Begin typing your search above and press return to search.

జగన్ వర్సెస్ బాలయ్య...బిగ్ పొలిటికల్ వార్ !

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ బాలయ్య ఫ్యాన్ అని ప్రచారంలో ఉంది.

By:  Tupaki Desk   |   12 Oct 2024 3:39 AM GMT
జగన్ వర్సెస్ బాలయ్య...బిగ్ పొలిటికల్ వార్ !
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ బాలయ్య ఫ్యాన్ అని ప్రచారంలో ఉంది. అయితే బాలయ్య టీడీపీకి చెందిన వారు. జగన్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి సొంత పార్టీ పెట్టుకుని టీడీపీకి గత దశాబ్దన్నరగా ఢీ కొడుతున్నారు. ఇక ఇద్దరికీ ఒక పోలిక ఉంది. ఇద్దరూ మాజీ సీఎంల కుమారులే. అక్కడ నుంచి సీఎం గా జగన్ ఎదిగారు. బాలయ్య సినీ రంగంలో అరుదైన రికార్డులు అందుకుంటూ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.

ఇక జగన్ ని బాలయ్య పెద్దగా తరచూ విమర్శించకపోయినా సమయం వస్తే మాత్రం ఘాటుగానే తగులుకుంటారు. ఇక జగన్ అయితే బాలయ్యను ఏ సందర్భంలోనూ ఒక్క మాట అన్న దాఖలాలు అయితే లేవు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరికీ ఇపుడు సరైన రాజకీయ సమరమే పడుతోంది.

హిందూపురం బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు. అక్కడ తొందరలో హిందుపురం మునిసిపాలిటీ చైర్ పర్సన్ కి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 38 మంది కౌన్సిలర్లకు గానూ వైసీపీ 30 సీట్లు గెలుచుకుంది. టీడీపీ కేవలం ఆరు వార్డులనే గెలుచుకుంది. ఆనాడు అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ హవా అలా సాగిపోయింది.

అయితే అధికారం నుంచి వైసీపీ తప్పుకోవడంతో స్థానిక సంస్థలలో ఉన్న వైసీపీ ప్రజా ప్రతినిధులు అంతా అధికార కూటమిలో చేరుతున్నారు. అలా వైసీపీకి చెందిన హిందూపురం చైర్ పర్సన్ ఇంద్రజ ప్లేట్ ఫిరాయించారు. ఆమె తనతో పాటు 11 మంది కౌన్సిలర్లను కూడగట్టుకుని టీడీపీలోకి వచ్చారు. ఆమె తన చైర్ పర్సన్ పదవికి రాజీనామా కూడా చేశారు.

టీడీపీ నుంచి కూడా ఆమెనే చైర్ పర్సన్ చేస్తారు అన్న ఒప్పందంతోనే ఇదంతా జరిగింది. 38 మంది కౌన్సిలర్లలో సగానికి కంటే ఎక్కువ అంటే 20 మంది ఉంటే చైర్ పర్సన్ ఈజీగా అవుతారు. ఆల్రెడీ టీడీపీకి ఆరుగురు ఉన్నారు. ఇపుడు వైసీపీ నుంచి 11 మందితో ఆ నంబర్ 17కి పెరుగుతుంది. ఇక హిందూపురం ఎంపీ ఎమ్మెల్యేతో పాటు ఇతర ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి టీడీపీకే చైర్ పర్సన్ పదవి దక్కుతుందని లెక్కలేసుకున్నారు

అయితే ఈ విషయంలో వైసీపీ కూడా సీరియస్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్ పర్సన్ పదవిని తామే దక్కించుకోవాలని చూస్తోంది. దాంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ టీడీపీ కూటమిలోకి వెళ్ళిన 11 మందిలో నలుగురిని వెనక్కి తెచ్చి జగన్ ముందు పెట్టారు. వారికి జగన్ కౌన్స్లింగ్ చేసి మరీ తమ శిబిరానికి తరలించారు.

దాంతో ఇపుడు టీడీపీ కూటమిలో కౌన్సిలర్లు తగ్గిపోయారు. మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ మంది ఉండడంతో రంగంలోకి బాలయ్య దిగాల్సి వచ్చింది అని అంటున్నారు. ఎలాగైనా హిందూపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్ ని గెలిపించుకోవడం మీద బాలయ్య సత్తా ఆధారపడి ఉంది అంటున్నారు.

దాంతో ఆయన ఫుల్ ఫోకస్ పెట్టేశారు. అటు వైసీపీ కూడా సీరియస్ గానే ముందుకు కదలడంతో ఈ ఎన్నిక ఉత్కంఠను రేపుతోంది. బాలయ్య ఇలాకాలో హిందూపురం మున్సిపాలిటీ నిలబెట్టుకుని ఝలక్ ఇవ్వాలని జగన్ చూస్తున్నారు. బాలయ్య కూడా అందివచ్చిన అవకాశాన్ని విజయంగా మార్చుకుని జగన్ మీద డైరెక్ట్ గా విజయం సాధించాలని చూస్తున్నారు.

దాంతో ఎన్నడూ లేని విధంగా హిందూపురం వేదికగా జగన్ వర్సెస్ బాలయ్యగా పొలిటికల్ వారి కి రంగం సిద్ధం అయింది. ఇంతకీ హిందూపురం చైర్ పర్సన్ ఎవరు అవుతారు అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా హిందూపురం ఇపుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య సైతం బావ చంద్రబాబు అల్లుడు లోకేష్ తో సరిసమానంగా రాజకీయ వ్యూహాలు వేస్తూ ప్రత్యర్ధులను చిత్తు చేస్తారన్న పేరుని తెచ్చుకోవాలంటే హిందూపురం మున్సిపాలిటీ సైకిలెక్కాల్సిందే.