Begin typing your search above and press return to search.

40 ఇయర్స్ ఇండస్ట్రీ...40 పర్సెంట్ ఓట్ బ్యాంక్... టీడీపీని ఆడిస్తున్నదెవరు...?

తెలుగుదేశం పార్టీది అక్షరాల నాలుగు దశాబ్దాల చరిత్ర. అంతే కాదు. 2019 ఎన్నికల్లో 40 శాతం ఓటు షేర్ సాధించిన పార్టీ.

By:  Tupaki Desk   |   19 July 2023 3:01 PM GMT
40 ఇయర్స్ ఇండస్ట్రీ...40 పర్సెంట్ ఓట్ బ్యాంక్... టీడీపీని ఆడిస్తున్నదెవరు...?
X

తెలుగుదేశం పార్టీది అక్షరాల నాలుగు దశాబ్దాల చరిత్ర. అంతే కాదు. 2019 ఎన్నికల్లో 40 శాతం ఓటు షేర్ సాధించిన పార్టీ. ఈ రోజుకీ ఏపీలో ప్రతీ బూత్ లెవెల్ లో ఉన్న పార్టీ. అపోజిషన్ గా పెద్ద పార్టీ. రేపటి రోజున వైసీపీని వద్దు అనుకుంటే అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అంటే ఠక్కున చెప్పే పేరు కూడా టీడీపీనే.

అలాంటి టీడీపీకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దురవస్థ వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారు అంటే నో డౌట్ చంద్రబాబే అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆ విధంగానే ధీమాతో రెండేళ్ల క్రితం అసెంబ్లీలో శపధం చేసి బయటకు వచ్చారు. కానీ ఇపుడు అలా జరగడంలేదుగా. ఏపీలో 2024లో ఒక కూటమి కట్టి ఆ కూటమి గెలిస్తే అపుడు సీఎం పదవి సంగతి చూడవచ్చు అని జనసేన అధినేత పవన్ అంటున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడుతూ సీఎం ఎవరో ప్రస్తుతానికి అనవసరం అన్నారు.

అంటే ఏపీకి సీఎం చంద్రబాబు కాదా. రేపటి రోజున టీడీపీ జనసేన, బీజేపీ కలిస్తే ఉమ్మడి అభ్యర్ధిగా చంద్రబాబుని ముందు పెట్టుకుని ప్రచారం చేయరా అన్న చర్చ వస్తోంది. మరో వైపు చూస్తే జనసేన కార్యకర్తలు తనను సీఎం గా చూడాలని అనుకుంటున్నారు అని పవన్ అంటున్నారు. ఏపీలో జనసేన బీజేపీ పొత్తు ఉందని, టీడీపీని కలవమని ఆయన కోరుతున్నారు. డెసిషన్ టీడీపీ తీసుకోవాలని కూడా అంటున్నారు.

ఇక ఏపీలో చూస్తే బీజేపీకి వన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ లేదు, జనసేన గతంలో ఏడు శాతం సాధించింది, ఇపుడు గ్రాఫ్ పెరిగింది అంటున్నారు. ఎంత పెరిగినా టీడీపీకి ఉన్న ఫార్టీ పర్సెంట్ అయితే జనసేనకు ఉండదు, మరి బీజేపీ జనసేన కలసి టీడీపీని నియంత్రించాలని చూస్తున్నాయా అది సాధ్యమేనా అన్న చర్చ నడుస్తోంది. అలా జరిగిన పక్షంలో టీడీపీ వంటి పెద్ద పార్టీ సైలెంట్ గా ఉండడం ఏంటి అన్నది కూడా మరో చర్చ.

అసలు టీడీపీ ఎందుకు సొంతంగా పోటీ చేస్తామని చెప్పలేకపోతోంది అన్నది మరో ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఏ రాజకీయ పార్టీకి ఆ పార్టీకి సొంత ఆలోచనలు ఉంటాయి. అలాగే వాటి లక్ష్యాలు ఉంటాయి. టీడీపీకి ఏపీలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా ఉంది. పెద్ద పార్టీ అయిన టీడీపీ పొత్తులు కుదిరితే కుదరనీయ్ లేకపోతే మేమే ఒంటరిగా పోటీ చేస్తామని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి పడేస్తే ఇన్ని బాధలు ఇబ్బందులు ఉండవు కదా అని అంటున్న వారూ ఉన్నారు.

బీజేపీ ఎన్డీయే మీట్ కి టీడీపీని పిలవకపోవడం వత్తిడి రాజకీయంలో భాగం అంటున్నారు. పవన్ని తమ వైపు ఉంచుకుని టీడీపీని దాని అధికార అవకాశాల్లోనూ వాటాను కూడా తీసుకోవాలని ఒక ప్రయత్నం అయితే బీజేపీ చేస్తోంది అని అంటున్నారు. టీడీపీకి 2024 ఎన్నికలు డూ ఆర్ డై అన్నది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అంత మాత్రం చేత పొత్తులు అంటూ టీడీపీ తన వీక్ నెస్ ని బయటపెట్టేసుకుందా అన్నదే చర్చకు వస్తోంది.

నిజానికి పొత్తులు కుదిరినా బీజేపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఏపీలో ఉన్న నేపధ్యంలో టీడీపీ ఏమి సాధిస్తుంది అన్నది ఒక కీలక ప్రశ్నగా ముందుకు వస్తోంది. అదే విధంగా జనసేనకు సంస్థాగతంగా బలం లేదు. ఆ పార్టీ వల్ల ఎన్ని ఓట్లు ప్లస్ అవుతాయో 2024 ఎన్నికలే చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు కలసి పనిచేయలేదు కాబట్టి. ఓట్ల బదిలీ కాకపోతే నిజంగా పొత్తు చిత్తు అవుతుంది.

అంటే మూడు పార్టీలు కలసినా గెలుపు దక్కుతుంది అన్నది ఒక ఊహ, అంచనా మాత్రమే అని అంటున్నారు. అలాంటపుడు ఆ అంచనాతో పాటు సొంతంగా పోటీ చేస్తే గెలుస్తామని మరో అంచనా ఎందుకు టీడీపీ పెంచుకోదు అన్న చర్చ ముందుకు వస్తోంది. టీడీపీ కనుక ఇలాగే ఉంటే అతి పెద్ద పార్టీని కూటమి పేరుతో చిన్న పార్టీలే ఆటాడిస్తాయని అంటున్నారు. మొత్తం మీద ఇది కీలకమైన సమయం అని టీడీపీ తన నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉపయోగించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.