బిగ్ షాట్స్ కోసం బాబు రూల్స్ బ్రేక్ చేయాల్సిందే...?
వారి కోసం బాబు మొదట చెప్పిన మాటలను ప్రకటనలను వెనక్కి తీసుకోవాల్సిందేనా అని అంటున్నారు
By: Tupaki Desk | 22 Aug 2023 12:01 PM GMTటీడీపీ అధినేత గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికలు టీడీపీకి డూ ఆర్ డై గా ఉనన్ నేపధ్యంలో ఆయన ఎలాంటి చాన్స్ కూడా తీసుకోదలచుకోలేదు అని అంటున్నారు. మొహమాటాలకు పోయి టికెట్లు ఇవ్వదలచుకోలేదని అంటున్నారు. అయితే బాబు మూడేళ్ళ క్రితం ఒక మాట పార్టీకి చెప్పారు. వైసీపీ మీద మొదటి నుంచి పోరాడిన వారికే టికెట్లు ఇస్తామని ప్రకటించారు.
చివరి ఏడాదిలో వచ్చి హడావుడి చేసిన వారికి నో టికెట్ అని గంభీరంగా ప్రకటించారు. అయితే ఇది జరిగే పనేనా అని అంతా అనుకున్నారు. ఎందుకంటే టీడీపీలో బిగ్ షాట్స్ అంతా మొదటి నాలుగేళ్ళు తెర మరుగు అయ్యారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఫుల్ సైలెంట్ అయ్యారు. కొందరు అయితే సొంత వ్యాపారాలు వ్యాపకాలతో బిజీ అయ్యారు. ఈ నేపధ్యంలో వారి ప్లేస్ లో కొత్త వారికి చాన్స్ ఇస్తారా అన్న చర్చ కూడా నడచింది.
అయితే వారంతా బిగ్ షాట్స్ అంగబలం అర్ధబలం నిండుగా ఉన్న వారు. అలాంటి వారు అంతా అనుకున్నట్లుగా ఇపుడు జనంలోకి వచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, పి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ వంటి వారు ఇపుడు జనంలో మళ్లీ కలియతిరుగుతున్నారు. రీ యాక్టివ్ అయ్యారు.
దాంతో వారికి టికెట్లు ఇవ్వక తప్పదని అంటున్నారు. వారి కోసం బాబు మొదట చెప్పిన మాటలను ప్రకటనలను వెనక్కి తీసుకోవాల్సిందేనా అని అంటున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారు అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, రామానాయుడు, బొండా ఉమా, దేవినేని ఉమా వంటి నేతలు మినహా అప్పట్లో ఎవరూ పెద్దగా కనిపించలేదు.
అంతే కాదు 2019లో టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో కూడా సగం మంది సైతం జనంలోకి రావడంలేదని ఫిర్యాదులు ఉన్నాయి. వారంతా ఎవరి మటుకు వారు సొంత పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం అంతా ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. అంతా జనంలోనే ఉంటున్నారు.
అయితే మొదటి నుంచి పనిచేసిన వారికి జనంలో ఉన్న వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ టీడీపీలో వస్తోంది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఇదే విషయం గతంలో గట్టిగా డిమాండ్ చేశారు. ఆయన మాజీ అమంత్రి గంటాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం రోడ్డున పడిన వారికే గుర్తు పెట్టుకోవాలని ఆయన కోరారు.
అయితే చంద్రబాబు మాత్రం బిగ్ షాట్స్ విషయంలో సడలింపు ఇవ్వక తప్పని పరిస్థితి ఉందని అంటున్నారు. మాజీ మంత్రి గంటా అయితే విశాఖ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటారని అంటున్నారు. అలాగే నెల్లూరు జిల్లా బాధ్యతలను మాజీ మంత్రి నారాయణ మోస్తారని అంటారు. ప్రత్తిపాటి పుల్లారావు అయితే గుంటూరు జిల్లాలో పార్టీకి అండగా ఉంటారని అంటున్నారు. ఇలా సీనియర్లు కొంతమంది 2024 ఎన్నికల సమయంలో కీలకమైన వేళ పార్టీకి గట్టిగా నిలబడతారు అని అంటున్నారు. అందువల్ల బాబు రూల్స్ అయినా బ్రేక్ చేసి వారికి చోటు కల్పించకతప్పదని అంటున్నారు.