Begin typing your search above and press return to search.

ఒక సంవత్సరం లో టీడీపీ - జనసేన కి విడాకులా ?

రెండు పార్టీలు కలసి సర్కార్ ని నడపడం అంటే ఆచరణలో కూడా కష్టసాధ్యం. ముందుగా వచ్చే సమస్య మంత్రి పదవుల నుంచే స్టార్ట్ అవుతుంది.

By:  Tupaki Desk   |   8 Jun 2024 10:30 AM GMT
ఒక సంవత్సరం లో టీడీపీ - జనసేన కి విడాకులా ?
X

ఈ మాట అనడానికీ వినడానికీ ఆశ్చర్యంగా ఉన్న కూడా ఇది ఫక్తు రాజకీయం. అందువల్ల జరగదు అనుకోవడానికి అయితే ఏ మాత్రం వీలు లేదు. ఎందుకంటే ఏపీలో మూడు పార్టీల వ్యవస్థ మెల్లగా వేళ్ళూనుకుంది. 2024 ఎన్నికల ఫలితాలను జాగ్రత్తగా గమనించిన వారికి అదే అర్ధం అవుతుంది. అధికార వైసీపీ కేవలం 11 సీట్లకే కుదేల్ అయిన నేపధ్యం ఉంది.

అదే సమయంలో జనసేన 21 సీట్లను రెండు ఎంపీలను సాధించింది. ఇక ఓట్ల పరంగా దాదాపుగా నలభై శాతం ఓటు షేరింగ్ వైసీపీ సాధించింది. ఆ పార్టీ దాంతో తిరిగి లేచేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఏపీలో మూడు పార్టీల వ్యవస్థ నుంచి రెండు పార్టీల వ్యవస్థగా మారితేనే అధికారం అవతల పక్షం చేతులు మారుతుంది.

అలా చూసుకుంటే సీట్ల పరంగా ముందున్న జనసేన 2029 ఎన్నికలను కచ్చితంగా టార్గెట్ గా పెట్టుకుంటుంది. ఆ ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలను వేసుకుంటుంది. ఒక రాజకీయ పార్టీగా జనసేన ఆశలు ఆకాంక్షలను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది.

కానీ ఏపీలో చూతే జగన్ ని ఓడించాలన్న ఉద్దేశ్యంతోనే టీడీపీ జనసేన చేతులు కలిపాయి. వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా ఒడిసి పట్టుకున్నాయి. ఆ విషయంలో సక్సెస్ అయ్యాయి. ఇపుడు అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చింది. ప్రభుత్వంలో రెండు పార్టీలూ ఉంటాయి.

రెండు పార్టీలు కలసి సర్కార్ ని నడపడం అంటే ఆచరణలో కూడా కష్టసాధ్యం. ముందుగా వచ్చే సమస్య మంత్రి పదవుల నుంచే స్టార్ట్ అవుతుంది. మంత్రి పదవులు ఎన్ని తీసుకోవాలి, కీలకమైన పోర్ట్ ఫోలియోలు ఎవరు తీసుకోవాలి ఇవన్నీ రాజకీయంగా చర్చల నుంచి రచ్చ దాకా సాగే వీలుంటుంది.

జనసేన త్యాగాలకు ఇక సిద్ధ పడకపోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ టార్గెట్ 2029 అయినపుడు ప్రతీ రోజూ విలువైనదే. అందువల్ల జనసేన దూకుడుగానే ఉంటుంది. మరి అధికారంలో ఉన్న టీడీపీ 135 సీట్లతో 16 మంది ఎంపీలతో పటిష్టంగా ఉన్న సైకిల్ పార్టీ తానే మరో టెర్మ్ గెలిచి పూర్తిగా అధికారం శాశ్వతం చేసుకోవాలని కూడా తలచవచ్చు.

అపుడే రెండు పార్టీల మధ్య విభేదాలు వస్తాయి. ప్రస్తుతానికైతే మంత్రి పదవుల విషయంలో ఎంతో కొంత అసంతృప్తి ఉన్నా సర్దుకుని పోవచ్చు. కానీ గిల్లి కజ్జాలు మాత్రం నియోజకవర్గాల్లో మొదలై అవి ఆధిపత్య పోరుకు దారి తీయడానికి అట్టే సమయం పట్టకపోవచ్చు అని అంటున్నారు.

అదే విధంగా చూస్తే మరో ఏణ్ణర్ధంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో తమ సత్తా చాటుకుని క్షేత్ర స్థాయిలో బలంగా ఉండాలని జనసేన తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. ముందు గ్రౌండ్ లెవెల్ లో గట్టిగా నిలబడితే అది 2029 నాటికి గెలుపునకు పునాది అవుతుందని కూడా భావించవచ్చు.

అలా దాని కోసం ప్రాతిపదికను సిద్ధం చేసుకుంటూ జనసేన పనిచేయడానికి ఒక రోడ్ మ్యాప్ ని రెడీ చేసుకుంటోంది. దాంతో ఆ విధంగానే చూస్తే జనసేన టీడీపీల మధ్య రాజకీయంగా ఆధిపత్య పోరుకు తెర లేచే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు.

జనసేనకు నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవి కూడా కీలకమైనవి అడిగే చాన్స్ ఉంటుంది. ఇక రెండు పార్టీలు ప్రభుత్వాన్ని నడిపేటపుడు మంచి జరిగితే క్రెడిట్ తీసుకోవడానికి రెండు పార్టీలు ఎవరికి వారు చూస్తారు. అదే చెడు జరిగితే మాత్రం ఆ నిందను భరించలేరు. అపుడు చూస్తే ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేని స్థితి నుంచి జనసేన ఆ పొజిషన్ కి రావడానికి చూస్తుంది. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేన కచ్చితంగా ప్రధాన పక్షం అవుతుంది.

అలా చూస్తే కనుక కచ్చితంగా ఒక ఏడాది కాలంలోనే రెండు పార్టీల మధ్య విభేదాలు మొదలై చెరో దారి తీసుకునే అవకాశాలు అయితే తప్పకుండా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దానికి ఉదాహరణగా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జి వర్మ మీద ఎంపీ ఉదయ్ కి సంబందించిన జనసైనికులు(టీడీపీ నుంచి కొత్తగా జనసేన లోకి వెళ్లిన కార్యకర్తలు) చేసిన దాడిగా చెబుతున్నారు. కాకినాడలో గొల్లప్రోలు మండలం వన్నెపైడి గ్రామానికి తమకు తెలియ చేయకుండా ఎందుకు వచ్చావు అంటూ వర్మ మీద జనసైనికులు విరుచుకుపడ్డారు.

తమకు తెలియకుండా గ్రామంలో ఇతర పార్టీల వారిని ఎందుకు కలుస్తున్నారు అని కూడా ప్రశ్నించారు. దీంతో షాక్ కి గురి అయిన వర్మ మీకు చెప్పాల్సిన అవసరం లేదని అనడంతో తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దాంతో తనను చంపేస్తారు అన్న భయంతో వర్మ కారులో పరార్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కధనాలు వచ్చాయి.

అనంతరం వర్మ తనను టీడీపీ నుంచి జనసేన లోకి తొమ్మిది నెలలు కింద వెళ్లిన జనసైనికులు తొమ్మిది నెలలుగా వేధిస్తున్నారు అని కూడా వర్మ వాపోవడం గమనార్హం. అంతే కాదు ఎంపీ ఉదయ్ కూడా వాళ్లకి సపోర్ట్ చేస్తున్నాడు అని కూడా చెప్పడం విశేషం .

ఈ ఒక్క ఘటన చూస్తే రానున్న రోజులల్లో ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన టీడీపీల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో అర్ధం అవుతుంది అని అంటున్నారు. పిఠాపురంలో వర్మ పెత్తనానికి మొదట్లోనే ఇలా జనసేన అడ్డుకట్ట వేసింది అని అంటున్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ గెలిచారు. అయితే మొత్తం ఇంచార్జిగా తానే బాధ్యతలు చూసుకుంటానని ఆయన చెప్పినా జనసేన ఊరుకోదు కదా. సో పిఠాపురం ఇపుడు జనసేనది, మరి వర్మ టీడీపీని బలోపేతం చేస్తే కచ్చితంగా ఇలాగే గొడవలు ఉంటాయని అంటున్నారు. ఈ విధంగా చూస్తే రానున్న రోజులల్లో రెండు పార్టీల మధ్య వివాదాలు పెరుగుతూనే ఉంటాయన్నది చెప్పక తప్పదు.