Begin typing your search above and press return to search.

పార్లమెంట్ లో పోలవరం చర్చకు టీడీపీ వైసీపీ సై !

విభజన హామీలలో అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి జీవనాడిగా ఉందని అయితే పదేళ్ళలో ఆ ప్రాజెక్ట్ నెమ్మదిగా సాగుతోందని అన్నారు.

By:  Tupaki Desk   |   25 Nov 2024 3:52 AM GMT
పార్లమెంట్ లో పోలవరం చర్చకు టీడీపీ వైసీపీ సై !
X

పోలవరం విషయంలో అధికార టీడీపీ విపక్ష వైసీపీ రెండూ కూడా ఒకే మాటకు వచ్చాయా అంటే రెండు పార్టీల పార్లమెంటరీ లీడర్లు మాట్లాడిన తీరుని చూస్తే అది అనిపిస్తోంది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రం నిర్వహించిన అఖిల పక్ష భేటీ తరువాత మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్ళుగా పోలవరం నిర్మాణంలో జరుగుతున్న తీరు తెన్నుల మీద చర్చ సాగాలని కోరారు.

విభజన హామీలలో అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి జీవనాడిగా ఉందని అయితే పదేళ్ళలో ఆ ప్రాజెక్ట్ నెమ్మదిగా సాగుతోందని అన్నారు. అయితే టీడీపీ అయిదేళ్ళ ఏలుబడిలో అత్యధిక శాతం పనులు పూర్తి అయ్యాయని చెబుతున్నారు. వైసీపీ అయిదేళ్ళ పాలనలోనే పోలవరం పనులు కేవలం మూడు శాతం మాత్రమే జరిగాయని అంటున్నారు.

దాంతో ఎవరి హయాంలో ఎంతెంత నిర్మాణం సాగింది. కారణాలు ఏమిటి అన్న దాని మీద పార్లమెంట్ లో చర్చ సాగాలని ఆయన కోరుకుంటున్నారు అని తెలుస్తోంది. దాంతో పాటు పెండింగులో ఉన్న విభజన హామీల మీద చర్చకు టీడీపీ ఎంపీలు సిద్ధపడుతున్నారు.

ఇక వైసీపీకి సంబంధించి లోక్ సభలో ఆ పార్టీ నేత అయిన మిధున్ రెడ్డి తాము కూడా పోలవరం మీద చర్చను పార్లమెంట్ లో లేవనెత్తుతామని అంటున్నారు. అయిఎత పోలవరం ఎత్తు తగ్గింపు అన్న దాని మీద ఎన్నో అనుమానాలు ప్రజలలో ఉన్నాయని అందువల్ల దాని మీద కేంద్రం సరైన వివరణ ఇవ్వడం కోసం చర్చిస్తామని చెబుతున్నారు. ఎత్తు తగ్గిస్తే పోలవరం ప్రాజెక్టు బహుళార్ధక సాధక ప్రాజెక్టు గా ఉండదని దాని వల్ల ఎక్కువగా ఉపయోగం ఉండదని ఆయన అంటున్నారు.

అంటే పోలవరం ఎత్తు తగ్గింపు అన్న దాని మీద టీడీపీ కూటమిని ఇరకాటంలో పెట్టడానికి వైసీపీ ఈ చర్చను కోరుకుంటోందా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. అలాగే టీడీపీ పోలవరం మీద చర్చ అంతా వైసీపీ అయిదేళ్ళ ఏలుబడిలో ఏ ఒక్క పనీ చేయకుండా సర్వనాశనం చేశారు అని చెప్పడానికేనా అన్నది కూడా చర్చిస్తున్నారు.

అయితే అలా కాకుండా రెండు పార్టీలు కలసి కేంద్రాన్ని పోలవరం ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అని నిగ్గదీయాలని జనాలు కోరుతున్నారు. అంతే కాదు పోలవరం ఎత్తు తగ్గించకుండా పాత డిజైన్ ప్రకారమే నిర్మించాలని కూడా కోరుతున్నారు. ఇక ఏపీకి విభజన హామీలు ఎన్నో ఇచ్చినా ఆచరణకు ఏ ఒక్కటీ నోచుకోలేదు, అందువల్ల వాటి మీద ఏపీకి చెందిన లోక్ సభ రాజ్యసభ సభ్యులు 36 మంది పట్టు బట్టాలని కోరుతున్నారు. అంతే తప్ప తమ రాజకీయాల కోసం పార్లమెంట్ లో చర్చను కోరితే ఏపీ ప్రయోజనాలకే చివరికి విఘాతం కలుగుతుందని అంటున్నారు.