నవ్విపోదురు గాక... ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై పిల్లి మొగ్గలు!
సార్వత్రిక ఎన్నికల ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 May 2024 8:23 AM GMTసార్వత్రిక ఎన్నికల ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కూడా ఈ విషయంపై పాజిటివ్ గా మాట్లాడిన వారే ఇప్పుడు ఎన్నికల వేళ ఆ యాక్ట్ పై మాట మార్చి వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. దీనికంతటికీ కారణం... ఇప్పుడు ఈ అంశంమీద చంద్రబాబుతో పాటు ఒక వర్గం మీడియా తీవ్రస్థాయిలో నెగిటివ్ గా ప్రచారం చేయడమే!
అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో టీడీపీ నేతలతో పాటు ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లే.. కొన్ని రోజుల క్రితం ఆ చట్టం గురించి అద్భుతంగా కొనియాడుతూ మాట్లాడిన విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
వాస్తవానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే చట్టం రైతులకు చుట్టం అని.. అలాంటి చట్టం ఉంటే భూ యజమానులు నిశ్చింతగా ఉండొచ్చని.. ఫలితంగా, ప్రజలు తమ తమ భూములు, స్థలాలు కాపాడుకునేందుకు యాతనపడక్కర్లేదని పలువురు టీడీపీ నేతలు గతంలో కొనియాడిన పరిస్థితి! అయితే ఇంతలోనే ఏమైందో ఏమో కానీ... ఇప్పుడు ఆ చట్టంపై మాట మారుస్తున్నారు.
ఇందులో భాగంగా ఆ చట్టం రైతులకు చుట్టం కాదని, భూతం అంటూ మాట మార్చి ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారనే చర్చ ఇప్పుడు ఆసక్తిగా మారింది. వాస్తవానికి ల్యాండ్ టైట్లింగ్ చట్టం అద్భుతం.. అటువంటి చట్టం దేశంలో గతంలో రానేలేదు.. అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చింత, భూములకు భద్రతా అంటూ టీడీపీ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు!
నాడు అసెంబ్లీలో ఈ విషయంపై మైకందుకున్న ఆయన... ఈ చట్టం మంచిదని, ఇలాంటి చట్టం పలు దేశాల్లో ఉండడంవల్లనే అక్కడ భూతగాదాలు లేవని వివరించారు. ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని నాడు డిమాండ్ చేసారు! ఇదే క్రమంలో వారికి అనుకూలంగా ఉంటారనే పేరు సంపాదించుకున్న ఒక వర్గం మీడియా ఈ విషయాన్ని హైలెట్ చేసింది! పాజిటివ్ కథనాలు ప్రసారం చేసింది.
ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు! ఇలా నాడు టీడీపీ, బీజేపీ నేతలకు మంచిగా కనిపించిన చట్టం.. నేడు భూతంలా మారిందని అంటున్నారు! ఇలా రాజకీయ నాయకులతో పాటు మీడియా కూడా ఈ చట్టంపై ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుండటం గమనార్హం! ఇదంతా చంద్రబాబు కోసం వారు పడుతున్న తపన అని అంటున్నారు పరిశీలకులు.