Begin typing your search above and press return to search.

ఎన్నికల ముంగిట చంద్రబాబుకు ఇది మామూలు షాక్‌ కాదు!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బిగ్‌ షాక్‌ తగిలింది.

By:  Tupaki Desk   |   1 Sep 2023 5:24 AM GMT
ఎన్నికల ముంగిట చంద్రబాబుకు ఇది మామూలు షాక్‌ కాదు!
X

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆదాయ పన్ను శాఖ(ఐటీ) ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు నిర్మాణ సంస్థలకు సబ్‌ కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు చంద్రబాబుపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసినట్టు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్‌ టైమ్స్‌ తన కథనంలో తెలిపింది. ఈ మేరకు ఆ పత్రిక ట్వీట్‌ కూడా చేసింది.

బోగస్‌ సబ్‌ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఐటీ శాఖ అధికారులకు ఆధారాలు కూడా లభించాయని అంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ.. షాపూర్‌ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో చంద్రబాబుకు ముడుపులు అందిన విషయం వెలుగుచూసిందని సమాచారం. బోగస్‌ కాంట్రాక్టులు, వర్క్‌ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్‌ వాసుదేవ్‌ కూడా విచారణలో ఒప్పుకున్నారని చెబుతున్నారు.

కాగా ఐటీ శాఖ చంద్రబాబుకు జారీ చేసిన షోకాజ్‌ నోటీసుల్లో.. నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. అయితే ఈ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలు తెలిపారు. ఈ అభ్యంతరాలను తిరస్కరించిన ఐటీ శాఖ ఆగష్టు 4వ తేదీన హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం పరిధిలో సెక్షన్‌ 153సి కింద నోటీసులు జారీ చేసింది.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాజధాని అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాలతోపాటు పలు జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రూ.8 వేల కోట్ల నిర్మాణ కాంట్రాక్టును షాపూర్‌ జీ పల్లోంజీ దక్కించుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు కాంట్రాక్టు సంస్థల నుంచి భారీ వసూళ్లకు పాల్పడ్డారనే అభియోగాలు వచ్చాయి. తన మనుషుల ద్వారా బోగస్‌ కంపెనీలు సృష్టించి సబ్‌ కాంట్రాక్టుల రూపంలో నిధులు కొల్లగొట్టారని ఆరోపణలు వచ్చాయి. ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాల్లో ఈ అవినీతి బాగోతం అంతా బట్టబయలైందని సమాచారం. ఈ విషయాన్నే ఐటీ శాఖ అప్రైజల్‌ రిపోర్టులోనూ వెల్లడించింది.

ప్రముఖ నిర్మాణ సంస్థలు.. షాపూర్‌ జీ పల్లోంజి, ఎల్‌ అండ్‌ టి సంస్థల నుంచి సబ్‌ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు ముడుపులు ముట్టాయనే ఆరోపణలు వచ్చాయి. ఫోనిక్స్‌ ఇన్ఫ్రా- పౌర్‌ ట్రేడింగ్‌ అనే సబ్‌ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగినట్లు చెబుతున్నారు.

ఈ ఆరోపణలకు సంబంధించి మొట్టమొదటగా ఐటీ విభాగం అధికారులు షాపూర్‌ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి అయిన మనోజ్‌ వాసుదేవ్‌ నివాసంలో 2019 నవంబర్‌లో సోదాలకు దిగారు. అక్కడ ఇందుకు సంబంధించిన సమాచారం దొరికింది. ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ నివాసంలో సోదాలు చేశారు. దాంతో మరింత సమాచారం ఐటీ అధికారులకు లభించింది. ఈ మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి ఆదాయ పన్ను శాఖ అప్రైజల్‌ రిపోర్టును తయారు చేసింది. తాము నిర్వహించిన దాడుల్లో లభించిన ఆధారాల ప్రకారం సంబంధిత వ్యక్తులను విచారణకు పిలిపించింది. తాము సేకరించిన ఆధారాలను ఆ వ్యక్తులకు చూపించి వారి వాంగ్మూలాలు నమోదు చేసింది. ఆ వాంగ్మూలాలపై వారు సంతకాలు కూడా పెట్టారు. వాటన్నింటి ఆధారంగా ఐటీ అధికారులు చంద్రబాబుకు ఇప్పుడు తాజాగా నోటీసులు పంపారు.

తాజాగా అవినీతి ఆరోపణలపై చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడం ఎన్నికల ముందు ఆయనకు పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.