Begin typing your search above and press return to search.

టీడీపీకి 'పొత్తు'పొడుపు.. అప్పటిలానే విజయం పక్కానా?

ఇక నలభై ఏళ్ల టీడీపీ ప్రస్థానం పరిశీలిస్తే.. 1983 నుంచి 1989, 1994-2004, 2014-19 (విభజత ఏపీ)లో అధికారంలో ఉంది.

By:  Tupaki Desk   |   15 Sep 2023 6:08 AM GMT
టీడీపీకి పొత్తుపొడుపు.. అప్పటిలానే విజయం పక్కానా?
X

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. టీడీపీ-జనసేన పొత్తు ఖరారు. ఈ విషయాన్ని జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించిన అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించడంతో ఇక సమరం ఎలా సాగనుందనే అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ బీజేపీని కలుపుకొని పోతామంటూ పవన్ పదేపదే చెబుతున్నారు. అంటే.. మూడు పార్టీలు కలిసి.. వైఎస్సార్సీపీని ఎదుర్కొననున్నాయి. ఇక నలభై ఏళ్ల టీడీపీ ప్రస్థానం పరిశీలిస్తే.. 1983 నుంచి 1989, 1994-2004, 2014-19 (విభజత ఏపీ)లో అధికారంలో ఉంది. ఏకధాటిగా ఆరేళ్లు ఒకసారి, పదేళ్లు ఒకసారి పాలించింది.

సగంసగం సక్సెస్

టీడీపీ 40 ఏళ్లలో 20 ఏళ్లు అధికారంలో కొనసాగింది. అంటే ఆ పార్టీ పుట్టిన తర్వాత సగం కాలం అధికారం చెలాయించింది. ఇక విభజిత ఏపీలో వెంటనే అధికారంలోకి వచ్చిన టీడీపీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అప్పటినుంచి వైఎస్ జగన్ సర్కారు అణచివేతలను ఎదుర్కొంటూ పోరాటం సాగిస్తోంది. ఒకవిధంగా ఇప్పుడు ఆ పార్టీది మనుగడ కోసం పోరాటం. 2024 లో జరిగే ఎన్నికల్లో గనుక అధికారంలోకి రాకుంటే టీడీపీ కష్టాలు రెట్టింపు అవుతాయనడంలో సందేహం లేదు.

పొత్తులో ప్రధాన లబ్ధిదారు

1982లో ఆవిర్భావం అనంతరం టీడీపీ 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. అప్పటి భావసారూప్య పార్టీలైన కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని ఘన విజయం సాధించింది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు నెలకొల్పింది. 1985 మధ్యంతర ఎన్నికల్లోనూ పొత్తులతోనే నెగ్గింది. అయితే, 1989 ఎన్నికల నాటికి వంగవీటి రంగా హత్యతో పరిణామాలు ప్రతికూలంగా మారి దారుణ పరాజయం చవిచూసింది. 1994 ఎన్నికల్లో మాత్రం కమ్యూనిస్టులతో మరోసారి జత కట్టి 200 పైగా సీట్లను గెలిచింది. ఇక 1999లో బీజేపీతో కలిసి వెళ్లి వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది. 2004లోనూ బీజేపీతో, 2009లో మహా కూటమి (బీఆర్ఎస్, టీడీపీ, వామపక్షాలు)గా ఎన్నికలకు వెళ్లినా ప్రతికూల ఫలితమే వచ్చింది.

విభజిత ఏపీలో వ్యూహాత్మకంగా కదిలి

వైసీపీని ఎదుర్కొంటూ.. 2014లో విభజిత ఏపీలో మొదట టీడీపీ గెలుపు కష్టమేననే అంచనాలున్నాయి. కానీ, చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, జనసేనను స్థాపించిన పవన్ కల్యాణ్ కూడా బాసటగా నిలవడంతో అద్భుతమైన విజయం దక్కించుకుంది. అయితే, 2019లో ఒంటరిగా మిగిలిపోయి ఎన్నికల్లో వైసీపీ చేతిలో చావుదెబ్బతిన్నది. కాగా, ఈసారి మళ్లీ 2014 నాటి పరిస్థితులే ఉండేలా కనిపిస్తున్నాయి.

పొత్తు పక్కా? విజయం ఖాయమా?

2024 ఎనికల్లో టీడీపీతో పొత్తుంటుందని పవన్ ప్రకటించడంతో ఇప్పటికైతే టీడీపీ, జనసేన కలిసి వెళ్లడం ఖాయమైని స్పష్టమైంది. బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనేది పక్కనపెడితే .. ప్రాథమికంగా రెండు పార్టీల పొత్తు ఖరారైనట్లే. మరి ఈ నేపథ్యంలో టీడీపీ ప్లస్ జనసేన గెలుపు ఖాయమా? అనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, రాజకీయాల్లో ఎప్పుడూ పరిణామాలు ఒకేలా ఉండవు. 2019లో బీజేపీ, జనసేన దూరం పెట్టడంతో ఒంటరైన టీడీపీ ఇప్పుడు పొత్తుకు అవసరం పడడమే ఇందుకు నిదర్శనం.