ఇక ప్రజల్లోకి భువనేశ్వరి, బ్రాహ్మణి!
మరో ఏడెనిమిది నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి
By: Tupaki Desk | 12 Sep 2023 3:37 AM GMTమరో ఏడెనిమిది నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అవినీతి చేశారని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపిన సంగతి తెలిసిందే. మరోవైపు లోకేశ్ అరెస్టు కూడా తప్పదని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ మంత్రులు, ముఖ్య నేతలు లోకేశ్ ను కూడా జైలులో పడేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీఐడీ అదనపు డీజీ సంజయ్ కూడా పరోక్షంగా ఇదే హెచ్చరిక జారీ చేశారు.
మరోవైపు చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతలు, శ్రేణులు ఢీలా పడ్డారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల ముందు తన తల్లి, చెల్లి ద్వారా జగన్ లాభపడ్డట్టే.. టీడీపీ సైతం అదే వ్యూహాన్ని అమలు చేయనుందని తెలుస్తోంది.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఆయన కోడలు, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి ప్రజల్లోకి వస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల ముందు జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల పర్యటించినట్టే రాష్ట్రమంతా భువనేశ్వరి, బ్రాహ్మణి సుడిగాలి పర్యటనలు చేస్తారని చెబుతున్నారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ మనవరాలిగా, బాలకృష్ణ కుమార్తెగా బ్రాహ్మణికి ప్రజల్లో క్రేజు ఉంటుందని టీడీపీ భావిస్తోందని అంటున్నారు. అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న బ్రాహ్మణి అద్భుతంగా ప్రసంగించగలరని చెబుతున్నారు. ఇప్పటికే ఆమె తమ కుటుంబం ఆధ్వర్యంలోని హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారని పేర్కొంటున్నారు. తన తెలివితేటలతో హెరిటేజ్ గ్రూప్ ను లాభాల బాట పట్టించారని గుర్తు చేస్తున్నారు.
తన మామ చంద్రబాబును అరెస్టు చేయడం, మరోవైపు తన భర్త లోకేశ్ ను కూడా అరెస్టు చేసే వాతావరణం కనిపిస్తుండటంతో బ్రాహ్మణి తాత్కాలికంగా టీడీపీ పగ్గాలు చేపడతారని టాక్ నడుస్తోంది. ఆమెకు తోడుగా తండ్రి నందమూరి బాలకృష్ణతోపాటు దివంగత ఎన్టీఆర్ కుటుంబం మొత్తం తోడుగా ఉంటుందని చర్చ జరుగుతోంది.
మరోవైపు భువనేశ్వరి కూడా ప్రజల్లోకి వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తారని అంటున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 14 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న తన భర్త చంద్రబాబు ఎక్కడా ఏ తప్పు చేయలేదని ఆమె ప్రజల వద్ద ఆవేదనను వ్యక్తం చేస్తారని తెలుస్తోంది. తద్వారా ప్రజల సానుభూతి టీడీపీకి దక్కుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.
సెప్టెంబర్ 18న వినాయకచవితి తర్వాత ఆలస్యం చేయకుండా భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రజల్లోకి వస్తారని అంటున్నారు. ఒకవేళ లోకేశ్ ను కూడా జగన్ ప్రభుత్వం అరెస్టు చేస్తే లోకేశ్ ఎక్కడయితే పాదయాత్రను ఆపారో అక్కడ నుంచి బ్రాహ్మణి కొనసాగిస్తారని చెబుతున్నారు.
రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు, లోకేష్ పై జగన్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని, వారిని తప్పుడు కేసులో ఇరికించి వేధిస్తోందని, ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసుకదా అని నేరుగా ప్రజలకే భువనేశ్వరి, బ్రాహ్మణి మొర పెట్టుకోనున్నారని చెబుతున్నారు. వీరిద్దరూ ప్రజల్లోకి వెళ్లే అంశంపై ఇప్పటికే పార్టీలో ఓ కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధమైనట్లు సమాచారం.
వాస్తవానికి జగన్ అధికారంలోకి రావడంలో కూడా సానుభూతే అతిపెద్ద కారణంగా నిలిచిందని గుర్తు చేస్తున్నారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ ఆకస్మికంగా మరణించడం, జగన్ జైలుపాలు కావడం, తరచూ విజయమ్మ రోదనలు, షర్మిల పాదయాత్ర... ఇవే జగన్ గెలుపుకు ప్రధాన కారణాలని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అచ్చం ఇదే సెంటిమెంటును టీడీపీ కూడా పండించనుందని అంటున్నారు.
భువనేశ్వరి, బ్రాహ్మణిలపై సానుభూతి ఫలిస్తే టీడీపీకి 2019 ఎన్నికల్లో వైసీపీకి దక్కిన భారీ విజయం లభించినా ఆశ్చర్యపోనవసరం లేదని టాక్ నడుస్తోంది. ఇక అగ్నికి వాయువు తోడైనట్టు జనసేన పార్టీతో పొత్తు కూడా ఉండే నేపథ్యంలో తమకు భారీ విజయం తథ్యమని టీడీపీ కూడా లెక్కలేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏపీ పరిణామాలు ఏ రూపును సంతరించుకుంటాయో వేచిచూడాల్సిందే.