కుర్చీల ఏర్పాటులో రేవంత్ ను ఫాలో అయితే బాగుండు బాబు
ఆలస్యం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అనుసరిస్తున్న విధానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఫాలో అయితే బాగుండన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 17 July 2024 4:45 AM GMTచిన్న విషయాలే కానీ చాలా తేడాలకు కారణమవుతుంది. అన్ని బాగున్నప్పుడు ఓకే. కానీ.. కాలం గడిచే కొద్దీ తేడాలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు అంతా ఓకే అన్నట్లుగా ఉండే అంశాలు.. అప్పుడు మాత్రం లెక్కల్లోకి.. వంతుల్లోకి వెళుతుంటాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు.. వార్తలు బయటకు వచ్చాయి. ఇక్కడే ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. ఏపీ కేబినెట్ భేటీ ఫోటోలను.. తెలంగాణలో జరిగే కేబినెట్ భేటీతో పోల్చి చూపిస్తూ.. చంద్రబాబు కేర్ ఫుల్ గా ఉంటే బాగుండదన్న సూచనను చేస్తున్నారు.
ఆలస్యం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అనుసరిస్తున్న విధానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఫాలో అయితే బాగుండన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ టీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ కేబినెట్ భేటీకి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించే మంత్రి వర్గ సమావేశానికి తేడా ఏమిటన్న సందేహం రావొచ్చు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక పోలిక కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన కేసీఆర్.. జగన్మోహన్ రెడ్డిలకు తిరుగులేని అధిక్యత ఉంది. వారిని సరి సమానంగా వచ్చే వారెవరూ లేరు.
కానీ.. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. తెలంగాణ విషయానికి వస్తే.. ముఖ్యమంత్రే రాష్ట్రానికి సూపర్ పవర్ అయినప్పటికి.. తెలంగాణ అధికారపక్షంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా సీఎం రేవంత్ తనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తనతో సమానంగా.. తన పక్క కుర్చీ వేసి కూర్చోబెట్టుకోవటం పలు సందర్భాల్లో చూస్తున్నదే. అదే సమయంలో ఏపీలోనూ కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఉందని చెప్పాలి. అనుభవంలో కావొచ్చు.. మరే విషయంలోనూ చంద్రబాబుతో సరి సమానంగా ఉండే నేతలు ఎవరూ ఏపీ కేబినెట్ లో లేరు. కానీ.. ఈ రోజున ఇంతటి చారిత్రక విజయం సొంతమైందంటే కారణం.. జనసేన టీడీపీతో జత కట్టటంగా చెప్పక తప్పదు.
చంద్రబాబుతో పోల్చినప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయంగా అనుభవ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ.. తాజా ఎన్నికల్లో తిరుగులేని అద్భుత మెజార్టీకి కారణం జనసేన అధినేత పవన్ అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ లు వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఎలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయో.. ఏపీలోనూ ఉన్నాయి. అలాంటప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ మాదిరి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన పక్కన కుర్చీలు ఏర్పాటు చేసి.. పవన్ ను కూర్చోబెట్టుకుంటే బాగుంటుందని చెబుతున్నారు.
మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీని చూస్తే.. చంద్రబాబు హెడ్ గా.. ఆయనకు రెండు వైపులా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ముఖ్యఅధికారి ఉన్నారు. తర్వాతి కుర్చీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉంటే.. మరో వైపు లోకేశ్ ఉన్నారు. ఇప్పుడున్న కాంబినేషన్ లో తెలంగాణలో మాదిరి.. ముఖ్యమంత్రి.. ఆయన పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్.. రెండు వైపులా ప్రభుత్వానికి కీలకంగా వ్యవహరించే అధికారులతో కలిసి భేటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల కేబినెట్ భేటీ పోలిక తెర మీదకు వచ్చిన వేళ.. చంద్రబాబు తన తీరును మార్చుకుంటారా? లేదంటే ఇప్పుడున్న విధానాన్నే ఫాలో అవుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.