Begin typing your search above and press return to search.

వెయిటింగ్‌లో యూత్ టీడీపీ.. విష‌యం ఇదే..!

టీడీపీ యూత్ వింగ్‌. దీని సేవ‌లు అపారం. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు రోడ్డెక్కారు.

By:  Tupaki Desk   |   13 Oct 2024 9:30 AM GMT
వెయిటింగ్‌లో యూత్ టీడీపీ.. విష‌యం ఇదే..!
X

టీడీపీ యూత్ వింగ్‌. దీని సేవ‌లు అపారం. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు రోడ్డెక్కారు. స‌ర్కారుకు వ్య‌తిరేకంగా పోరాడారు. కేసులు పెట్టించుకున్నారు. ఇక‌, నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర చేసిన‌ప్పుడు వారే ముందుండి న‌డిచారు. పార్టీ ని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు కూడా ఎంతో శ్ర‌మించారు. అలాంటి యూత్ నాయ‌కుల‌కు ఎన్నిక‌ల స‌మ‌యంలో అనేక హామీలు గుప్పించారు చంద్ర‌బాబు, నారా లోకేష్‌. పార్టీ ప‌ద‌వుల్లో 33 శాతం యువ‌త‌కే ఇస్తామ‌ని చెప్పారు. ఇక‌, నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ.. 15-20 శాతం వారికే ఇస్తామ‌న్నారు.

దీంతో యూత్ వింగ్ నాయ‌కులు రెచ్చిపోయి మ‌రీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌నిచేశారు. క‌ట్ చేస్తే.. ప్ర‌స్తుతం అధికారంలోకి వ‌చ్చి నాలుగు మాసాలు అయిపోయినా.. యువ‌త‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. నామినేటెడ్ ప‌ద‌వుల నుంచి పార్టీ ప్ర‌క్షాళ‌న వ‌ర‌కు కూడా ఎవ‌రికీ ఆశించిన ప్రాధా న్యం ద‌క్క‌డం లేద‌ని పార్టీలోనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి గ‌తంలో వైసీపీ కూడా ఇలానే క్షేత్ర‌స్థాయిలో యూత్ ను ప‌క్క‌న పెట్టింది. కొంద‌రిని ఎంపిక చేసుకుని వారికే బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

ఇప్పుడు కూడా దానికి భిన్నంగా ఏమీ జ‌ర‌గ‌డం లేదన్న‌ది టాక్‌. టీడీపీ యూత్ వింగ్‌లో మ‌రో కోణం కూడా ఉంది. వీరు డిజిట‌ల్ మాధ్య‌మాల ద్వారా దూకుడుగా ఉంటున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తి నియోజ క‌వ‌ర్గంలోనూ ఎమ్మెల్యే అభ్య‌ర్థులు ఈ సేవ‌ల‌ను వినియోగించుకున్నారు. ప్ర‌చారం చేయించారు. గెలిచి, నిలిచిన త‌ర్వాత‌.. ఈ ప్ర‌చారానికి కూడా బ్రేక్ ప‌డింది. దీంతో యువ‌త‌కు ఇప్పుడు చేతిలో చిల్లిగ‌వ్వ‌లేదు. మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చింద‌నే ఆనందం ఉన్నా.. ఆర్థికంగా ఇర‌కాటంలో ప‌డ్డారు.

ఈ నేప‌థ్యంలో యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తారా? లేదా? అని వారు ఎదురు చూస్తున్నారు. దీనిలో ప్ర‌ధానం గా వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై వారు ఆశ‌లు పెట్టుకున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ అభ్య‌ర్థులు ఇదే చెప్పారు. `చంద్ర‌బాబు వ‌లంటీర్ల‌ను కొన‌సాగిస్తాన‌ని చెబుతున్నారు క‌దా.. మీఅంద‌రికీ నేను అవ‌కాశం ఇస్తా. నెల‌కు 10 వేల వ‌ర‌కు వ‌స్తుంది. నేను చెబుతున్నాగా న‌మ్మండి` అని అభ్య‌ర్థులు బ‌ల‌మైన హామీ ఇచ్చారు. కానీ, ఈ విష‌యం నాలుగు మాసాలుగా నానుతూనే ఉంది. దీంతో యువ‌త త‌మకు ఎలాంటి దారి చూపిస్తారా? అని ఎదురు చూస్తున్నారు.