ఏపీలో మిగిలిన కేబినెట్ బెర్త్ ఎవరి కోసం?... ట్రైనింగ్ మాత్రం మస్ట్!
వీరిలో టీడీపీ నుంచి 20 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం దక్కింది.
By: Tupaki Desk | 13 Jun 2024 10:26 AM GMTఏపీలో కొత్త కూటమి కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయగా.. జనసేన అధినేత చంద్రబాబుతో కలిసి మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో టీడీపీ నుంచి 20 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం దక్కింది.
ఇందులో భాగంగా జనసేన నేతలకు కీలక మంత్రిత్వ శాఖలను ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ కు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నారని తెలుస్తుంది. ఈ విషయంలో పవన్ కు ఆయన కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో... నాదేండ్ల మనోహర్ కు పౌర సరఫరాలు, కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖలను కేటాయించబోతున్నారని సమాచారం. ఆ సంగతి అలా ఉంటే... ఇప్పటికే 24 మందిని కేబినెట్ లోకి తీసుకోగా మరో బెర్త్ ను చంద్రబాబు ఖాళీగా ఉంచారు. దీంతో ఆ స్థానం ఎవరి కోసం అట్టే పెట్టి ఉంచారనేది ఆసక్తిగా మారింది.
ఇందులో భాగంగా... ఈ మంత్రి పదవిని టీడీపీ నేతలకే ఇస్తారా.. లేక, మిత్రపక్షాలకు కేటాయించబోతున్నారా అనేది ఆసక్తిగా మారింది. మరోపక్క భారతీయ జనతాపార్టీ మరో మంత్రి పదవి అడుగుతున్నట్లు చెబుతున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది వేచి చూడాలి.
అయితే... సామాజికవర్గాల వారీగా చూస్తే ఏపీలో బ్రాహ్మణులకు, క్షత్రియులకు కేబినెట్ లో చోటు దక్కలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎస్సీలను చిన్న చూపు చూశారని అంటున్నారు! ఈ సమయంలో ఇంకా స్పీకర్ పదవి, ఒక కేబినెట్ బెర్త్ తో పాటు విప్, చీఫ్ విప్ మొదలైన పదవులుండటంతో... బాబు ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఆసక్తిగా మారింది.
మరోపక్క ఎంపికైన మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇందులో భాగంగా శాఖల్లో ఫైల్స్ ను ఎలా నిర్వహించాలి.. ఏమి చేయాలి.. ఏమి చేయకూడదు అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. ఇదే సమయంలో... రోజువారీ కార్యకలాపాల్లో మంత్రులకు సహకరించేందుకు ఎంబీఏ అర్హత కలిగిన వారిని నియమిస్తామని బాబు తెలిపారు.