11, 11, 11, 11... ర్యాంకులు కాదు, టీడీపీ కొత్త ర్యాగింగ్!
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించగా.. వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Nov 2024 6:58 AM GMTఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించగా.. వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి సరికొత్త రికార్డ్ సృష్టించిన వైసీపీ.. 2024 ఎన్నికల్లో 11 స్థానలకు పరిమితమైన పరిస్థితి. దీంతో.. ఇప్పటికే వైసీపీని తీవ్రస్థాయిలో ర్యాగింగ్ చేస్తున్న తమ్ముళ్లు.. అసెంబ్లీ సమావేశాల వేళ మరింత డోసు పెంచారు.
అవును... ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దాదాపు 40శాతం వరకూ ఓట్లు దక్కించుకున్నప్పటికీ.. సీట్ల విషయంలో 11 కే పరిమితమైంది. దీంతో... టీడీపీ సోషల్ మీడియా జనాలు.. వైసీపీని, ఆ పార్టీ అధినేత జగన్ ని తీవ్రస్థాయిలో ర్యాగింగ్ చేస్తున్నారు!
మరోపక్క అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరవుతున్న అంశంపైనా ఇప్పుడు సరికొత్త ర్యాగింగ్ స్టార్ట్ అయ్యింది. జగన్ తో పాటు వైసీపీ నేతలు అంతా అసెంబ్లీ సమావేశాలకు రావాలని.. వారికి రూల్స్ ప్రకారం సమయం కేటాయించబడుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరుతూనే ఉన్నారు!
ఈ నేపథ్యంలో... ఈ నెలలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పైగా... ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికీ చాలా అవకాశాలున్నాయనే కామెంట్లు వినిపిస్తున్న వేళ.. జగన్ హాజరవుతారా లేదా అనే చర్చ నడుస్తుంది.
ఈ సమయంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలపైనా టీడీపీ సోషల్ మీడియా మరోసారి వైసీపీని తగులుకుంది. ఇందులో భాగంగా... "11వ నెల 11వ తేదీ నుంచి మొదలై, 11 రోజుల పాటు జరిగే సమావేశాలకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ హాజరవుతుందా? “అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు!