Begin typing your search above and press return to search.

2024లో ఇంక వెల్ఫేర్ స్కీమ్స్ ఉండవా ?

కట్ చేస్తే సరిగ్గా ఎన్నికలకు దగ్గర చేసి విపక్షాలు సైతం ఉచిత పధకాలకు అనుకూలంగా మాట్లాడడం మొదలెట్టాయి.

By:  Tupaki Desk   |   9 Aug 2024 4:30 PM GMT
2024లో ఇంక వెల్ఫేర్ స్కీమ్స్ ఉండవా ?
X

ఏపీ అంటేనే సంక్షేమ పధకాలు అన్నట్లుగా ఒకనాడు ఉండేది. ఇన్ని సంక్షేమ పధకాలు అమలు చేస్తే ఏపీ ఒక శ్రీలంకగా మారిపోతుందని మరో సోమాలియాను తలపిస్తుందని కూడా ఆనాడు విపక్షాలు ఘాటు కామెంట్స్ చేస్తూ వచ్చేవి. కట్ చేస్తే సరిగ్గా ఎన్నికలకు దగ్గర చేసి విపక్షాలు సైతం ఉచిత పధకాలకు అనుకూలంగా మాట్లాడడం మొదలెట్టాయి. తాము అధికారంలోకి వస్తే ఉచిత పధకాలు రెట్టింపు ఇస్తామని చెప్పారు.

టీడీపీ కూటమిలో ఉన్న టీడీపీ జనసేన అనేక రకాలైన పథకాలు ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ తీసుకుంటే సూపర్ సిక్స్ పేరుతో భారీ ఎత్తున ఉచితాలకు తెర తీసింది. వీటి అంచనాయే ఏడాది లక్షా అరవై వేల కోట్ల నుంచి ఎక్కువగా ఉంటుందని ఆర్ధిక నిపుణులు సైతం తేల్చారు. ఏపీ ఇంత భారం మోయలేదు అని కూడా అన్నారు.

కానీ టీడీపీ అధినాయకత్వం మాత్రం మరేమీ ఫర్వాలేదు సంపద సృష్టించి ఇస్తామని ఆదాయం పెంచితే పేదలకు పధకాలు ఉచితంగా ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదని పేర్కొంది. చంద్రబాబు అనుభవం ఆయన వ్యూహాలు జనాలకు నమ్మకం ఉంది కాబట్టి టీడీపీ రెట్టింపు పధకాలకు ఉచితాలకు జై కొట్టారు.

ఇక జూన్ 12న టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రెండు నెలలు పూర్తి అవుతునా ఉచితాల ఊసు అయితే లేదు. ప్రస్తుతం దీని మీదనే ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సూపర్ సిక్స్ అని ఎంతో ఆర్భాటం చేసిన ఉచిత పధకాలు 2024 ఏడాదిలో అమలులోకి రావా అన్నది సీరియస్ గానే డిస్కషన్ సాగుతోంది.

నిండు శాసన సభలో వ్యూహాత్మకంగానే చంద్రబాబు ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ శ్వేతపత్రంలో చూస్తే ఆర్ధిక విద్వంసం పెద్ద ఎత్తున గత ఐదేళ్ళలో జరిగింది అని చంద్రబాబు సభా సాక్షిగా చెప్పారు. ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తోంది అని కూడా అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చామని కానీ ఆర్ధిక వ్యవహరాలు చూస్తేనే ఆందోళనగా ఉంది అని బాబు చెప్పడం ద్వారా ఒక చర్చకు అయితే తెర తీశారు అని అంటున్నారు.

ఆ తరువాత కూడా జిల్లాల పర్యటనలో చంద్రబాబు ఖజానా ఖాళీ అని చెప్పారు. మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించారు. కానీ ఏమి చేయాలన్నా ఖజానా పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు అని బాబు అన్నారు. ఇలా చంద్రబాబు ఇండైరెక్ట్ గా చెబుతున్నారు తప్ప ఈ ఏడాది సూపర్ సిక్స్ పధకాలు అమలు చేస్తామని కానీ చేయమని కానీ ఎక్కడా క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. మంత్రులు కూడా అలాగే త్వరలో అమలు చేస్తామని అంటున్నారు కానీ ఫలానా డేట్ అని ఎక్కడా కమిట్ కావడం లేదు.

దీంతో ఎవరికి వారే ఈ ప్రకటనల మీద ఒక కంక్లూషన్ కి రావాల్సి వస్తోంది. పధకాలు అమలు అవుతాయా అంటే ఏమో అవ్వకపోవచ్చు అని నిర్ధారించుకునే పరిస్థితి అయితే ఉంది అని అంటున్నారు. ఈ ఏడాది అయితే పధకాలు అమలు చేయరని అనుకోవడమూ జరుగుతోంది. ఎందుకంటే ఇక ఈ ఆర్ధిక సంవత్సరంలో మిగిలినది గట్టిగా ఆరు నెలల సమయమే.

అయితే ఇక్కడే ఒక తిరకాసు కూడా ఉంది. ఉచిత పధకాలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమలు చేస్తే ఈ పాటికి ఆర్థిక ప్రయోజనాలు పెద్ద ఎత్తున జనాలకు అందేవి. దానికి కేలండర్ ఇయర్ ని తిప్పేసి ఒక ఏడాది వెనక్కి తోస్తే ఆ ఏడాది అంతా లబ్దిదారులకు నష్టం జరిగినట్లే కదా అని అంటున్నారు. మరి ఈ నష్టం ఎవరు భరించాలి అన్నది కూడా ప్రజలలో వస్తున్న చైతన్యం. ఒక విద్యా సంవత్సరం పూర్తి అయితే తల్లికి వందనం ద్వారా తమ పిల్లలకు ఎంత మంది ఉంటే అంత మంది అన్న లెక్కన దక్కే నగదు అందదు అని అంటున్నారు

అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒక్కో ఇంటికీ మూడు అంటే రెండు వేల అయిదు వందల రూపాయలు ఒక ఏడాదికి రావాల్సి ఉంటుంది. ప్రతీ 18 ఏళ్ళు నిండిన మహిళకూ ఏడాదికి 18 వేలు నగదు, అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం అంటే బయటకు వెళ్ళి వచ్చే వారికి బస్సు పాస్ రూపంలో నెలకు 1500 దాకా ఖర్చు అవుతుందని ఇది ఏడాదికి 18 వేలా దాకా రావాల్సింది నష్టమే కదా అన్నది కూడా విశ్లేషించుకునే లబ్దిదారులూ ఉన్నారు.

మరి ఉచితాలు పేరు చెప్పి గద్దెనెక్కిన తరువాత ఇవ్వకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారు అని ప్రజలు అడుగుతున్నారు. వారికి ప్రభుత్వం ఖజానా అప్పులు తిప్పలు బాధలు అవసరం లేదు వారికి ఒక హామీ ఇచ్చారు, అది అమలు చేసి తీరాల్సిందే. అది కూడా సర్కార్ గద్దెనెక్కిన వెంటనే చేయాలన్నది సగటు జనం భావన. మరి ఈ విషయాలో పాలకులకు జనాలకు మధ్య అతి పెద్ద గ్యాప్ అయితే ఉంది. చూడాలి మరి ఇది ఎటు వైపు దారి తీస్తుందో.