జగన్ స్టాండ్ క్లియర్... బాబు స్టాండ్ మీద ఉత్కంఠ?
ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి.
By: Tupaki Desk | 4 Nov 2024 3:00 AM GMTఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. రెండు కీలక రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత మొదలయ్యే ఈ సమావేశాలు వాడిగా వేడిగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాల్సి ఉంది.
ఇక ఈ సమావేశంలో ఎన్నో కీలక బిల్లులను సభ ముందు పెట్టడానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో అతి ముఖ్యమైనది వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు. ఈ బిల్లు జేఏసీ వద్ద నుంచి ఇపుడు మరోసారి లోక్ సభ ముందుకు వస్తోంది.
ఈ బిల్లు విషయంలో ఎలాగైనా నెగ్గించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. మరి ఈ బిల్లుకి మద్దతు దక్కాలీ అంటే ఎన్డీయే మిత్రుల పాత్ర ఎంతో కీలకం. ఆ విధంగా చూస్తే పదహారు మంది ఎంపీలు ఉన్న తెలుగుదేశం పార్టీ మీదనే అందరి చూపూ ఉంది. టీడీపీ స్టాండ్ ఏమిటి అన్నది చర్చగా సాగుతోంది.
ఎందుకు అంటే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు విషయంలో దేశవ్యాప్తంగా ముస్లిం వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లుని అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబుని ఇటీవల టీడీపీకి చెందిన ముస్లిం నాయకులు మైనారిటీ మంత్రి ఫరూఖ్ నాయకత్వంలో కలసి వినతిపత్రం అందించారు.
అదే విధంగా చూస్తే ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా మహ్మద్ ఫజ్లుర్ రహీమ్ ముజాదిది నేతృత్వంలో ముస్లిం నేతలు సైతం చంద్రబాబును కలిశారు. వక్ఫ్ సవరణ బిల్లు 2024కి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వవద్దని వారంతా గట్టిగానే కోరారు.
అయితే ఈ బిల్లు విషయం టీడీపీకి ఒక అగ్ని పరీక్షనే పెడుతోంది అని అంటున్నారు. ఈ బిల్లుని వ్యతిరేకిస్తే ఎన్డీయే లో కీలక మిత్రుడిగా ఉన్న టీడీపీకి అది ఇబ్బందికరం అవుతుంది. ఏపీకి కేంద్రం సాయం అవసరం, పైగా మోడీ అమిత్ షా పూర్తిగా టీడీపీని నమ్ముతున్నారు.
గతానికి మించి ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. దాంతో కేంద్రం అంటే ఎన్డీయే ప్రవేశపెట్టే బిల్లుని వ్యతిరేకించడం అంటే ప్రభుత్వంలో ఉంటూ వ్యతిరేకించడమే అది కాస్తా చివరికి కేంద్ర ప్రభుత్వంలోనే అలజడి రేపేలా మారుతుంది అని అంటున్నారు. ఇక బీజేపీ ధైర్యం అంతా టీడీపీ మీదనే ఉంది. 16 మంది ఎంపీలు ఆ పార్టీకి ఉన్నారు. వారంతా ఓటు చేస్తేనే బిల్లు నెగ్గేది. మరి టీడీపీ ఈ విషయంలో బీజేపీకి హ్యాండ్ ఇస్తుందా అంటే అది పెద్ద చర్చగానే ఉంది.
మరో వైపు చూస్తే టీడీపీకి ముస్లిం మైనారిటీల అండ ఈసారి ఎన్నికల్లో పెద్ద ఎత్తున దక్కింది. వారంతా ఏపీలో వైసీపీ గూటి నుంచి బయటకు వచ్చి టీడీపీకి మద్దతు ఇచ్చారు. భారీ మెజారిటీలు ఇచ్చారు. దాంతో పాటు ముస్లింల మద్దతు ఎపుడూ టీడీపీకి కావాల్సి ఉంది. టీడీపీ లౌకిక పునాదుల మీద ఏర్పడిన పార్టీ.
దాంతో పాటు టీడీపీకి చెందిన మంత్రి సహా ప్రజా ప్రతినిధులు నాయకులు అంతా ఇది తప్పుడు బిల్లు అని అంటున్నారు. ఈ బిల్లుని ఆమోదించవద్దని అని వారు కోరుతున్నారు. దీని మీద బాబు ఏ నిర్ణయం తీసుకుంటారో అని మైనారిటీలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
ఇంకో వైపు చూస్తే వైసీపీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు తాము పూర్తిగా వ్యతిరేకం అని పేర్కొంది. ముస్లిం నాయకుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుకు మద్దతు ఇవ్వమని తేలేశారు. జగన్ ముస్లింల మేలు కోరే వ్యక్తి అని ఆయన గుర్తు చేశారు. దీంతో ఇపుడు అందరి చూపూ టీడీపీ తీసుకునే స్టాండ్ మీదనే ఉంది.