జగన్ని పులివెందుల చూడమంటున్న బాబు...ఎందుకూ...?
పులివెందులలో టీడీపీ సభ జరగడం బాబుకు ఆ పార్టీ వారు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం నిజంగా విశేషమే
By: Tupaki Desk | 3 Aug 2023 4:03 AM GMTజగన్ పులివెందుల చూడు అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులను చూసేందుకు టూర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పులివెందులలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జనాలు పెద్ద సంఖ్యలో వచ్చారని బాబు అంటూ జగన్ పులివెందులలో నాకు జనాలు ఎలా వచ్చారో ఒక్కసారి చూడు అని రెట్టిస్తున్నారు.
పులివెందులలో టీడీపీ సభ జరగడం బాబుకు ఆ పార్టీ వారు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం నిజంగా విశేషమే. అయితే ఎన్నికల వేళ కాబట్టి హడావుడి మొదలైంది. అటూ ఇటూ పార్టీ నేతలు మోహరించి ఉన్నారు. చంద్రబాబు రావడంతో వారు హుషార్ చేస్తున్నారు.
కొద్ది నెలల క్రితమే లోకేష్ పాదయాత్ర కడప జిల్లాలో సాగింది. నాటి ఉత్సాహం ఆ వేడి తగ్గకుండా తెలివిగానే చంద్రబాబు రాయలసీమ టూర్ వేశారు అని అంటున్నారు. అంటే లోకేష్ సభలకు వచ్చిన జనాల మనసు మారకుండా పొలిటికల్ గా వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు ఆయన ఈ ట్రిప్ ఒక వ్యూహం ప్రకారం వేశారు అని అంటున్నారు.
ఇక లోకేష్ పులివెందులలో అడుగు పెట్టలేదు. ఆయన పాదయాత్ర ఆ పక్క నుంచి వెళ్లిపోయింది. దాంతో ఆ లోటుని తీర్చేందుకు అన్నట్లుగా చంద్రబాబు భారీ జన సందోహంతో సీఎం సొంత నియోజకవర్గంలో హడావుడి చేశారు. వై నాట్ పులివెందుల అని జనాలు అంటున్నారని కూడా కవ్వించారు.
నిజానికి పులివెందుల వైసీపీకి కంచుకోట. అక్కడ కనుక మార్పు వస్తే ఏపీలో టీడీపీకి పొత్తుల బెంగ ఎత్తుల బెడదా అసలు అవసరం లేదు. కానీ అలాంటి పరిస్థితి ఉంటుందా అన్నదే చర్చ. చంద్రబాబు సభ అందునా జగన్ సొంత నియోజకవర్గంలో ఎన్నికల వేళ హీటెక్కించాలన్న ఉద్దేశ్యంతో పెట్టడంతోనే అంతా ప్రతిష్టగా తీసుకుని పనిచేసారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే పులివెందులలో టీడీపీ ఓడినా గట్టిగానే ఎపుడూ పోరాడుతూనే ఉంది. దాంతో ఆ ఇంపాక్ట్ అలా కనిపిస్తోంది అని అంటున్నారు. అయితే వైసెస్ వివేకా హత్య కేసు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు రావడం, వైఎస్ సునీత న్యాయపోరాటం వైఎస్ షర్మిల దూరం వైసీపీకి దూరం కావడం వంటి పరిణామాల ప్రభావం కూడా ఎంతో కొంత పులివెందుల మీద ఉండవచ్చు అని అంటున్నారు.
ఎంత టీడీపీ జనాలకు తరలించినా అధికంగా జనాలు పోటెత్తినట్లుగా రావడం అంటే ఒక కదలిక గానే చూడాలి అని అంటున్నారు. అంత మాత్రం చేత టీడీపీ సంబరపడిపోయినట్లుగా వై నాట్ పులివెందుల అని కాదు కానీ 2019 ఎన్నికల్లో 90 వేల పై చిలుకు వచ్చిన జగన్ మెజారిటీ ఈసారి తగ్గుతుందా అన్నది ఒక చర్చ అయితే గణనీయంగా తగ్గినాలన్నదే టీడీపీ ప్లాన్ అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది మరి.