చంద్రబాబు ఫ్లెక్సీలకు చెప్పు దెబ్బలు.. టీడీపీ కార్యకర్తలు ఫైర్!
ఈ సమయంలో ఈ టిక్కెట్ కి అభ్యర్థిని మార్చడంతో తమ్ముళ్లు ఒక్కసారిగా నిప్పులు కక్కారు!
By: Tupaki Desk | 21 April 2024 10:43 AM GMTనామినేషన్ల పర్వం మొదలైన తర్వత కూడా టీడీపీలో ఇంకా టిక్కెట్ల లొల్లి జరుగుతూనే ఉంది. ఇప్పటికే టిక్కెట్లు ఇచ్చినట్లు ప్రకటించేసి.. నామినేషన్లకు సిద్ధమవుతున్న సమయంలో కూడా అభ్యర్థులను మార్చిన ప్రక్రియపై పలువురు ఫైర్ అవుతున్నారు. ఈ సమయంలో టీడీపీ మడకశిర ఎమ్మెల్యే టికెట్ పై ఉత్కంఠ కొనసాగింది. ఈ సమయంలో ఈ టిక్కెట్ కి అభ్యర్థిని మార్చడంతో తమ్ముళ్లు ఒక్కసారిగా నిప్పులు కక్కారు!
అవును... మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్ కుమార్ కు టీడీపీ తొలుత మడకశిర టికెట్ కేటాయించింది. అయితే ఈ నిర్ణయాన్ని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తీవ్రంగా వ్యతిరేకించారు! దీంతో చంద్రబాబు పునరాలోచనలోపడ్డారని అంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు టికెట్ కేటాయిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో సునీల్ వర్గీయులు ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా.. మొదట టిక్కెట్ సునీల్ కే కేటాయించి, తీరా ఇప్పుడు బీ-ఫారం మాత్రం ఎం.ఎస్. రాజుకు కేటాయించడంపై తమ్ముళ్లు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా... శ్రీసత్యసాయి జిల్లా మడకశిర టీడీపీ ఆఫీసు వద్ద ఉన్న చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసిన సునీల్ వర్గీయులు.. చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ జెండాలు దహనం చేసి నిరసన తెలిపారు.
కాగా... తాజాగా అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో టీడీపీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఉండి, పాడేరు, మాడుగుల, వెంకటగిరి, మడకశిర స్థానాల్లో మార్పులు జరిగాయి. ఈ క్రమంలో ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుకు అవకాశం దక్కింది. ఆయనతో పాటు గిడ్డి ఈశ్వరి (పాడేరు), బండారు సత్యనారాయణమూర్తి (మాడుగుల), ఎంఎస్ రాజు (మడకశిర), కురుగొండ్ల రామకృష్ణ (వెంకటగిరి)కి టికెట్లు ఖరారు చేశారు.