రత్యేకంగా వ్యవహరిస్తోంది. అది కనిపిస్తోంది కూడా. దేశంలో అనేక రాష్ట్రాలలో ఇపుడు వరదలు వచ్చాయి. తెలంగాణాలోనూ ఆ పరిస్థితి ఉంది. మోడీ అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా అలాగే ఉంది.

అయితే విశేషం ఏమిటి అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో వరదల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నీ నిశితంగా పరిశీలిస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. అంతే కాదు హుటాహుటిన కేంద్ర బృందాలను పంపారు. మధ్యప్రదేశ్ సీఎం గా సుదీర్ఘ కాలం పనిచేసి ప్రస్తుతం కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖాలను చూస్తున్న సీనియర్ మోస్ట్ లీడర్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ ని ఏపీకి పంపించారు.

ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెబుతున్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని బాబు కోరుతున్నారు. కానీ కేంద్రం అయితే అధికంగా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అంటున్నారు. అలా పెద్ద ఎత్తున నిధులు వచ్చినా ఈ కష్టకాలంలో ఏపీకి బాగానే ఉంటుంది.

మరి బాబు విషయంలో ఇంతలా కేంద్రం శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే అక్కడే ఉంది మతలబు అని అంటున్నారు. బీజేపీ వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు తెచ్చింది. దానికి విపక్షాలు అన్నీ వ్యతిరేకించడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు పెట్టింది.

అయితే ఈ లోగా రాజ్యసభలో బీజేపీకి పూర్తి బలం వచ్చింది. దాంతో మళ్లీ ఆ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. అయితే బీజేపీకి కేంద్రంలో అధికారమే మిత్రుల బలంతో వచ్చినది. ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందాలీ అంటే టీడీపీ జేడీయూ వంటి పార్టీలు కచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే.

అందుకే టీడీపీని ముందస్తుగా మచ్చిక చేసుకునే పనిలో బీజేపీ ఉందని అంటున్నారు. ఈ బిల్లు విషయంలో ఇటీవల పార్లమెంట్ లో చర్చ జరిగితే ఏపీ నుంచి వైసీపీ వ్యతిరేకించింది. టీడీపీ అయితే తన అభిప్రాయం చెప్పలేదని వైసీపీ ఆరోపించింది.

ఇపుడు చూస్తే కేంద్రంలో బీజేపీకి ఈ బిల్లు ఆమోదం చాలా అవసరం. మరి బీజేపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుని టీడీపీ ఈ బిల్లుకు ఓకే అంటుందా అన్నదే చర్చ. మరో వైపు చూస్తే బీజేపీ ఎక్కువగా టీడీపీనే నమ్ముకుంటోంది. చంద్రబాబుకు కేంద్ర రాజకీయాల మీద ఇప్పటప్పట్లో ఆసక్తి లేదు. ఆయనకు ఏపీ అభివృద్ధి కోసం నిధులు కావాలి.

వాటి విషయంలో ఉదారంగా ఉంటే టీడీపీ మద్దతుని పూర్తి స్థాయిలో పొందవచ్చు అన్నదే కమలనాధుల ఆలోచన. అయితే మైనారిటీ ఓటర్లు కూడా టీడీపీకి 2024 ఎన్నికలో ఓట్లు వేసి గెలిపించారు. మరి వారి మనోభావాలు దెబ్బతినేలా టీడీపీ వ్యవహరిస్తుందా అన్నది చర్చ. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని మైనారిటీలు వ్యతిరేకిస్తున్న సంగతి విధితమే.

దాంతో టీడీపీకి ఇది అతి పెద్ద సమస్యంగా మారేందుకే అవకాశం ఉంది.మరి టీడీపీ ఏ స్టాండ్ తీసుకుంటుందో చూడాలి. ఈ బిల్లు కోసమే ఇపుడు బీజేపీ టీడీపీ మీద ఆధారపడి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా కేంద్రం ఏపీ వైపు సానుకూలంగా చూడడమే ఇపుడు కావాల్సింది అని అంటున్న వారూ ఉన్నారు. రానున్న రోజులలో ఏమి జరుగుతుంది అన్నది పక్కన పెడితే కేంద్రం మద్దతు దన్ను ఏపీకి చాలా అవసరం అని అంటున్నారు. ఇపుడు ఏపీ అన్ని విధాలుగా దెబ్బ తిన్నది అందుకే కేంద్రం మద్దతు కోసం టీడీపీ కూడా చూస్తోంది అని అంటున్నారు.