మొహమాటాల్లేవు అంటున్న బాబు... అంతేనా...?
ఇక చంద్రబాబు సైతం ఈసారి ఎన్నికలు అత్యంత కీలకం కాబట్టి ఎలాంటి రాజీలు లేవని చెప్పేస్తున్నారుట
By: Tupaki Desk | 16 Aug 2023 3:53 AM GMTచంద్రబాబు మారిపోయారు. ఈసారి ఆయన ఎక్కడా రాజీ పడడంలేదు. మొహమాటాలు అసలు లేవని చెప్పేస్తున్నారు. పనితీరు ఆధారంగానే టికెట్లు సుమా అని ఒకటికి పదిసార్లు హెచ్చరిస్తున్నారు. సర్వేలను బాబు బలంగా నమ్ముకుంటున్నారు. సర్వేలలో ఎవరి పనితీరు బాగా ఉంటుందో వారికే టికెట్లు ఇస్తామని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు.
దీంతో చంద్రబాబు వైఖరితో చాలా మంది తమ్ముళ్ళు ఆశా నిరాశల మధ్య ఊగిసలాట ఆడుతున్నారని అంటున్నారు. ప్రతీ సారీ చంద్రబాబుతో సాన్నిహిత్యంగా ఉంటూ టికెట్లు తెచ్చుకునే వారు సైతం ఈసారి సర్వేలు అంటే ఎలా రిజల్ట్ వస్తుందో అని జడుసుకుంటున్నారుట.
ఇక చంద్రబాబు సైతం ఈసారి ఎన్నికలు అత్యంత కీలకం కాబట్టి ఎలాంటి రాజీలు లేవని చెప్పేస్తున్నారుట. పనితీరు బాగున్న చోట్ల నియోజకవర్గాలలో నేతలను ప్రోత్సహిస్తూనే పనితీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేని వారిని క్లాస్ తీసుకుంటున్నారుట. కొందరికి అయితే వేరే చోట్లకు బదిలీ చేసి అక్కడ అయినా పనితీరు మెరుగుపరచుకోమని మరో చాన్స్ ఇస్తున్నారుట.
ఇక గత నెలలో మంగళగిరి పార్టీ సమావేశంలో బాబు నియోజకవర్గాల సమీక్ష నిర్వహించి పనితీరు బాలేని చోట్ల హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు. దాంతో ఈసారి టికెట్ దొరకడం బహు కష్టం అన్నది తమ్ముళ్లకు తెలిసివచ్చింది అని అంటున్నారు.
ఇక టీడీపీ రెండు విధాలుగా సర్వేలు చేయిస్తోంది అని అంటున్నారు. ఒకటి పార్టీ ఏజెన్సీల ద్వారా మరోకటి వ్యూహకర్త అయిన రాబిన్ టీం సర్వే ద్వారా అని తెలుస్తోంది. ఇలా చేసిన సర్వేలలో ఒక దాని నివేదిక ప్రస్తుతం టీడీపీ అధినాయకత్వం వద్దకు చేరింది అని అంటున్నారు.
ఈ సర్వే నివేదికతో పాటు రాబిన్ టీం నుంచి సేకరించిన అభిప్రాయ సేకరణను దగ్గరపెట్టుకుని ఈ నెల 16 నుంచి మరో విడతగా నియోజకవర్గాల స్థాయిలో సమీక్షలకు బాబు సిద్ధపడుతున్నారని అంటున్నారు. ఎట్టి పరిస్థిలలో సర్వే నివేదికల మేరకు ఆశావహులు పనితీరు మెరుగుపరచుకోకపోతే మాత్రం టికెట్లకు ఇబ్బందే అని అంటున్నారు. దీంతో టీడీపీలో తమ్ముళ్ళు అంతా తల్లడిస్తున్నారని తెలుస్తోంది. మరి చంద్రబాబు ఈసారి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది అని అంటున్నారు.