Begin typing your search above and press return to search.

ఆఖరి అస్త్రాన్ని తీసిన టీడీపీ కూటమి...వారిద్దరూ టార్గెట్ ..?

ఇదిలా ఉంటే ఏపీలో వివిధ జిల్లాలలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఈసీ బదిలీ చేసింది.

By:  Tupaki Desk   |   17 April 2024 3:37 AM GMT
ఆఖరి అస్త్రాన్ని తీసిన  టీడీపీ కూటమి...వారిద్దరూ టార్గెట్ ..?
X

ఏపీలో ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా తలపడనున్న టీడీపీ కూటమి ఇప్పటికే చేయాల్సినవి అన్ని చేస్తోంది. ఏపీలో అరశాతం ఓటు షేర్ ఉన్న బీజేపీని తమతో కలుపుకోవడం వెనక వ్యవస్థలను సానుకూలం చేసుకోవడం అన్న ముందు చూపు ఉందని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో వివిధ జిల్లాలలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఈసీ బదిలీ చేసింది. ఇది ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత జరిగే సాధారణ పరిణామమే. అయితే బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు.

ఏ ఏ చోట్ల బదిలీలు చేయాలి ఎవరిని నియమించాలి అన్న దాని మీద కూడా ఆమె లేఖ రాశారు. దాని మీద వైసీపీ మండిపడింది. ఇవన్నీ పక్కన పెడితే లేటెస్ట్ గా టీడీపీ కూటమి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి అతి ముఖ్యమైన డిమాండ్ ని ముందు పెట్టింది.

ఏపీలో సజావుగా ఎన్నికలు సాగాలి అంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే డీజీపీని బదిలీ చేయాల్సిందే అంటూ కోరింది. వారిని కనుక ఇదే పదవులలో కొనసాగిస్తూ ఎన్నికలకు వెళ్తే మాత్రం అధికార దుర్వినియోగం కచ్చితంగా జరుగుతుందని పేర్కొనడం గమనార్హం.

ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని కూడా టీడీపీ కూటమి తన భయాన్ని ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ కీలక అధికారులు ఇద్దరూ పదవుల్లో ఉంటే కనుక ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరిగే అవకాశం లేదని కూడా కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఇక ఏపీలో చాలా చోట్ల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటిని ఈసీ దృష్టికి తీసుకుని వచ్చారు. ఆయా చోట్ల వీడియో రికార్డింగ్ చేపట్టాలని వారు కోరడం జరిగింది. ఇక మరో విషయాన్ని కూడా ఈసీకి టీడీపీ కూటమి ప్రతినిధులు చెప్పారు.

ఈ రోజుకీ కొందరు అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అటువంటి వారిని గుర్తించి ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వినతి పత్రాన్ని అందచేశారు. ఇంటలిజెన్స్ ఐజీతో పాటు వివేక్ యాదవ్, రఘురామిరెడ్డిపై కూడా తాము ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు ఎన్నికల కమిషన్ ను కలిసిన అనంతరం టీడీపీ కూటమి నేతలు మీడియాకు తెలిపారు. ఈసీని కలిసి వచ్చిన వారిలో టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు, జనసేన నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అలాగే డీజీపీలను కోరి జగన్ ప్రభుత్వం తెచ్చుకుందని వారు వైసీపీకే అనుకూలంగా ఉంటారని విపక్షాలు అనుమానిస్తున్నాయి. వారు తమ వినతులు మాటల కంటే వైసీపీకే ఎక్కువ విలువ ఇస్తారని నమ్ముతున్నారు. దాంతో వారిని తప్పించాలని కోరుతున్నారు. మరి ఈసీ సంచలన నిర్ణయం ఆ దిశగా తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.