Begin typing your search above and press return to search.

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ఒక్కొక్క చోట ఒక్కొక్క టైపు!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వాములుగా ఉన్న టీడీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య రోజు రోజుకు క్షేత్ర‌స్థాయిలో విభేదాలు పెరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   1 Nov 2024 8:30 PM GMT
టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ఒక్కొక్క చోట ఒక్కొక్క టైపు!
X

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వాములుగా ఉన్న టీడీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య రోజు రోజుకు క్షేత్ర‌స్థాయిలో విభేదాలు పెరుగుతున్నాయి. ఈ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఇరు వైపుల పెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తున్నా.. అవి మాత్రం ఎక్క‌డా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో దీపావ‌ళి సంద‌ర్భంగా ఏర్పాటు దుకాణాల విష‌యంలో ఇరు పార్టీల అనుచ‌రులు రోడ్డున ప‌డి కొట్టుకున్నారు. ఇదే జిల్లాలోని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో పింఛ‌న్ల పంపిణీకి తాము కూడా వ‌స్తామ‌న్న జ‌న‌సేన నాయ‌కుల‌పై టీడీపీ నేత‌లు బాహాబాహీకి దిగారు.

దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఏకంగా.. నిప్పులు చెరిగారు. జ‌న‌సేన నాయ‌కుల‌కు, సామాజిక పింఛ‌న్ల‌కు సంబంధం ఏంటి? అని ప్ర‌శ్నించారు. ఇది త‌మ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇచ్చిన హామీ అని.. దీనిని తామే పంపిణీ చేసుకుంటామ‌ని.. `ఏనా.. డుకు` వస్తాడో చూస్తాం.. అంటూ నోరు చేసుకున్నారు. ఈ వ్య‌వ‌హారం మ‌రింత ముదిరి.. తిట్ల నుంచి కొట్టుకునే వ‌ర‌కు సాగింది. దీంతో ప‌లు మండ‌లాల్లో పింఛ‌న్ల పంపిణీని పోలీసులు నిలిపివేశారు.

ఇక‌, విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజ‌క‌వ‌ర్గంలో కూడా కూటమి నేతల మధ్య వార్ జోరుగా సాగుతోంది. జ‌న‌సేన ఎమ్మెల్యే లోకం మాధవికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు భేటీ అయ్యారు. టీడీపీ ఇన్ ఛార్జ్ కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. లోకం మాధ‌వి ఒంటెత్తు పోక‌డ‌ల‌కు పోతున్నార‌ని.. టీడీపీ నాయ‌కుల‌తో వివాదాల‌కు దిగుతున్నార‌న్న‌ది బంగార్రాజు అనుచ‌రులు చెబుతున్నారు.

తాజాగా రెండు రోజుల కింద‌ట‌.. నెల్లిమ‌ర్ల పంచాయ‌తీ స‌మావేశంలో మాధ‌వి .. బంగార్రాజును అవ‌మా నించార‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో మాధ‌విని క‌ట్ట‌డి చేయాల‌ని.. టీడీపీ కూడాప్ర‌చారం చేస్తేనే ఆమె గెలుపు గుర్రం ఎక్కార‌ని.. ఆమెకు సీటును త్యాగం చేశామ‌ని.. టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఈవిష‌యాన్ని సీఎం చంద్ర‌బాబుకు వివ‌రించేందుకు నాయ‌కులు రెడీ అయ్యారు. శ‌నివారం చంద్ర‌బాబు విజ‌య‌న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న దృష్టికి ఈ విష‌యం రానుంది. మ‌రి ఆయ‌న ఎలాంటి తీర్పు చెబుతారో చూడాలి.