Begin typing your search above and press return to search.

జనసేన నంబర్ అది... టీడీపీ నంబర్ ఇది...!?

పొత్తులు ఉన్నాయి కానీ సీట్ల పంచాయతీ తెగడంలేదు. దాంతో అభ్యర్ధులు ఎవరో కూడా తెలియడంలేదు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 3:39 AM GMT
జనసేన నంబర్ అది... టీడీపీ నంబర్ ఇది...!?
X

పొత్తులు ఉన్నాయి కానీ సీట్ల పంచాయతీ తెగడంలేదు. దాంతో అభ్యర్ధులు ఎవరో కూడా తెలియడంలేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ విపక్షం పరిస్థితి ఇలా ఉంది అంటున్నారు. నిజానికి ఎన్నికలకు చాలా ముందుగా రెడీ కావాల్సింది విపక్షమే. వారు ఎపుడెపుడా ఎన్నికలు అని ఉంటారు. పైగా అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసుకుని జనంలో వారిని పెడితే ఎన్నికల వేళకు బలంగా తయారవుతారు. ఈలోగా అసంతృప్తులు అలకలు ఏమైనా ఉంటే సర్దిచెప్పుకోవడానికి వీలు అవుతుంది.


అయితే జనసేన టీడీపీల మధ్య అతి ముఖ్యమైన అంశంలోనే ఇంకా తేలాల్సిన కధ చాలా ఉంది అంటున్నారు. సీట్ల విషయం చిన్నది అయితే కాదు అని అంటున్నారు. జనసేనకు అరవై సీట్లు దాకా ఇవ్వాలని అలాగే ఎంపీలు కూడా గణనీయంగా ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. జనసేన నేతల సంగతి పక్కన పెడితే కాపు నేత మాజీ మంత్రి హరి రామజోగయ్య అయితే పవన్ కి లేఖల మీద లేఖలు రాస్తూ జనసైనికులలో ఆశలు పెంచుతున్నారు అని అంటున్నారు.

జనసేనకు ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాలలో పెద్ద ఎత్తున సీట్లు ఇవ్వాలని జోగయ్య లాంటి శ్రేయోభిలాషులు కోరుతున్నారు. అయితే టీడీపీ మదిలో మాత్రం వేరే విధంగా ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. అవేంటి అంటే జనసేనకు ఇరవై నుంచి పాతిక దాకా సీట్లు ఇచ్చి సరిపెట్టాలని ఉంది అని అంటున్నారు. ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తే ముప్పయి ముగించాలన్నది కూడా మరో మాటగా ఉంది అని అంటున్నారు.

మరి ఈ నంబర్ జనసేనకు సంతృప్తికరమా అంటే వీలు లేదనే జవాబు వస్తోంది. నలభై సీట్లు అయినా గరిష్టంగా ఇస్తే అందులో కూడా బలమైన సీట్లు ఇస్తే కనీసం ముప్పయి దాకా జనసేన గెలుచుకుని ఏపీలో బలమైన పార్టీగా అవతరిస్తుందని ఇక 2024లో కూటమి అధికారంలోకి వస్తే సీఎం విషయంలో ఏదైనా కోరే చాన్స్ కూడా అపుడే ఉంటుందని అంటున్నారు.

ఇలాంటి వాటిలో టీడీపీ ఎపుడూ ముందు జాగ్రత్త గానే ఉంటుంది అని అంటున్నారు. మ్యాజిక్ ఫిబర్ కి తక్కువ కాకుండా టీడీపీ చేసుకోదు అనే అంటున్నారు. అలా కనుక చూస్తే టీడీపీ ఎట్టి పరిస్థితిల్లోనూ 145 సీట్లకు తక్కువ కాకుండా పోటీ చేయదనే అంటున్నారు ఏపీలో టీడీపీకి వేవ్ ఉందని కూడా ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అందువల్ల తాము గెలవగలమని సొంతంగానే మంచి మెజారిటీని తెచ్చుకోగలమని కూడా భావిస్తున్నారుట.

దాంతో పాటుగా మిత్రపక్షంగా జనసేనకు సముచితమైన తీరులోనే సీట్లు కేటాయిస్తారు అని చెబుతున్నారు. ఈ లెక్కలు అన్నీ చూసుకున్నపుడు జనసేన అయితే టీడీపీ చెబుతున్న నంబర్ దగ్గరే సర్దుకుని పోవాల్సిన అనివార్యత ఏర్పడుతుందా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా టీడీపీకి జనసేనకు బలమున్న సీట్లు కోస్తాలోనే ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రెండు పార్టీలకు కూడా ఓటు బ్యాంక్ కూడా ఒకే చోట నుంచే వస్తోంది. సో ఇది నిజంగా ఒక విచిత్రమైన పరిస్థితిగానే ఉంది.

రెండు ప్రాంతీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఒక విశేషం అయితే రెండు బలమైన సామాజిక వర్గాల ఆశలు ఇమిడి ఉంచుకున్న పార్టీల పొత్తు అన్నది కూడా 2024 ఎన్నికల్లో ముందుకు రావడం మాత్రం ఆలోచించాల్సిందే అని అంటున్నారు.