Begin typing your search above and press return to search.

తంబ‌ళ్ల‌ప‌ల్లి త‌మ్ముళ్ల తీరే వేరు గురూ..!

అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కు క‌లిసి ప‌నిచేశారు. వైసీపీని బ‌లంగానే ఎదిరించారు. కానీ, అధికారంలోకి వ‌చ్చాక మాత్రం త‌మ్ముళ్ల మ‌ధ్య వివాదాలు.. విభేదాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

By:  Tupaki Desk   |   7 April 2025 4:15 AM
తంబ‌ళ్ల‌ప‌ల్లి త‌మ్ముళ్ల తీరే వేరు గురూ..!
X

అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కు క‌లిసి ప‌నిచేశారు. వైసీపీని బ‌లంగానే ఎదిరించారు. కానీ, అధికారంలోకి వ‌చ్చాక మాత్రం త‌మ్ముళ్ల మ‌ధ్య వివాదాలు.. విభేదాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క విధంగా ఉన్న ఈ స‌మ‌స్య‌లు.. సంఘ‌ర్ష‌ణ‌లు.. అమ‌రావ‌తి వ‌ర‌కు పాకుతున్నాయి. దీంతో రోజుకో పంచాయితీనా? అంటూ.. సీఎం చంద్ర‌బాబు కోప‌గించుకునే వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చింది. తాజాగా తంబ‌ళ్ల ప‌ల్లి వ్య‌వ‌హారం.. అమ‌రావ‌తిలో చ‌ర్చనీయాంశం అయింది.

ఏం జ‌రిగింది?

అన్న‌మ‌య్య జిల్లా.. రాజంపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ దూకుడు ఎక్కువ‌. అలాంటిది.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నేత‌లు ఐక్యంగా ఉండి.. పార్టీని గెలిపించు కునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ.. వీరికి వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు పెద్దిరెడ్డి ద్వార‌కానాథ్ రెడ్డి అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న‌కే ప్ర‌జ‌లు జై కొట్టారు. నిజానికి కూట‌మి సునామీలో అనేక మంది వైసీపీ నాయ‌కులు కొట్టుకుపోయారు. కానీ, పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాత్రం సేఫ్ అయిపోయిన విష‌యం తెలిసిందే.

ఇక‌, త‌మ్ముళ్ల విష‌యానికి వ‌స్తే.. 2014లో టీడీపీ తంబ‌ళ్ల‌ప‌ల్లిని ద‌క్కించుకుంది. జీ. శంక‌ర్ యాద‌వ్‌ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. 2019లో మాత్రం ఆయ‌న ఓడిపోయారు. ఈ క్ర‌మంలో గ‌త ఎన్నిక‌ల్లో జ‌య‌చంద్రారెడ్డికి చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. కానీ, 2024 ఎన్నికల్లో చివరిదాకా టికెట్ కోసం శంక‌ర్ యాద‌వ్‌ ప్రయత్నించారు. కానీ, ఆయ‌న‌కు ద‌క్క‌లేదు. ఇక‌, జ‌య‌చంద్రారెడ్డిఓట‌మి వెనుక శంక‌ర్ ఉన్నారన్న చ‌ర్చ ఉంది. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం ఇంచార్జ్‌గా జ‌య చంద్రారెడ్డి ఉన్నారు.

కానీ, ఈ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అయితే.. ఆయ‌న త‌న గ్రాఫ్‌ను వివ‌రించి.. పార్టీ కోసం చేసిన కృషిని వివ‌రించి.. ప‌ద‌విని ఆశిస్తే బాగానే ఉంటుంది. కానీ, ప్ర‌స్తుతం ఇన్ఛార్జ్‌గా ఉన్న జయచంద్రరెడ్డికి అడుగ‌డుగునా అడ్డు ప‌డుతూ.. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండ‌డం.. పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. ఏకంగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు కూడా శంక‌ర్ అడ్డు ప‌డుతున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలో జ‌య‌చంద్రారెడ్డి రెండు రోజుల కింద‌ట అమ‌రావ‌తికి వ‌చ్చి శంక‌ర్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న వ‌ల్ల పార్టీకి, నియోజ‌క‌వ‌ర్గానికి కూడా చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని అన్నారు. అయితే.. తొలుత చిరాకు ప‌డిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఈవిష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో్ చూడాలి.