Begin typing your search above and press return to search.

హోం మంత్రి వనితపై దాడికి యత్నం... నల్లజర్లలో రాత్రి ఏమి జరిగింది?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటుండటం కలకలం రేపుతోంది.

By:  Tupaki Desk   |   8 May 2024 9:17 AM GMT
హోం మంత్రి వనితపై దాడికి యత్నం... నల్లజర్లలో రాత్రి ఏమి  జరిగింది?
X

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటుండటం కలకలం రేపుతోంది. పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రచారం హోరు, జోరు పెరుగుతున్న సమయంలో ప్రత్యర్థిపార్టీ జనాలు దాడికి దిగుతున్నారు! ఈ క్రమంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై దాడికి తెగబడ్డాయి టీడీపీ శ్రేణులు! ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది!

అవును... మంగళవారం అర్థరాత్రి గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని నల్లజెర్లలో ప్రచారం ముగించుకుని స్దానికంగా ఉన్న మాజీ జెడ్పీటీసీ ఇంటికి వెళ్లారు తానేటి వనిత. ఈ సమయంలో ఆమెపై దాడికి ప్రయత్నించారు టీడీపీ కార్యకర్తలు! ఈ సమయంలో ఆమెను సెక్యూరిటీ సిబ్బంది ఒక గదిలో ఉంచి భద్రత కలిగించగా.. బయట ఆ అల్లరి మూకలు అక్కడ ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ.. తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు.

ఈ సమయంలో కర్రలు, రాళ్లతో టీడీపీ శ్రేణుల చేసిన దాడిలో పలు వాహనాలతో పాటు ఫర్నిచర్ కూడా ధ్వంసం అయ్యింది! ఈ దాడుల్లో ఐదుగురు వైసీపీ కార్యకర్తలు గాపడ్డారని చెబుతున్నారు. ఈ సమయంలో ఘటనా స్థలానికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు!

ఈ సమయంలో... శాంతి భద్రతలను పర్యవేక్షించే హోంమంత్రిపై దాడికి యత్నించడాన్ని వైసీపీ ముక్తకంఠంతో ఖండిస్తోంది. విషయం తెలుసుకున్న ఎస్పీ జగదీష్‌.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చిన పోలీసులు.. మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నల్లజర్లలో భారీగా మోహరించారు. సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు!!

ఈ నేపథ్యంలో... తనపై దాడికి యత్నించడంపై హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. ఇందులొ భాగంగా... టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, మహిళ అని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించారని అన్నారు. హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?.. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు!.. అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. సాక్షాత్తూ హోం మంత్రిపై దాడి చేయాలనే ఉద్దేశంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.