Begin typing your search above and press return to search.

తెలంగాణ లోక్ సభ హాట్ సీట్ లో టీడీపీ పోటీ?

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీ చేయని సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 March 2024 6:33 AM GMT
తెలంగాణ లోక్ సభ హాట్ సీట్ లో టీడీపీ పోటీ?
X

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఓ ఆశ్చర్యకర పరిణామం జరిగేలా కనిపిస్తోంది.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యన ఇప్పటికే త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇదో కీలక అంశంగా మారే చాన్సుంది. అత్యంత పోటీతో హాట్ సీట్ గా మారిన లోక్ సభ నియోజకవర్గంలో అనూహ్యంగా మరో పార్టీ తెరపైకి రానున్నట్లు తెలుస్తోంది. ఊహాగానాలు నిజమైతే ఇదో కీలక మార్పు కానుంది.

అసెంబ్లీకి దూరం.. లోక్ సభకు పోటీ

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీ చేయని సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో గట్టి పట్టున్న పార్టీ అయిన టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా సంచలనం రేపింది. 2018 ఎన్నికల్లో మహా కూటమి అంటూ కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి వచ్చిన టీడీపీ.. ఈసారి ఏకంగా బరిలోనే లేకపోవడం గమనార్హం. ఇలాంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఏకంగా బీఆర్ఎస్ లో చేరిపోయారు. అయితే, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం టీడీపీ రంగంలో ఉంటుందని చెబుతున్నారు.

ఆ ఒక్కచోటేనా?

తెలంగాణలోని ఖమ్మం లోక్ సభ స్థానం వచ్చే ఎన్నికల్లో చాలా ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. ఇప్పటికే ఇక్కడినుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ అగ్ర నేతలు పోటీ చేస్తారని కథనాలు వచ్చాయి. సోనియా రాజ్య సభకు వెళ్లిపోగా.. రాహుల్ వయనాడ్, అమేఠీ నుంచి బరిలో దిగే చాన్సుంది. అయితే, వీహెచ్ వంటి కాంగ్రెస్ సీనియర్ నేత కూడా పోటీ చేస్తానంటూ ప్రకటనలు చేస్తారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి సతీమణి, మంత్రి పొంగులేటి సోదరుడు కూడా ఖమ్మం టికెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కు వచ్చేసరికి సిటింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు మళ్లీ టికెట్ ఇచ్చారు. అయితే, ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి ఎవరనేది మాత్రం తేలలేదు. దేశవ్యాప్తంగా రెండు జాబితాలను ప్రకటించినా.. తెలంగాణలో 13 సీట్లకు అభ్యర్థులను వెల్లడించినా ఖమ్మంను మాత్రం పెండింగ్ లో పెట్టింది. వాస్తవానికి ఇక్కడినుంచి మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకుని పోటీకి నిలుపుతారని కథనాలు వచ్చాయి. కానీ, పెండింగ్ లో పెట్టింది. ఇప్పుడు వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ఖమ్మం సీటును టీడీపీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకేనా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులో అసెంబ్లీకి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తెలంగాణలోని ఖమ్మం లోక్ సభ సీటును టీడీపీకి కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఖమ్మంలో టీడీపీకి బలమైన పునాది ఉంది. ఓ సామాజిక వర్గం అండగా నిలుస్తోంది. 2009లో నామా నాగేశ్వరరావు టీడీపీ నుంచే గెలిచారు. ఈ క్రమంలోనే ఖమ్మం సీటును టీడీపీకి ఇవ్వడం ద్వారా తెలంగాణలోని ఓ ప్రధాన సామాజికవర్గం ఓట్లనూ ఆకర్షించవచ్చని, ఎలాగూ ఏపీలో పొత్తు ఉంది కాబట్టి ఆ ప్రభావం పొరుగున ఉన్న ఖమ్మంపైనా ఉంటుందనేది బీజేపీ భావనగా చెబుతున్నారు.