Begin typing your search above and press return to search.

ఆ ఒక్క మంత్రీ అక్కడ నుంచి వస్తారట ?

ముఖ్యమంత్రి చంద్రబాబు వదిలేసిన ఒకే ఒక్క కేబినెట్ ఖాళీ మీద భారీ స్థాయిలో చర్చలు సాగుతున్నాయి.

By:  Tupaki Desk   |   20 July 2024 3:25 AM GMT
ఆ ఒక్క మంత్రీ అక్కడ నుంచి వస్తారట ?
X

ముఖ్యమంత్రి చంద్రబాబు వదిలేసిన ఒకే ఒక్క కేబినెట్ ఖాళీ మీద భారీ స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. ఈ మంత్రి పదవి ఎవరికి దక్కుతుందని అంతా తర్జన భర్జన పడుతున్నారు. మొత్తం 139 మంది కూటమి ఎమ్మెల్యేలు అంతా ఆ ఒకే ఒక్క మంత్రి పదవి మీద గురి పెట్టి ఉన్నారు.

జనసేన అయితే మూడు మంత్రి పదవులకు అదనంగా మరోటి దక్కితే దానిని ఉత్తరాంధ్రకు సర్దుకుందామని చూస్తోంది. బీజేపీ అయితే విశాఖ లేదా శ్రీకాకుళం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో ఒకరికి చాన్స్ ఇవ్వాలని చూస్తోంది.

టీడీపీలో చూస్తే మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలలో హెవీ కాంపిటేషన్ ఉంది. అయితే బాబు మదిలో ఏముందో అన్నది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు అని అంటున్నారు. కానీ బాబు ఆలోచనలు చూస్తే అసెంబ్లీ నుంచి ఎవరికీ మంత్రి పదవి దక్కకపోవచ్చు అని అంటున్నారు. అంటే ఎమ్మెల్యేల కోటా భర్తీ అయింది అన్న మాట. ఇక ఎమ్మెల్సీల కోటా నుంచే మంత్రిని తీసుకుంటారు అని అంటున్నారు.

అది కూడా ఉమ్మడి క్రిష్ణా జిల్లా నుంచి అయినా లేదా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి అయినా ఉండొచ్చు అని అంటున్నారు. ఇక రానున్న కాలంలో ఎమ్మెల్సీల ఎంపిక అయినా లేదా తీసుకునే మంత్రి అయినా పార్టీ భవిష్యత్తుకు ఉపయోగపడే నేతలకే అని అంటున్నారు.

ఇటీవల ఎన్నికల్లో టీడీపీ విజయానికి అన్ని సామాజిక వర్గాలు కృషి చేశాయి. అయితే దాదాపు అన్ని సామాజిక వర్గాలకు చోటిచ్చిన చంద్రబాబు రెండు సామాజిక వర్గాలను దూరం పెట్టారని అంటున్నారు. ఆరేడు ఎమ్మెల్యేలు గెలిచిన క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కలేదు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి అయితే ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు. అయితే ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చి మంత్రిగా చేయవచ్చు అని అంటున్నారు.

అయితే టీడీపీ హై కమాండ్ మాత్రం భవిష్యత్తు రాజకీయాలతో పాటు సమీకరణలను దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తోందని అంటున్నారు. దాంతో ఎవరికైనా చాన్స్ ఉండొచ్చు. అయితే వారు మాత్రం తప్పకుండా ఎమ్మెల్సీగా ఉండాల్సిందే.

ఇపుడు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు టీడీపీకి ఉన్నారు. అయితే వీరిలోనే మంత్రి పదవి ఇస్తారా లేక రానున్న రోజూల్లో భర్తీ అయ్యే ఖాళీలలో ఎంపిక అయిన వారికి ఇస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా మంత్రి పదవి అంటే అందరికీ మోజుగానే ఉంటుంది. దీంతో ప్రతీ వారినీ ఆ ఒక్క సీటూ ఊరిస్తూనే ఉంది. ఆ లక్ ఎవరికి దక్కుతుంది అన్నది మాత్రం ఎవరూ చెప్పలేరు ఒక్క చంద్రబాబు తప్ప అని అంటున్నారు.