Begin typing your search above and press return to search.

గెలిస్తే శభాషూ...ఓడితే అభాసూ !

ఏపీలో రెండే పార్టీలు ఇద్దరే నాయకులు. వీరిలోనే ఒకరు సీఎం అవుతారు. మరొకరు విపక్ష నేత అవుతారు.

By:  Tupaki Desk   |   27 May 2024 1:30 AM GMT
గెలిస్తే శభాషూ...ఓడితే అభాసూ !
X

ఏపీలో రెండే పార్టీలు ఇద్దరే నాయకులు. వీరిలోనే ఒకరు సీఎం అవుతారు. మరొకరు విపక్ష నేత అవుతారు. ఆడ మగ ఎవరూ అంటే జోతీష్కులు చెప్పేది ఏదో ఒకటే. అలాగే సర్వేలు జోతీష్కాలు ఉన్నాయి. అవి పక్కన పెడితే ధీమా కాస్తా అతిగా మారి అది మైండ్ గేం నుంచి సరి కొత్త వ్యూహాలకు మారి ఏపీ పొలిటికల్ హీట్ ని దారుణంగా పెంచేస్తోంది.

జగన్ అయితే విశాఖ చంద్రబాబు అయితే అమరావతి ఇది ముఖ్యమంత్రులు ప్రమాణం చేసే ప్రాంతాలు. ఇక డేట్ చూసుకుంటే వైసీపీ వారు అఫీషియల్ గా రిలీజ్ చేసిన దానిని బట్టి చూస్తే 9 గంటల 38 నిముషాల సుమూహూర్తం. టీడీపీ ఇంకా టైం చెప్పలేదు కానీ హంగామా ఆ పార్టీది పీక్స్ కి చేరింది.

మొత్తానికి రెండు పార్టీలూ తొమ్మిదవ తేదీన ప్రమాణానికి ఫిక్స్ అయిపోయాయి. జగన్ అని నేను అంటారని వైసీపీ శ్రేణులు ఉత్సాహ పడుతూంటే చంద్రబాబు అను నేను అంటారని టీడీపీ క్యాడర్ హుషార్ చేస్తోంది. ఇలా ఎవరికి వారుగా ముహూర్తాలు పెట్టేసుకుని డేట్లు ప్రకటించడం అన్నది గతంలో అయితే లేదు.

మరి ఇపుడు చూస్తే వేరే లెవెల్ అన్నట్లుగా ఉంది. మరి అలా ఎందుకు చేస్తున్నారు. కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అన్నది ఈవీఎం మిషన్లే చెప్పాలి. సరే జూన్ 4వ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కౌంటింగ్ కూడా జరుగుతుంది. కాస్తా వారం రోజులు మాత్రమే వ్యవధి ఉంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత రెండున్నర నెలల సుదీర్ఘ నిరీక్షణ చేసిన వారికి వారం రోజులు ఎంత. కళ్ళు మూసుకుంటే జూన్ 4 వచ్చేస్తుంది. ఫలితం చెప్పేస్తుంది. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ ఫలితం ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం అవుతుంది అంటే అది మళ్లీ మొదటికి వచ్చే చర్చగానే చూడాలి.

ఫలితం ఒక పార్టీకి అనుకూలం అయితే శభాష్ అని వేయి నోళ్ళ పొగుడుతారు. మొనగాడు అంటారు. బాహుబలి అంటారు. ఇంకా ఎన్ని విశేషణాలు ఉంటే అన్నీ తగిలిస్తారు. కొత్త ట్యాగ్స్ కూడా పెడతారు. రికార్డులు బద్ధలు అయ్యాయని అంటారు. సినీ రాజకీయ పరిభాషలో ఉన్న పదాలను అన్నీ తెచ్చి మరీ ఏర్చి కూర్చి దండలా విజేత మెడలో వేస్తారు.

మరి ఓడిన పార్టీని ఏమంటారు. వారి పరిస్థితి ఏమిటి అంటే పరాజితులు కచ్చితంగా అభాసుపాలు అవుతారు. అది అలాంటి ఇలాంటిది కానే కాదు, సాధారణంగా పోలింగ్ కి ఫలితాలను మధ్యన గమ్మున కూర్చుంటే రిజల్ట్ ఏ తీరుగా వచ్చినా ఓకే అని వారు అనుకుంటే అపుడు కూడా విమర్శలు ఉన్నా ఒక మోతాదుకు మించవు.

కానీ పోలింగ్ ఒక వైపు జరుగుతూండగానే తోపూ తురుమూ అనుకుంటూ తామే గెలిచామని పార్టీలు చేస్తున్న సంబరాలు హడావుడి చూసిన మీదట తీరా ఫెయిల్యూర్ పలకరిస్తే మాత్రం అభాసు పాలు కావడం మామూలుగా ఉండదు, తాటాకులు కడతారు, ఇంకా ఘాటు విమర్శలు చేస్తారు. కొత్త డిక్షనరీలు తెలుగులో కనిపెట్టేలా నిందలూ నిష్టూరాలు నిండుగా ఉంటాయని అంటున్నారు.

మరి క్యాడర్ సంగతిని కూడా ఆయా పార్టీలు ఆలోచించుకున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ మొత్తం రాజకీయంలో ప్రజలు ఓకే. వారు మనసారా గెలిపించిన పార్టీ కాబట్టి మేమే అంతిమ ప్రభువులం అని సంతోషిస్తారు. కానీ క్యాడర్ అలా కాదే. వారు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు. ఓటమిని అధినాయకత్వం ఏదోలా తట్టుకున్నా క్యాడర్ మాత్రం దాన్ని అనూహ్యంగా తీసుకుంటుంది.

ఎందుకంటే డూ ఆర్ డై అన్న సిట్యూవేషన్ ని పార్టీలే తెచ్చాయి. వారే అంత ఖండితంగా కచ్చితంగా అంటూ దూకుడు చేశాయి. ఆఖరి వరకూ అదే టెంపో కంటిన్యూ చేశాయి. ఆనక రిజల్ట్ వచ్చి చావు కబురు చల్లగా చెబితే తట్టుకోవడం క్యాడర్ గుండెకు కష్టమేనా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఏది ఏమైనా దేశంలో ఎక్కడా లేని అతి రాజకీయం మితిమీరిన రాజకీయం ఏపీలో జరిగింది అని అంతా అంటున్నారు. దాని ఫలితాలు పర్యవసానాలు ఎలా ఉంటాయో అన్నదే ప్రజాస్వామ్య ప్రియులతో పాటు మేధావులను వేధిస్తున్న ప్రశ్నగా ఉంది.