Begin typing your search above and press return to search.

సీనియర్లకు ఇక సెలవేనా ?

టీడీపీలో సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినపుడు పాతికేళ్ల వయసులో ఉన్న వారు ఎంతో మంది పార్టీలో చేరారు.

By:  Tupaki Desk   |   28 Nov 2024 3:30 PM GMT
సీనియర్లకు ఇక సెలవేనా ?
X

టీడీపీలో సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినపుడు పాతికేళ్ల వయసులో ఉన్న వారు ఎంతో మంది పార్టీలో చేరారు. ఆ తరువాత వారే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా పనిచేసి ఎంతో సేవలను అందించారు.

ఇపుడు చూస్తే టీడీపీకి 43 ఏళ్ళ వయసు వస్తోంది. ఆ పార్టీతో పాటే రాజకీయంగా పుట్టిన వారంతా సీనియర్ మోస్ట్ లీడర్లు అయ్యారు వారంతా ఏడు పదులకు చేరువ అవుతున్నారు. కొందరు అయితే ఏడు పదుల వయసుని దాటేశారు కూడా.

టీడీపీలో సీనియర్ల పరిస్థితి ఏమిటి అన్నది ఇపుడు చర్చగా సాగుతోంది. 2019 దాకా ఒక వెలుగు వెలిగారు సీనియర్లు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం వారికి పార్టీ విధానం ఏంటి అన్నది కొంత వరకూ అర్ధం అయింది. టికెట్ల పంపిణీలోనే జూనియర్లకు కొత్త ముఖాలకు చాలా చోట్ల టికెట్లు ఇచ్చారు. ఇక తప్పదు అనుకున్న చోట అనివార్యమైన చోట మాత్రమే సీనియర్లకు టికెట్లు ఇచ్చారు.

మరి కొన్ని చోట్ల సీనియర్ల రాజకీయ వారసులకు టికెట్లు ఇచ్చి వారిని అలా సంతృప్తి పరచారు. అంతే కాదు ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి మంత్రివర్గం కూర్పులో చూస్తే జూనియర్లకే పెద్ద పీట వేశారు. అతి తక్కువ మంది మాత్రమే సీనియర్లకు చోటు దక్కింది.

ఆ విధంగా తమకు బెర్త్ ఖాయమని అనుకున్న సీనియర్లు అంతా తరువాత పరిణామాలను చూసి కొంత నిరాశ చెందారు. టీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా మంత్రులు వీరే అవుతారు అని జనం కూడా ఈజీగా గెస్ చేసే విధంగా ఉండే వారంతా ఇపుడు జస్ట్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయారు ఇక టీడీపీ కూటమి ఎన్నడూ లేవి విధంగా ప్రభుత్వ విప్ లను పదిహేను మంది దాకా తీసుకుంది. అందులో టీడీపీకి 11 మంది ఉంటే వారిలో కూడా అత్యధికులు కొత్త వారూ మొదటి సారి గెలిచిన వారు కావడం విశేషం.

దాంతో సీనియర్లకు స్పష్టంగా ఏదో విధంగా సంకేతాలు అందుతున్నాయని అంటున్నారు. ఒకపుడు పార్టీలో ఐదారుసార్లు గెలిచామని చెప్పుకోవడం క్రెడిట్ అయితే ఇపుడు అదే మైనస్ గా మారుతోంది అని అంటున్నారు. ఎంతో మంది కీలక పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. టీటీడీ చైర్మన్ కూడా పార్టీకి చెందిన వారికి కాకుండా ఒక మీడియా అధిపతికి ఇచ్చారు. దాంతో సీనియర్లు అయితే తమ బాధను చెప్పుకోలేక సతమతమవుతున్నారు అని అంటున్నారు.

అయితే మాత్రం వారు ఏమి చేయగలిగే పరిస్థితులలో లేరని అంటున్నారు. ఇపుడు చూస్తే రాజ్యసభ సీట్లు మూడు ఖాళీ అవుతున్నాయి. ఇందులో కూడా సీనియర్ నేతలు పలువురు తమకు చాన్స్ దక్కాలని కోరుకుంటున్నారు. అయితే వారి ఆశలు కూడా హుళక్కి అయ్యేలాగానే ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే సీనియర్లు అంటే ఇక మీదట పార్టీలో సలహదారులుగా మార్గదర్శకులుగా ఉంటూ నడిపించాల్సి ఉంటుందని అంటున్నారు

అలా పొలిట్ బ్యూరోలో సీనియర్లను ఉంచుతున్నారు. రానున్న రోజులలో అంటే జమిలి ఎన్నికలు వచ్చినా లేదా షెడ్యూల్ ప్రకారం 2029లో ఎన్నికలు జరిగినా కూడా టీడీపీలో నూటికి తొంబై శాతం పైగా కనిపించేది జూనియర్లు కొత్త ముఖాలే అంటున్నారు.

దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల చిరిత్రను కలిగిన టీడీపీ మరో అర్ధ శతాబ్దం పాటు ఇదే విధంగా ముందుకు సాగాలీ అంటే అప్పట్లో అన్న గారు యువకులకు పిలిచి టికెట్లు ఇచ్చి పార్టీలో కీలక నేతలను చేసినట్లుగా ఇపుడు కూడా అదే విధంగా చేయాలని చూస్తున్నారు. దాంతో సీనియర్లకు రెస్ట్ తప్పదని అంటున్నారు.

ఇక దశాబ్దాలుగా అధికారం అందుకున్న వారు సీనియర్లలో అత్యధికం ఉన్నారు. దాంతో వారు పార్టీకి శ్రేయోభిలాషులుగా అతి ముఖ్య సలహాదారులుగా మారి తమ రాజకీయ ఉత్సాహాన్ని ఆరాటాన్ని ఆ విధంగానే తీర్చుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తానికి సీనియర్లకు సెలవా అంటే అదే విధమైన సంకేతాలు అయితే టీడీపీ ఇస్తోంది అని అంటున్నారు.