Begin typing your search above and press return to search.

చంద్రబాబు మాట తప్పలేదు షర్మిల.. ఇదిగో సాక్ష్యం!

జిల్లా స్థాయివరకే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అని సర్కార్ క్లారిటీ ఇవ్వడంతో.. షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా టీడీపీ క్లారిటీ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   8 March 2025 9:33 AM IST
చంద్రబాబు మాట తప్పలేదు షర్మిల.. ఇదిగో సాక్ష్యం!
X

ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఏపీలో మహిళలకు జిల్లాల్లో ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది తప్ప రాష్ట్రమంతా కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే.. మహిళలు ఎవరి జిల్లాలో వారు ఉచితంగా ప్రయాణించొచ్చు కానీ.. పక్క జిల్లాకు వెళ్లేటప్పుడు కాదన్నమాట!

దీంతో... ఈ వ్యవహారంపై విపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా... ఇంతకాలం ఫ్రీ, ఫ్రీ అని చెప్పి ఇప్పుడు కండిషన్స్ పెడుతున్నారా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా స్పందించిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల... ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు.

ఇందులో భాగంగా... ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా.. దాటాక బోడి మల్లన్నలా ఉంది కూటమి ప్రభుత్వ తీరు అని దుయ్యబట్టారు. ఇదే సమయంలో.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ..ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి, ఓట్లు వేయించుకొని, ఇప్పుడు కండీషన్ అప్లై అనడం దారుణం అని అన్నారు.

ఇదే సమయంలో... జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసం అని.. అమలు చేయాలన్న చిత్తశుద్ది లేక చెప్పే సాకులని.. పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టే ఈ ప్రభుత్వం.. రేపు అమల్లోకి తెచ్చే సరికి నియోజక వర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో అని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో టీడీపీ క్లారిటీ ఇచ్చింది.

అవును... జిల్లా స్థాయివరకే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అని సర్కార్ క్లారిటీ ఇవ్వడంతో.. షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా టీడీపీ క్లారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగా... ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, నారా లోకేష్ లు చెప్పిన మాటలో ఉన్న స్పష్టతను వెల్లడించింది. వీడియోలు షేర్ చేసింది.

ఈ సందర్భంగా... ఒక జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచిత ప్రయాణం అని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చారని.. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారని.. జనానికి మేలు జరిగితే ఓర్వలేని జగన్ ఉచిత బస్సు ప్రయాణంపై విషం కక్కుతున్నాడు అని సాక్ష్యాలతో సహా వెల్లడించింది!