Begin typing your search above and press return to search.

టీడీపీ జాబితా మరింత ఆలస్యం ?

బీజేపీకి ఇచ్చే సీట్లు, నియోజకవర్గాలు ఫైనల్ కానిదే టీడీపీ, జనసేన సీట్లు, నియోజకవర్గాలు ఫైనల్ కావని అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Feb 2024 4:30 PM GMT
టీడీపీ జాబితా మరింత ఆలస్యం ?
X

ఒకవైపు అభ్యర్ధులను ప్రకటిస్తు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతుంటే మరోవైపు టీడీపీ కూటమి మధ్య పొత్తు చర్చలే ఫైనల్ కాలేదు. పొత్తుచర్చలు, సీట్ల సర్దుబాటు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. టీడీపీ, జనసేన మధ్య మాత్రమే అయితే సీట్ల సర్దుబాటు ఎప్పుడో అయిపోయేదేమో. ముందుగా అనుకున్నట్లుగానే అభ్యర్ధులను ప్రకటించేసి రెండుపార్టీలు ప్రచారంలోకి దూకేవే అనటంలో సందేహంలేదు. అయితే సడెన్ గా బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. దీనివల్లే టీడీపీ, జనసేన మధ్య జరిగిన పొత్తు చర్చలు కూడా డిస్ట్రబ్ అయిపోయాయని సమాచారం.

బీజేపీకి ఇచ్చే సీట్లు, నియోజకవర్గాలు ఫైనల్ కానిదే టీడీపీ, జనసేన సీట్లు, నియోజకవర్గాలు ఫైనల్ కావని అందరికీ తెలిసిందే. బీజేపీతో సీట్లు, నియోజకవర్గాలు ఫైనల్ కావాలంటే ముందు చంద్రబాబునాయుడు ఎన్డీయేలో చేరాలి. టీడీపీ ఎన్డీయేలో పార్టనర్ అయిన తర్వాతే బీజేపీ పొత్తు చర్చలు చేస్తుంది. అందుకనే పవన్ కల్యాణ్ తో కలిసి చంద్రబాబు 20వ తేదీన ఢిల్లీకి వెళ్ళే అవకాశముంది. ఆ తర్వాత ముహూర్తం చూసుకుని ఎన్డీయేలో చేరుతారు. ఆ తర్వాతే సీట్ల సంఖ్య, నియోజకవర్గాలపై చర్చలు జరుగుతుంది.

ఇవన్నీ తేలాలంటే కనీసం పదిరోజులు పడుతుందని పార్టీవర్గాల సమాచారం. పొత్తులో బీజేపీకి ఎన్ని సీట్లివ్వాలి, కేటాయించబోయే నియోజకవర్గాలు ఏవనే విషయంపై చంద్రబాబులో క్లారిటి ఉన్నప్పటికీ దాన్ని బీజేపీ నాయకత్వం కూడా ఆమోదించాలి. సీట్ల సంఖ్య, నియోజకవర్గాల విషయంలో బీజేపీ నాయకత్వం కూడా క్లారిటితోనే ఉందనే ప్రచారం తెలుస్తోంది. అందుకనే రెండుపార్టీల మధ్య పొత్తుల్లో సీట్ల సంఖ్య, నియోజకవర్గాలపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పట్టేట్లుంది.

నిజానికి సీట్ల సంఖ్య, నియోజకవర్గాలు ఫైనల్ కావటంలో జరుగుతున్న జాప్యంతో ఎక్కువ నష్టం టీడీపీకే కాని బీజేపీ, జనసేనకు కాదు. ఎందుకంటే మూడుపార్టీల్లో బలమైన నేతలు, క్యాడర్ ఉన్న పార్టీ అంటే టీడీపీని మాత్రమే చెప్పుకోవాలి. బీజేపీకి నియోజకవర్గాల్లో దిక్కూ దివాణంలేదు. జనసేనకు అసలు పార్టీ నిర్మాణమే లేదు. కాబట్టి పై విషయాలను గమనించిన తర్వాత టీడీపీ జాబితా మరింత ఆలస్యమయ్యేట్లుంది. మరి ఎప్పుడు రిలీజవుతుందో చూడాలి.