టీడీపీ వర్సెస్ వైసీపీ... ట్వీట్స్ వార్ ఆన్ రామోజీ డెత్!
మీడియా మొఘల్, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు శనివారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Jun 2024 10:00 AM GMTమీడియా మొఘల్, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు శనివారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఇందులో భాగంగా... ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... ఉదయం నిద్రలేచిన అనంతరం మొబైల్ చూసినవారికి పలువురి స్టేటస్ లలో కానీ, న్యూస్ లో కానీ, మెసేజ్ లలో కానీ... రామోజీరావు మృతికి సంబంధించిన సమాచారం అందింది. దీంతో ఈ సమాచారం అందుకున్న ప్రజలు చాలా మంది షాక్ తిన్న పరిస్థితి. ఎవరూ ఊహించని పరిణామం.
ఈ సమయంలో రామోజీ మృతి పట్ల నరేంద్ర మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కేసీఆర్ లతో పాటు వైసీపీ అధినేత స్పందించారు. ఇందులో భాగంగా... రామోజీ రావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని జగన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఇదే క్రమంలో... రామోజీరావురి మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని.. తెలుగు పత్రికారంగానికి ఆయన దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు జగన్. ఇలా రామోజీ మృతిపట్ల వైఎస్ జగన్ స్పందిస్తే... మరోపక్క సోషల్ మీడియా వేదికగా పలువురు వైసీపీ శ్రేణులు మాత్రం భిన్నంగా స్పందిస్తుండటం గమనార్హం.
అవును... ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు మృతి చెందడంపై ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా యుద్ధమే జరుగుతుంది! ఇందులో భాగంగా పలువురు టీడీపీ కార్యకర్తలు... రామోజీ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరోపక్క వైసీపీ పైనా, వైసీపీ ప్రభుత్వం పైనా రామోజీ తప్పుడు కథనాలు రాశారని వైసీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు!
ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న పోస్టుల యుద్ధం పీక్స్ కి చేరుతున్నట్లు అనిపిస్తుంది. ఇందులో భాగంగా ఇరువర్గాలూ హద్దులు మీరి మరీ పోస్టులు పెట్టుకుంటున్నారని అంటున్నారు. అయితే... వివాదాలకు ఇది సమయం కాదని, ఈ సమయంలో సంయమనం పాటిస్తూ హుందాగా వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నారు.
ఏది ఏమైనా... రామోజీరావు మరణం తెలుగు జాతికి తీరని లోటని ఒకరంటే... తెలుగుదేశం పార్టీకి మరింత లోటంటూ కామెంట్లు పెడుతున్నారు! అయితే... వ్యక్తి ఎవరైనప్పటికీ మరణంపై మాత్రం రాజకీయాలు చేయడం ఏమాత్రం భావ్యం కాదని.. అలాంటి ఆలోచనలు చేయడం సమర్థనీయం కాదని.. ఇలాంటి సంస్కృతి పోవాలని పలువురు హితవు పలుకుతున్నారు.