వైసీపీ కంచుకోట జిల్లాలో టీడీపీ అభ్యర్థులు వీరే!
ఈ క్రమంలో వైసీపీ కంచుకోట జిల్లాగా పేరొందిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు తమ అభ్యర్థులను ఫైనల్ చేశారు.
By: Tupaki Desk | 5 Feb 2024 1:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో టీడీపీ ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తోంది. అభ్యర్థుల ఆర్థిక స్థోమత, సామాజిక సమీకరణాలు, జనసేన పార్టీతో పొత్తు, సర్వే నివేదికలు దగ్గర పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.
ఈ క్రమంలో వైసీపీ కంచుకోట జిల్లాగా పేరొందిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు తమ అభ్యర్థులను ఫైనల్ చేశారు. నెల్లూరు జిల్లాలో మొత్తం పది సీట్లు ఉండగా 2019 ఎన్నికల్లో పదికి పది సీట్లను వైసీపీ ఎగరేసుకుపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి నెల్లూరు జిల్లాలో అత్యధిక స్థానాలను కొల్లగొట్టాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్న పది సీట్లలో ఏడు స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ఫైనల్ చేశారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదేశాలను జారీ చేశారు.
నెల్లూరు సిటీకి విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను, నెల్లూరు రూరల్ కు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎంపిక చేశారు. అలాగే ఆత్మకూరు సీటును వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి కేటాయించారు.
సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకు, గూడూరులో పాశం సునీల్ కుమార్ కు, కావలిలో ప్రముఖ కాంట్రాక్టర్ కావ్యా కృష్ణారెడ్డికి సీట్లు లభించాయి.
కాగా నెల్లూరు జిల్లాలో ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఉదయగిరి, కోవూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
అయితే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేల్లో ఇద్దరికి మాత్రమే సీట్లు ఇచ్చారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీట్లు దక్కించుకోగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం చంద్రబాబు ఇంకా ఫైనల్ చేయలేదు. బొల్లినేని రామారావు కూడా ఉదయగిరి సీటును ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయగిరిపై కసరత్తు సాగుతోంది.
మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఇంఛార్జిగా కావ్య కృష్ణారెడ్డిని నియమించారు. కావలి టౌన్ పార్టీ అధ్యక్షుడిగా గుత్తికొండ కిషోర్ బాబుకు బాధ్యతలు అప్పగించారు.