'రెండే' కదా అని రెటమతం వద్దు.. కూటమికి ఆక్సిజన్!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. సూపర్ సిక్స్‌లోని రెండు కీలక పథకాలను కూడా అమలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 1 Feb 2025 5:30 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. సూపర్ సిక్స్‌లోని రెండు కీలక పథకాలను కూడా అమలు చేస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంపై భరోసా ఏర్పడింది. ప్రధానంగా అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. మరోవైపు..ఇదేం లేదు.. చంద్రబాబు సంక్షేమానికి వ్యతిరేకం అంటూ విపక్షం వైసీపీ నేతలు తెరచాటు ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సమయంలో అంటే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు మాసాల్లోనే ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్న ఎన్నికలు వచ్చాయి.
శాసన మండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల స్థానాలకు వచ్చే నెల 27న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటిం చారు. దీనిలో వైసీపీ నేరుగా పాలు పంచుకోవడం లేదు. దీంతో కూటమి పార్టీల తరపున ఉమ్మడి కృష్నా-గుంటూరు గ్రాడ్యుయే ట్ స్థానానికి, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ స్తానానికి జరుగుతున్న ఎన్నికలను కూటమి పార్టీలు లైట్ తీసుకుంటు న్నాయి. ఎలానూ వైసీపీ లేదు కాబట్టి.. మాదే గెలుపు! అని లెక్కలు వేసుకుంటున్నారు. కానీ, తాను ఓడినా ఫర్వాలేదు.. కూటమి గెలవకూడదన్న సూత్రాన్ని వైసీపీ నేతలు అనుసరించే అవకాశం ఉందన్న కీలక విషయాన్ని కూటమి పార్టీలు గుర్తించలేక పోతున్నాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
రెండే కదా.. అని రెటమతంగా వదిలేస్తే.. అది కూటమికి భారీ ఎదురు దెబ్బ తగిలేలా చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. గుంటూరు-కృష్నా పరిధిలో వైసీపీనేరుగా పోటీలో లేదు. కానీ, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. వీరిలో వైసీపీ మద్దతు ఉంటుందన్న వ్యూహంతో ఆ పార్టీకి కొన్నాళ్ల కిందట రాజీనామా చేసిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కూడా ఉన్నారు. ఇదే పరిస్థితి దాదాపు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కనిపిస్తోంది. అంటే.. కూటమిని ఓడించడం ద్వారా.. ప్రజల్లో వ్యతిరేకత ప్రబలంగా ఉందని(గ్రాడ్యుయేట్లు) చెప్పేందుకు వైసీపీ ప్రయత్నించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి ఏంటి?
పరిశీలకుల అంచనా ఎలా ఉన్నా.. ప్రస్తుతం కూటమి పార్టీల మధ్య సఖ్యత పై స్థాయిలో బాగానే ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఏమాత్రం ఆశించినట్టుగా లేదు. ఎక్కడికక్కడ వివాదాలు, విభేదాలతోనే మసులుతున్నారు. అంతేకాదు.. పంపకాల విషయంలో చాలా ప్రాంతాల్లో విమర్శలు చేసుకుంటున్నారు. పదవుల విషయంలోనూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసుకుంటూ.. పలుచన అవుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి తరుణం కోసమే వైసీపీ ఎదురు చూసింది.
ఇప్పుడు దీనికి ఎన్నికలు కూడా తోడయ్యాయి. సో.. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఓడించడమో.. లేక తక్కువ మెజారిటీకి దిగిపోయేలా చేయడమో చేసి.. కూటమిపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్న ప్రచారం చేసేందుకు అవకాశం ఉందన్న పరిశీలకుల అంచనా సరైందేనని అంటున్నారు. మరి దీనిని రూపుమాపాలంటే.. రెండే స్థానాలైనప్పటికీ.. కలసి కట్టుగా.. కూటమి నేతలు ముందుకు నడవాల్సి ఉంది.