తెలంగాణా అభ్యర్థుల ఎంపికకు టీడీపీ కమిటీ
రాబోయే తెలంగాణా ఎన్నికల్లో ఎంపికచేయబోయే అభ్యర్ధుల కోసం తెలుగుదేశంపార్టీలో ఏడుగురు నేతలతో చంద్రబాబునాయుడు కమిటిని నియమించారు.
By: Tupaki Desk | 31 Aug 2023 7:08 AM GMTరాబోయే తెలంగాణా ఎన్నికల్లో ఎంపికచేయబోయే అభ్యర్ధుల కోసం తెలుగుదేశంపార్టీలో ఏడుగురు నేతలతో చంద్రబాబునాయుడు కమిటిని నియమించారు. తెలంగాణా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన రావుల చంద్రశేఖరరెడ్డి, కంభంపాటి రామ్మోహన్ రావు, బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్, నర్సిరెడ్డి, కాశీనాధ్ సభ్యులుగా ఉంటారు. తొందరలోనే కమిటి సమావేశమై అభ్యర్ధుల ఎంపిక విషయాన్ని చర్చించబోతోంది. ఇప్పటికే మొత్తం 119 నియోజకవర్గాల్లోను పార్టీ పోటీచేయబోతున్నట్లు ఇప్పటికే కాసాని ప్రకటన చేశారు.
ఎన్నికల్లో పోటీచేయటానికి ఆసక్తిగా ఉన్న అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవాలని కమిటి విజ్ఞప్తిచేసింది. దరఖాస్తులు వచ్చిన తర్వాత కమిటి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ కాబోతోంది. ఆ తర్వాతే అభ్యర్ధుల ఎంపిక, ప్రకటన ఉంటుంది. అసెంబ్లీకి పోటీచేయబోయే అభ్యర్ధుల ఎంపిక పూర్తికాగానే తెలంగాణా మొత్తం బస్సుయాత్రలు చేయబోతున్నట్లు కాసాని ప్రకటించారు. ఇందుకు వీలుగా మండల, డివిజన్, పట్టణ కమిటీలను నియమించబోతున్నట్లు కూడా చెప్పారు.
తెలంగాణాలో అభ్యర్ధుల గెలుపుకోసం చంద్రబాబు ప్రచారం చేస్తారా లేదా అన్నది సస్పెన్సుగా మారిపోయింది. పార్టీ అభ్యర్ధుల విజయంకోసం ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లాంటి అనేక ప్రాంతాల్లో బహిరంగసభలు నిర్వహించటానికి పార్టీ రెడీ అవుతోంది. సీమాంధ్రులు ఎక్కువగా నివసిస్తున్న జిల్లాలు, నియోజకవర్గాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని పార్టీ డిసైడ్ చేసినట్లు సమాచారం. పార్టీ నేతల ఆలోచన ప్రకారం ప్రతి నియోజకవర్గంలోను తక్కువలో తక్కువ 5 వేల ఓట్లుంటుందని లెక్క వేశారట.
ఈ ఓట్లు గెలవటానికి సరిపోదు కానీ ఇతరులను ఓడగొట్టడానికి సరిపోతుంది. అయితే ఇదే సమయంలో తమ ఓట్లను సాలిడ్ గా వేయించుకోవటంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నింటినీ వేయించుకోగలిగి నాలుగురు అభ్యర్ధుల మధ్య టైట్ ఫైట్ జరిగినపుడు టీడీపీ అభ్యర్ధులు గెలిచే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే రాబోయే ఎన్నికల్లో కనీసం పది సీట్లలో గెలుపు అవకాశాలు ఉన్నాయని సీనియర్లు అంచనా వేసుకున్నారట. మరి చివరకు ఏమి జరుగుతుందో తెలీదు కానీ టీడీపీ మాత్రం రాబోయే ఎన్నికలపైన పెద్ద ఆశలే పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది.