ఈ ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు ఖాయం!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉధృత ప్రచారం నిర్వహిస్తోంది.
By: Tupaki Desk | 19 April 2024 10:03 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉధృత ప్రచారం నిర్వహిస్తోంది. టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా సభలు నిర్వహిస్తున్నారు.
కాగా టీడీపీ తాను పోటీ చేస్తున్న స్థానాల్లో అభ్యర్థుల్లో మార్పులు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నరసాపురం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి దూరమయ్యారు. టీడీపీ కూటమికి ఆయన దగ్గరయ్యారు. ఆయనకు విచిత్రంగా ఎక్కడా సీటు దక్కలేదు. దీంతో ఆయనకు ఉండి సీటును కేటాయించాలని చంద్రబాబు ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉండి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే ఇచ్చారు. ఇప్పుడు రఘురామకు సీటు ఇస్తే రామరాజును పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తారని చెబుతున్నారు.
మరోవైపు 2014లో ఉండిలో శివరామరాజు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనను 2019లో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. అయితే ఆ ఎన్నికల్లో శివరామరాజు ఓడిపోయారు. ప్రస్తుతం ఆయనకు ఎంపీ సీటు దక్కలేదు. నరసాపురం పొత్తులో భాగంగా బీజేపీ నేత శ్రీనివాసవర్మకు దక్కింది. దీంతో శివరామరాజు తన ఉండి సీటును తనకే ఇవ్వాలని కోరారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే చంద్రబాబు సీటిచ్చారు. దీంతో శివరామరాజు రెబల్ గా పోటీ చేస్తానని చెబుతున్నారు.
ఇప్పుడు పిట్టపోరు పిట్టపోరు పిల్చి తీర్చిందన్నట్టు మధ్యలో రఘురామకృష్ణరాజు ఎంట్రీ ఇచ్చారు. దీంతో సీటు దక్కించుకున్న రామరాజుకు కూడా అవకాశం లేకుండా పోయినట్టేనని అంటున్నారు. ఉండి నుంచి రఘురామ బరిలోకి దిగడం ఖాయమంటున్నారు.
అలాగే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. పొత్తు కుదరకముందు అనపర్తికి టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీటు ఇచ్చింది. అయితే బీజేపీతో పొత్తు కుదరడంతో ఆ పార్టీకి అనపర్తి సీటు దక్కింది. అయితే బీజేపీ అభ్యర్థి ఇక్కడ అంత చురుగ్గా లేరని.. అభ్యర్థిని మార్చాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ కూడా టీడీపీనే పోటీ చేస్తుందని చెబుతున్నారు. అనపర్తిని వదులుకోవాలంటే తమకు దెందులూరు సీటును ఇవ్వాలని బీజేపీ కోరుతోంది.
అదేవిధంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో ఇప్పటికే జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఇక్కడ కూడా అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉంది. జయచంద్రారెడ్డికి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ తో సత్సంబంధాలు ఉన్నాయని బలంగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో తంబళ్లపల్లెలో అభ్యర్థిని మార్చడం ఖాయమంటున్నారు.
అదేవిధంగా పొత్తులో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి సీటు జనసేనకు దక్కింది. దీంతో అక్కడ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి సీటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయనను మాడుగుల నుంచి బరిలో దింపుతారని అంటున్నారు. ఇప్పటికే మాడుగులలో ఎన్నారై పైలా ప్రసాదరావుకు సీటు ఇచ్చారు. అయితే ఆయన నియోజకవర్గానికి కొత్త కావడం, శ్రేణులను కలుపుకుని వెళ్లలేకపోవడం, ప్రచారంలో వెనుకబడి ఉండటంతో ప్రసాదరావును తప్పించి సత్యనారాయణమూర్తికి సీటు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.
అలాగే టీడీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఎంఎస్ రాజు ప్రత్యర్థులపై విమర్శలు చేయడంతో ముందుంటారు. అలాంటి నేతకు సీటు ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో అనంతపురం జిల్లా మడకశిర సీటును ఎంఎస్ రాజుకు ఇస్తారని అంటున్నారు. ఇప్పటికే మడకశిరకు అనిల్ కుమార్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీంతో ఆయనను మార్చాలని చంద్రబాబు నిర్ణయించినట్టు చెబుతున్నారు.
మాడుగుల, అనపర్తి, ఉండి, తంబళ్లపల్లె, మడకశిర మాత్రమే కాకుండా మరో ఒకటి రెండు స్థానాల్లోనూ మార్పులు ఉంటాయని అంటున్నారు. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటన వెలువడొచ్చని చెబుతున్నారు.