బాబు ని ఎలా అరెస్ట్ చేస్తారు... ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి పీవీ రమేష్
ఈ స్కాం లో కార్పోరేషన్ ఎండీ, కార్యదర్శి పాత్ర చాలా కీలకమని అన్నారు. ఈ కేసులో అసలు నోట్ ఫైల్ ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు
By: Tupaki Desk | 11 Sep 2023 6:30 AM GMTఒక కేసు విషయంలో తప్పు చేసిన అధికారులను అరెస్ట్ చేయకుండా మాజీ ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేస్తారు అని ఆర్ధిక శాఖ మాజీ కార్యదర్శి పీవీ రమేష్ ఒక స్ట్రైట్ పాయింట్ ని రైజ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి అంటే వందల శాఖలు ఆయన చూస్తారు, ఎలా ఆయన దైనందిన ఖాతాలను చూడగలరు, బ్యాంక్ ఖాతాలలో ఎంత ఉంది, ఏమి జరుగుతోంది అన్నది సీఎం కి ఎలా తెలుస్తుంది అని లాజిక్ పాయింట్స్ ని పీవీ రమేష్ బయటకు తీస్తున్నారు.
ఒక టీవీ చానల్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వాగ్మూలాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేశామని సీఐడీ చెప్పడం దిగ్బ్రాంతికరమైన అంశంగా పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసులో చాలా అంశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. కేవలం తన స్టేట్మెంట్ నే పట్టుకుని బాబుని అరెస్ట్ చేశారు అంటే అది తనకే దిగ్బ్రాంతిని కలిగించింది అని ఆయన అంటున్నారు.
పీవీ రమేష్ ఏపీ ప్రభుత్వం ఆర్ధిక శాఖ మాజీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఇక ఆయన గతంలో సీఐడీ అధికారుల ముందుకు వచ్చి లిఖితపూర్వకమైన సమాధానాలు ఇచ్చారు. ఇపుడు ఈ కేసు సంచలనం రేకెత్తించడమే కాకుండా బాబు అరెస్ట్ దాకా వెళ్లిపోయింది. దాంతో పీవీ రమేష్ మీడియా ముందుకు వచ్చి చాలా విషయాలు చెప్పుకొచ్చారు.
ఈ స్కాం లో కార్పోరేషన్ ఎండీ, కార్యదర్శి పాత్ర చాలా కీలకమని అన్నారు. ఈ కేసులో అసలు నోట్ ఫైల్ ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. నోట్ ఫైల్ లేకుండా కేసు ఎలా పెడతారని ఆయన అంటున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఆర్ధిక శాఖ పరంగా ఏ తప్పూ జరగలేదని ఆయన అంటున్నారు. తనకు సీఐడీ తీరు మీదనే అనుమానం కలుగుతోందని ఆయన చెప్పడం విశేషం.
ఈ కేసు విషయంలో తాను చెప్పిన దాన్ని సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కి గతంలో నిధులు విడుదల చేసిన వారిలో కొందరు పేర్లు ఇపుడు లేవని ఆయన అంటున్నారు. ఈ కేసులో అతి ముఖ్యులైన స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ కార్యదర్శిల పేరులు ఎందుకు లేవు అని ఆయన నిగ్గదీశారు.
ఇక ఇలాంటి కేసులలో సీఎంలకు ప్రత్యక్ష సంబంధాలు పెద్దగా ఎందుకు ఉంటాయన్న లా పాయింట్స్ ని ఆయన తీశారు. సీఎం అనే వ్యక్తి కొన్ని వందల అంశాలను పర్యవేక్షిస్తారు అని చెప్పుకొచ్చారు. అందువల్ల స్కాం జరిగితే దానికి ఆయా శాఖల అధికారులదే బాధ్యత తప్ప ఎవరిదీ కాదు అని ఆయన తేల్చేశారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు పేరుతో నాడు తీసుకున్న విధానపరమైన నిర్ణయానికి సంబంధించిన ఫైల్స్ ఏమయ్యాయో చెప్పాలని ఆయన అంటున్నారు.
అసలు స్కాం ఎక్కడ జరిగింది అన్నది స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఫైల్స్ అన్నీ చూస్తే కచ్చితంగా తెలుస్తుందని పీవీ రమేష్ అంటున్నారు. ఇక సీఎం అధికారుల మీద వత్తిడి తెచ్చి డబ్బులు రిలీజ్ చేయించడం అన్నది జరగదని పీవీ రమేష్ క్లారిటీ ఇచ్చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మీద రాసిన నోట్ ఫైల్స్ చాలా కీలకమని అవి ఇపుడు ఏమయ్యాయో చెప్పాలని ఆయన కోరుతున్నారు.
ఇలాంటి కేసులలో అధికారులదే తప్పు ఉంటుందని, వారిని వదిలేసి మాజీ సీఎం ని అరెస్ట్ చేయడమేంటని పీవీ రమేష్ ప్రశ్నిస్తున్నారు. అధికారులు చేసే తప్పులను నాయకులకు ఎలా ఆపాదిస్తారని, వారిని ఎలా జైలుకు పంపిస్తారని పీవీ రమేష్ గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. మరి ఆయన లేవనెత్తిన పాయింట్స్ కానీ ప్రశ్నలకు కానీ సీఐడీ అధికారుల నుంచి ఏ రకమైన సమాధానం వస్తుందో చూడాల్సి ఉంది అంటున్నారు.