టీడీపీలో వారి హవా ముగిసినట్లే !
టీడీపీ ఎపుడు అధికారంలోకి వచ్చినా బెర్తులు అన్నీ సీనియర్లకే దక్కుతున్నాయి. పదవులు వారే తీసుకుంటున్నారు. కష్టపడిన జూనియర్లు మాత్రం వెనక బెంచ్ కి పోతున్నారు.
By: Tupaki Desk | 8 Jan 2025 3:15 AM GMTతెలుగుదేశం పార్టీ పేరు చెబితే ఠక్కున పదుల సంఖ్యలో నాయకుల పేర్లు కళ్ల ముందు మెదులుతాయి. అదంతా దివంగత మహా నాయకుడు ఎన్టీఆర్ గొప్పదనం అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు వారికి ఇచ్చిన ప్రోత్సాహం అని కూడా చెప్పాలి. ఏ రాజకీయ పార్టీలో లేనంతమంది సీనియర్లను అనుభవం కలిగిన వారిని తయారు చేసిన ఒక రాజకీయ శిక్షణాలయం టీడీపీ అంటే సబబుగా ఉంటుంది.
అలా పాతికేళ్ళ వయసులో రాజకీయాల్లో ఏ మాత్రం సంబంధం లేని వారు అంతా అన్న గారి పిలుపు విని టీడీపీలో చేరారు. వారంతా ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయారు. అలా వారు చూస్తూండగానే నాలుగు దశాబ్దాల సుదీర్ఘ జీవితాన్ని కొనసాగించారు.
ఎన్నో కీలకమైన పదవులు వారు అనుభవించారు. ఒక విధంగా టీడీపీలో చేరిన వారు అంతా అదృష్టవంతులే అయ్యారు. టీడీపీ అలా ఎంతో గుర్తింపు ఇచ్చింది. దానిని నిలబెట్టుకుని కొనసాగిన వారు ఈ రోజుకీ పార్టీలో ఉన్నారు. అలా కాదు అనుకున్న వారు బయటకు వెళ్ళి వేరే పార్టీలలో చేరినా ఏ మాత్రం రాణించలేకపోయారు. అదే టీడీపీ గ్రేట్ నెస్ అని వారు గ్రహించేసరికి పుణ్యకాలం ఇట్టే గడచిపోయింది.
వారి విషయం అలా ఉంచితే తెలుగుదేశంలో సీనియర్లుగా ఉన్న వారు అంతా ఇక రెస్ట్ తీసుకోవాల్సిందే అన్న చర్చ సాగుతోంది. గోదావరి జిల్లాల పర్యటనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పదవుల విషయం ప్రస్తావిస్తూ రెండు సార్లు చాన్స్ పార్టీ నుంచి దక్కాక కాస్తా పక్కకు తప్పుకోవాల్సిందే అని చెప్పారు.
ఆయన ఈ విషయం ఒక సంకేతంగానే చెప్పారు. పైగా తన మీదనే ఆయన ఉదహరించుకుంటూ చెప్పారు. నేను అయినా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయినా ఇదే రూల్ అన్నట్లుగా మాట్లాడారు. నిజానికి లోకేష్ టీడీపీకి భావి వారసుడు. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటే యువ నేత. మరి ఈ ఇద్దరూ ఇంకా దశాబ్దాల రాజకీయ ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
దాంతో ఆయన చెప్పినది సీనియర్ల గురించి అని అంటున్నారు. టీడీపీ ఎపుడు అధికారంలోకి వచ్చినా బెర్తులు అన్నీ సీనియర్లకే దక్కుతున్నాయి. పదవులు వారే తీసుకుంటున్నారు. కష్టపడిన జూనియర్లు మాత్రం వెనక బెంచ్ కి పోతున్నారు. ఈసారి అలా కాకుండా ఎమ్మెల్యే టికెట్ల నుంచి మంత్రి పదవుల నుంచి నామినేటెడ్ పోస్టుల నుంచి ఆఖరుకు రీసెంట్ గా ఎంపిక చేసిన ఒక రాజ్యసభ సీటు దాకా కొత్త వారికే చాన్స్ ఎక్కువగా దక్కింది.
దానిని బట్టి చూస్తే లోకేష్ ఎందుకు ఈ ప్రకటన చేశారు అన్నది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. టీడీపీని మరింత కాలం పదిలంగా ఉంచాలంటే కొత్త రక్తాన్ని పార్టీకి ఎక్కించాలని లోకేష్ చూస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన టీడీపీలో పదవుకి కోటా పెట్టారని అంటున్నారు. మాగ్జిమం రెండు సార్లు కీలక పదవులు దక్కిన వారు ఇక వాలంటరీగా పోటీ నుంచి తప్పుకోవాల్సిందే అన్నది లోకేష్ మాటల వెనక ఆంతర్యం అని అంటున్నారు.
మరో వైపు చూస్తే లోకేష్ తన ఏజ్ గ్రూప్ వారికి ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. పార్టీ పదవులలో కానీ అధికార పదవులలో కానీ మాగ్జిమం ఏజ్ నలభై నుంచి నలభై అయిదు ఏళ్ళ మధ్యన అని ఒక పరిమితి అయితే చెప్పకనే చెబుతూ పెట్టుకున్నారా అన్న చర్చ వస్తోంది.
అదే విధంగానే అంతా సాగుతోంది అంటున్నారు. మంత్రులలో ఎక్కువ మంది ఈ ఏజ్ గ్రూప్ లోనే ఉండడం కూడా గమనించవచ్చు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో సీనియర్లకు స్పష్టమైన సంకేతాలు అయితే లోకేష్ ప్రకటనలను బట్టి చూస్తే వెళ్ళాయని అంటున్నారు. వారంతా ఇక వచ్చే ఎన్నికల గురించి కానీ తమకు రాబోయే పదవుల గురించి కానీ కలవర పడాల్సిన అవసరం అయితే లేదని అంటున్నారు.
అయితే ఈ సీన్యర్లలో కొందరికి కొంత వెసులుబాటు ఉంటుందని అంటున్నారు. వారి వారసులలో సమర్ధంగా పనిచేసిన వారు ఉంటే కనుక పార్టీ అసలు వదులుకోదు అని అంటున్నారు. దానికి ఉదాహరణగా రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష, అతిది గజపతి రాజు సహా చాలా మంది నేతల పేర్లు చెబుతున్నారు.
అలాగని అందరినీ వారసులనే తెచ్చి పార్టీలో చోటివ్వడం అంటే సందేహమే అంటున్నారు. ఒక వైపు యువ రక్తానికి ప్రాధాన్యత ఇస్తూ మరో వైపు పార్టీ కోసం పనిచేసే సీనియర్ల వారసులలో బలమైన నేతలకు చాన్స్ ఇవ్వడం ద్వారా సమతూకం పాటించాలని ఒక విధానం ఉందని అంటున్నారు. మొత్తానికి అయితే టీడీపీలో ఇక మీదట సీనియర్ల హవా అయితే అంతలా ఉండకపోవచ్చు అన్నది నిజమని జరుగుతున్న ప్రచారం బట్టి అర్ధమవుతోంది అంటున్నారు.