చంద్రబాబుకు నాడు దక్కిన సీటు... రేపు అగ్ని పరీక్షగా..?
ఎన్టీయార్ తదనంతరం తానే సీఎం కావాలని ఆయన టీడీపీలో ఒక్కో మెట్టు ఎక్కి ఒక్కో ఇటుకా పేర్చుకుని తన కెరీర్ అనే భవనాన్ని కట్టుకున్నారు
By: Tupaki Desk | 1 Sep 2023 10:44 AM GMTచంద్రబాబు విజనరీ అంటారు అది నిజమే ఆయన తన రాజకీయ భవిష్యత్తుని చాలా ముందుగానే ఊహించుకున్నారు. ఆయన మొదటిసారి 1978లో కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తన కెరీర్ ని అలా తీర్చిదిద్దుకుని వచ్చారు. 1980లో బాబు మంత్రి అయ్యారు. అలా ఆయన రెండేళ్ళ పాటు ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు.
కాంగ్రెస్ 1983లో ఓటమి పాలు కావడంతో చంద్రబాబు టీడీపీలోకి చాలా సులువుగా రాగలిగారు. ఆయన సొంత మామ ఎన్టీయార్ కావడమే ఇందుకు కారణం. ఇక ఎన్టీయార్ వద్ద చేరి ఆయన పార్టీలో నంబర్ టూ గా మారి చంద్రబాబు చివరికి ఆయననే పక్కన పెట్టి ఉమ్మడి ఏపీకి సీఎం అయిపోయారు.
బాబు పొలిటికల్ కెరీర్ 1978లో స్టార్ట్ అయితే ఆయన కేవలం 17 ఏళ్ళ షార్ట్ టైం లో సౌతిండియాలో ఏపీ వంటి పెద్ద రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయిపోయారు. ఒక విధంగా సీఎం పోస్ట్ బాబుకు కల అని చెబుతారు. అయితే ఎన్టీయార్ ని తప్పించి తాను అవాలని ఆయన అనుకోలేదు అని కూడా అంటారు.
ఎన్టీయార్ తదనంతరం తానే సీఎం కావాలని ఆయన టీడీపీలో ఒక్కో మెట్టు ఎక్కి ఒక్కో ఇటుకా పేర్చుకుని తన కెరీర్ అనే భవనాన్ని కట్టుకున్నారు. అయితే ఎన్టీయార్ జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించడంతో బాబుకు ఒక సవాల్ గా మారింది. అదే ఆయనకు రాజకీయ సోపానంగా మార్చుకునేందుకు అవకాశం ఏర్పడింది
అది 1995 ఆగస్ట్ నే. ఆ నెల 20 తేదీ తరువాత ఎంటీయార్ ఉత్తరాంధ్రా టూర్ పెట్టుకున్నారు. ఆయన వెంట రెవిన్యూ మంత్రిగా విశాఖ వచ్చిన చంద్రబాబు ఆ తరువాత శ్రీకాకుళం పర్యటనకు వెళ్లలేదు. విశాఖలోని ఒక పత్రికాధిపతికి చెందిన హొటల్ లో ఉంటూ రాజకీయ మంత్రాంగం నడిపారని అంటారు.
అలా చకచకా మారిన పరిణామాల క్రమంలో ఎన్టీయార్ హైదరాబాద్ చేరుకునేసరికి పార్టీలో తిరుగుబాటు ఎదురైంది. దాంతో ఎన్టీయార్ ఆగస్ట్ 25న చంద్రబాబుని అశోక్ గజపతిరాజుని, దేవేందర్ గౌడ్, విద్యాధరరావులను పార్టీ నుంచి బహిష్కరించారు.
అయితే అప్పటికే పార్టీ మొత్తం ఎన్టీయార్ నుంచి చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోయింది. అలా ఎన్టీయార్ ని దించేసిన తరువాత సెప్టెంబర్ 1న చంద్రబాబు ఉమ్మడి ఏపీ 19వ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ముహూర్త బలం ఎంత గట్టిదో కానీ ఆయన 2004 మే 15 దాకా ఏకంగా తొమ్మిదేళ్ళ పాటు సీఎం గా పనిచేయగలిగారు
ఇప్పటికి ఇరవై ఎనిమిదేళ్ళు అవుతోంది బాబు తొలిసారి సీఎం అయి. చంద్రబాబుని సీఎం గా మొదట్లో అంగీకరించని టీడీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్గం తో పాటు తటస్థులు కూడా ఆ తరువాత అసలైన టీడీపీ చంద్రబాబుదే అని భావించి ఆ పార్టీలో చేరి ఈ రోజుకీ నాయకులుగా కొనసాగడం ఆయన దక్షతకు నిదర్శనం అని చెప్పాలి.
అయితే ఉమ్మడి ఏపీ రెండుగా చీలిపోవడం తెలంగాణా వాదం బలపడి టీయారెస్ ఏర్పాటై తెలంగాణాను ఆక్రమించడం, వైఎస్సార్ మరణానంతరం వైసీపీ ఏర్పాటు అయి ఏపీలో బలమైన పార్టీగా అవతరించడం టీడీపీకి అతి పెద్ద సవాల్ గా మారాయి. విభజన ఏపీలో తొలి సీఎం అయిన చంద్రబాబుకు 2024 ఎన్నికలు అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే దాని భవిష్యత్తు ఏంటి అన్నది కూడా ఆలోచించాల్సి ఉంటుంది అంటున్నారు.