రామోజీరావుకు అవుట్ రేట్ గా బాబు సపోర్ట్
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తెలుగుదేశం పార్టీ అధినేత అవుట్ రేట్ గా సపోర్ట్ ఇచ్చేశారు
By: Tupaki Desk | 21 Aug 2023 10:36 AM GMTఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తెలుగుదేశం పార్టీ అధినేత అవుట్ రేట్ గా సపోర్ట్ ఇచ్చేశారు. ఆయన మరో సంస్థ అయిన మార్గదర్శి మీద వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతున్న నేపధ్యం ఉంది. ఇది చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఇన్నాళ్ళూ మౌనంగా ఉన్న చంద్రబాబు ఇపుడు ఒక్కసారిగా రామోజీరావుని కీర్తించడంతో పాటు జగన్ మీద గట్టిగా విరుచుకుపడ్డారు.
రామోజీరావు ఉన్నతమైన విలువలు కలిగిన వారు అంటూ బాబు కొనియాడారు. ఆయన పత్రికా రంగానికి అదే విధంగా తెలుగు సాహిత్యానికి, విద్యా రంగానికి చేసిన సేవలకు గాను దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ తో భారత ప్రభుత్వం సత్కరించిందని బాబు గుర్తు చేయడం విశేషం.
అటువంటి వ్యక్తి మీద ఆయన సంస్థల మీద రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టుకుని దాడులు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఇదంతా జగన్ ఫస్ట్రేషన్ తో తీసుకుంటున్న చర్యలు అని అన్నారు. రోజు రోజుకీ ప్రజలలో ఆదరణ తగ్గిపోవడంతో మీడియా మీద పడ్డారని బాబు అంటున్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్ మీడియాను కూడ ఇపుడు ఏమీ కాకుండా చేయాలని అనుకుంటున్నారని అన్నారు.
మీడియా తనకు భజన చేయాలని, తాను చెప్పినట్లుగా వినాలన్నదే జగన్ ఆలోచన అన్నారు. మొత్తం మీద గత కొద్ది నెలలుగా మార్గదర్శి మీద కేసులను ఏపీ సీఐడీ పెడుతున్న క్రమంలో తెలుగు రాజకీయాల్లో అలజడి రేగుతోంది. అయితే ఇప్పటిదాకా టీడీపీ నుంచి డైరెక్ట్ గా మద్దతు అయితే రామోజీరావుకు లభించలేదు.
ఇక ఒక దశలో రామోజీరావు ఇంటికి వెళ్ళి మరీ ఏపీ సీఐడీ అధికారులు ఆయనను విచారించారు. ఆ సమయంలో ఆయన మంచం మీద పడుకుని విచారణలో పాల్గొన్న ఫోటోలు కూడా పత్రికలలో వచ్చాయి. ఆ సమయంలో కూడా ఆయనకు ఎలాంటి అనుకూల వ్యాఖ్యలు రాజకీయ పార్టీల నుంచి రాలేదు. అయితే ఇపుడు ఉన్నట్లుండి చంద్రబాబు ఈ రకంగా కామెంట్స్ చేయడం అంటే ఎన్నికల ముందు మరోసారి తన అనుకూల మీడియా నుంచి సహకారం కోసమేనా అన్న చర్చ సాగుతోంది.
ఇక మీడియా మీద దాడులు అంటూ చంద్రబాబు కామెంట్స్ చేయడం ఇపుడు చర్చనీయాంశం అయ్యాయి. జగన్ అయితే ఏ మాత్రం దాచుకోకుండానే ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు, ఆంధ్ర జ్యోతి, అలాగే మరో రెండు చానళ్ళను ఎపుడూ తన సభలలో ప్రస్తావిస్తూ ఉంటారు. అవి తమ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయని జగన్ విమర్శిస్తూ ఉంటారు.
అయితే అపుడు కూడా టీడీపీ నుంచి ఎలాంటి విమర్శలు ప్రభుత్వం మీద రాలేదు, ఇప్పుడు మాత్రం చంద్రబాబు ఈ రకంగా హాట్ కామెంట్స్ చేయడం విశేషం. రామోజీరావు సంస్థల ఖ్యాతిని దెబ్బతీయడానికి జగన్ చూస్తున్నారు అంటూ తీవ్రమైన అరోపణలనే చంద్రబాబు చేశారు.
ఇదిలా ఉంటే రామోజీరావు మార్గదర్శి సంస్థల మీద ఏపీ సీఐడీ విచారణ జరుపుతూంటే మిగిలిన రాజకీయ పార్టీలు నుంచి విమర్శలు అయితే ఇంతవరకూ రాలేదు. రామోజీరావుకు జాతీయ స్థాయిలో సైతం పలుకుబడి చాలా ఉందని అంటారు. కేంద్రాన్ని నడుపుతున్న పార్టీ బీజేపీ నుంచి కూడా వైసీపీ మీద విమర్శలు లేవు. మరి ఈ దశలో చంద్రబాబు ఆరోపణలు చేస్తూ జగన్ మీద విరుచుకుపడడడంతో ఏపీ రాజకీయాల్లో మరో కొత్త అంకానికి తెర తీసినట్లు అయింది అని అంటున్నారు.
రానున్న ఎన్నికల యుద్ధంలో మీడియా కూడా కీలకం అయిన క్రమంలో వచ్చే సీజన్ అంతా పొలిటికల్ గా హీటెక్కించేదే అని అంటున్నారు. మొత్తానికి బాబు ఈనాడు రామోజీరావుకు మద్దతు ఇవ్వడం ద్వారా జగన్ మీద డైరెక్ట్ అయ్యారు. దీని మీద వైసీపీ నుంచి ఏ రకంగా రియక్షన్ వస్తుందో చూడాల్సిందే.