Begin typing your search above and press return to search.

టీడీపీ ప్లస్ జనసేన బజ్ లేదా ?

సచివాలయాల మీద దాడులు అలాగే వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడం వంటివి టీడీపీ ప్లస్ జనసేన క్యాడర్ చేయడంలో బిజీ కావడం పట్ల కూడా చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   7 Jun 2024 7:37 AM GMT
టీడీపీ ప్లస్ జనసేన బజ్ లేదా ?
X

టీడీపీ ప్లస్ జనసేన సూపర్ హిట్ కాంబో. ఇది 2014లోనే కాదు తాజా ఎన్నికల్లోనూ రుజువు అయింది. ఈ రెండు పార్టీలు కలిస్తే అధికారం కచ్చితంగా కలుస్తుంది అని ఏ సర్వేలూ అవసరం లేకుండా తేలుతున్న సత్యం. 2024 లో జరిగిన ఎన్నికల్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీని టీడీపీ జనసేన కూటమి సొంతం చేసుకుంది.

అది బ్రహ్మాండమైన విజయం అని దేశమంతా ఒకటికి పదిసార్లు అంటోంది. మరి దానికి సంబంధించిన సంబరాలు ఏ రేంజిలో చేయాలి అన్నది కూడా అంతా అంటున్న విషయం. కానీ ఆ సంబరాలు విజయోత్సవాలు పక్కన పెట్టేసి జగన్ కట్టించిన సచివాలయాల మీద క్యాడర్ పడడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది.

సచివాలయాల మీద దాడులు అలాగే వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడం వంటివి టీడీపీ ప్లస్ జనసేన క్యాడర్ చేయడంలో బిజీ కావడం పట్ల కూడా చర్చ సాగుతోంది. పచ్చ రంగులు తెచ్చి అన్ని భవనాలకూ పూయాలనుకోవడం ఇలాంటివే గత రెండు మూడు రోజులుగా చేస్తున్నారు.

నిజంగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఆ సంతోషాన్ని అంబరం తాకేలా చేసుకోవాలి. పది కాలాలు నిలిచిపోయేలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. కానీ అది ఎక్కడా కనిపించలేదు. వెంటనే ప్రతీకార దాడులకు తెగబడడం పట్ల అంత విస్తుబోతున్న నేపధ్యం ఉంది.

సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకోవాల్సింది పోయి ద్వేషంతో రాంగ్ డైరెక్షన్ లో తప్పులు చేస్తున్నారు అని అంటున్నారు. నిజానికి విజయం అందించే కిక్కు వేరు. ఆ మజా కంటే మత్తు వేరొకటి లేదు. అలా దానిని నూరు శాతం ఎంజాయ్ చేయాల్సిన చోట ఈ ఆవేశాలు ప్రతీకారాలు అవసరమా అన్న మాట వినిపిస్తోంది.

నిజమే ఏపీలో రాజకీయ అలా చీలిపోయి ఉంది. అటూ ఇటూ అంతా మోహరించిన పరిస్థితి ఉంది. గెలిచిన వారిలో ఆ రకమైన గర్వం ఉంటుంది. దానికి విజయాన్ని కలిపి ముందుకు సాగాలి తప్పించి ప్రత్యర్థుల మీద దాడులు చేస్తే వైసీపీ చేసిన తప్పులనే చేస్తే ఉపయోగం ఏమిటి అన్న చర్చ వస్తోంది.

ఒంగోలులో జరుగుతున్న దాడుల మీద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రావు రియాక్ట్ అవుతూ పవన్ కళ్యాణ్ కే నేరుగా అప్పీల్ చేశారు. ప్రతీక రాజకీయాలు వద్దు అని మీరు ఇచ్చిన సందేశం బాగుంది. హర్షణీయం కానీ ఒంగోలు లో మాత్రం అలా పరిస్థితి లేదని ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయని దీని మీద దృష్టి పెట్టి ఆపించేలా చూడాలని కోరారు.

ఈ విధంగా ఆయన పవన్ మీద ఉన్న ప్రేమతో అభిమానంతో ఈ వినతి చేసినట్లుగా కనిపిస్తోంది. పవన్ భారీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే ఇలా ట్వీట్ చేశారు. అదే విధంగా చాలా చోట్ల దాడులు జరుగుతుండడం పట్ల కూడా చర్చ సాగుతోంది. వైసీపీని ప్రజలు ఓడించారు అంటే ఇలాంటి తప్పుడు విధానాలు అనూరించడం వల్లనే అని గుర్తు చేస్తున్నారు.

అధికారం శాశ్వతం అని తమకు ఎవరూ సాటి లేరని ఇక జీవిత కాలం తామే ఉంటామని భావించి చేశారా అన్నంతగా వారి అయిదేళ్ళ పాలనలో జరగకూడని అరచకాలు ఎన్నో జరిగిపోయాయి. ఇక చంద్రబాబు లాంటి సీనియర్ అనుభవం కలిగిన నేత నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇక ఏపీని కాపాడుకోవాలి. విభజన గాయాలకు సరైన సమాధానం కనుగొనాలి. ఈ విషయంలో అవసరం అయితే రాజకీయాలకు అతీతంగా అంతా చేతులు కలపాల్సిన అవసరం ఉంది.

కేంద్రాన్ని ఒప్పించి అయినా ఏపీకి దక్కాల్సినవి అన్నీ సాధించాలి. అలాగే మరో అయిదేళ్ళు పదేళ్లలో అయినా ఏపీ రూపు రేఖలు మార్చాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అంతా ఆలోచన చేయాలి తప్పించి ఈ ద్వేష పూరిత రాజకీయాల వల్ల ఒరిగేది ఏమి ఉండదని అంటున్నారు. ఈ విషయంలో అంతా సంయమనం పాటిస్తేనే ఏపీ కి మంచి రోజులు వచ్చినట్లు అని అంటున్నారు.

ఆ దిశగా బాధ్యత కలిగిన పార్టీలు కూడా చొరవ తీసుకోవాలని క్యాడర్ కి సరైన దిశా నిర్దేశం చేయాలని కూడా పలువురు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీకి మంచి రోజులు రావాలన్నదే అయిదు కోట్ల మంది జనాల భావన అన్నది మాత్రం నూరు శాతం నిజం. అలా కాకుండా వేరే ఇతరత్రా ఎవరైనా వ్యవహరించినా అది చివరికి ఆయా పార్టీలకే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు.