Begin typing your search above and press return to search.

సీనియర్లు హుందాగా తప్పుకోవాల్సిందే ?

టీడీపీలో సీనియర్లకు ఇపుడు రిటైర్మెంట్ టైం నడుస్తోంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   31 Oct 2024 7:30 AM GMT
సీనియర్లు హుందాగా తప్పుకోవాల్సిందే ?
X

టీడీపీలో సీనియర్లకు ఇపుడు రిటైర్మెంట్ టైం నడుస్తోంది అని అంటున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీనియర్లలో చాలా మందికి టికెట్లు దక్కలేదు. ఇక దక్కిన వారికి కూడా ఎమ్మెల్యేలుగానే ఉంచేశారు. మంత్రి పదవులలో వారిని పక్కన పెట్టారు. మరో వైపు నామినేటెడ్ పదవుల విషయంలో కూడా జూనియర్లు యంగ్ బ్లడ్ కే ప్రాధాన్యత కల్పిస్తున్నారు.

గట్టిగా ఆలోచించే కొత్త ముఖాలను తీసుకుని వస్తున్నారు. దాని వల్ల రేపటి తెలుగుదేశం పార్టీ మరో నలభై ఏళ్ల పాటు మనగలగాలన్నది పార్టీ వ్యూహకర్తల ఆలోచనగా కనిపిస్తోంది. అంతే కాదు టీడీపీ భవిష్యత్తు నేత నారా లోకేష్ ని యువతరంతో అనుసంధానం చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది.

చంద్రబాబు కోటరీలో ఉన్నారు. బాబుకు ఆనాడు సన్నిహితులుగా ఉన్న వారు మెల్లగా ఇపుడు సైడ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రకటించిన టీటీడీ చైర్మన్ పదవి విషయంలో ఉత్తరాంధ్రా నుంచి కూడా చాలా పేర్లు వినిపించాయి. అందులో మాజీ మంత్రి ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ అయిన కిమిడి కళా వెంకట్రావు పేరు కూడా ఎక్కువగా వచ్చింది.

ఆయన కూడా తన సన్నిహితులతో తనకు టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని చెప్పుకున్నారని కూడా ప్రచారం సాగింది. అయితే తీరా ఈ పదవిని బీఆర్ నాయుడుకు ఇవ్వడంతో కళా వెంకటరావు జస్ట్ ఎమ్మెల్యేగానే ఈ టెర్మ్ లో ఉండాల్సిందేనా అన్న చర్చ అయితే మొదలైంది.

అదే విధంగా మరో సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరు కూడా ఈ కీలకమైన పదవికి వినిపించింది. ఆయనకు ఈసారి ఎన్నికల్లో లోక్ సభ టికెట్ ఇవ్వలేదు. ఆయనకు టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచేవారు. కేంద్ర మంత్రి కూడా అయి ఉండేవారు.

కానీ కొత్తవారిని యువతరాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో అలా చేశారు అని అంటున్నారు. ఇక అశోక్ కి ఘనమైన నామినేటెడ్ పదవి దక్కుతుందని అనుకున్నారు. అదే టీడీపీ చైర్మన్ పదవి అని కూడా అనుకున్నారు. కానీ ఆయనకూ ఈ చాన్స్ ఇవ్వలేదు. ఇక ఆయన పేరుని రాజ్యసభకు పరిశీలిస్తారని గవర్నర్ పదవి కి ఆయన పేరుని సిఫార్సు చేస్తారని అంటున్నారు. చూడాలి మరి.

ఇక మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అయినా మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయినా ఎమ్మెల్యేలుగానే ఈ టెర్మ్ లో ఉంటారా అన్న చర్చ కూడా మొదలైంది. ఇంకో వైపు చాలా మంది సీనియర్లు తమ ఎమ్మెల్యే టికెట్లను త్యాగం చేశారు. వారు కూడా ఇపుడు సైలెంట్ అయ్యారు.

కేవలం ఉత్తరాంధ్రాలో కాదు ఏపీలో అంతటా సీనియర్లకు రెస్ట్ ఇస్తూ జూనియర్లను టీడీపీ అధినాయకత్వం ప్రోత్సహిస్తోంది అని అంటున్నారు. దాంతో సీనియర్లు తమ వారసులకు పదవులు ఇప్పించుకుని తాము సైడ్ అవాడమే ఉత్తమం అనుకుంటున్నారు. మరి వారసులలో ఎంతమందికి చాన్స్ దక్కుతుంది అన్నది కూడా ప్రశ్నార్ధకమే అని అంటున్నారు.