Begin typing your search above and press return to search.

ఎస్సీ వర్గీకరణ : చంద్రబాబు జగన్ లలో ఎవరికి మేలు ?

దేశ జనాభాలో వారి వాటా పాతిక నుంచి ముప్పయి శాతం అని అంచనాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   1 Aug 2024 4:43 PM GMT
ఎస్సీ వర్గీకరణ : చంద్రబాబు  జగన్ లలో ఎవరికి మేలు ?
X

దేశంలోనే ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఏడింట ఆరుగురు సభ్యుల అనుకూల మద్దతుతో ఈ తీర్పు వెలువరించారు.

ఇదిపుడు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలో ఎస్సీలు అత్యంత బలమైన సామాజిక వర్గం. దేశ జనాభాలో వారి వాటా పాతిక నుంచి ముప్పయి శాతం అని అంచనాలు ఉన్నాయి. ఇక ఉమ్మడి ఏపీలో చూస్తే మాలలు మాదిగలు సరిసమానంగా ఉంటారు. అయితే ఏపీలో మాలల ఆధిక్యం ఎక్కువ. మాదిగలు తెలంగాణాలో అధికంగా ఉంటారు.

ఇపుడు ఎస్సీ వర్గీకరణ తరువాత రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయం ఎలా ఉండబోతోంది అన్న చర్చ మొదలైంది. ఈ సంచలన తీర్పు ఎవరికి మేలు చేకూరుస్తుంది అన్నది కూడా ఇపుడు అందరిలో ఏర్పడుతున్న ఒక భావన. ఏపీలో మాలలు అత్యధికంగా ఉంటారు. మాదిగల సంఖ్య తక్కువ. మొత్తం రిజర్వుడు సీట్లు 29తో పాటు అనేక ఇతర నియోజకవర్గాలలో మాలలు ఎక్కువగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల మాదిగల డామినేషన్ ఉంది.

ఇక ఎస్సీ వర్గీకరణకు ఆద్యుడు టీడీపీ అధినేత చంద్రబాబు అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి ఎస్సీలలో మొదటి నుంచి మద్దతు లేదు. దాంతో 1997లో మంద క్రిష్ణ మాదిగ ప్రారంభించిన మాదిగల రిజర్వేషన్ పోరాటానికి టీడీపీ సానుకూలంగా స్పందించింది. అలా ఉమ్మడి ఏపీ సీఎం గా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేశారు. అలా మాదిగల మద్దతు పొందారు. ఆయన సొంతంగా 1999లో గెలిచినపుడు మాదిగల మద్దతు తెలంగాణాలో అపారంగా అందుకున్నారు.

ఇక 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ వర్గీకరణకు వైఎస్సార్ అడ్డుకట్ట వేశారు. అలా మొదటి నుంచి ఉన్న మాలల మద్దతుని కాంగ్రెస్ కి అందేలా చూసారు. ఇక ఎస్సీల వర్గీకరణ మీద అనేక రాజకీయ న్యాయ పోరాటాల తరువాత తుది తీర్పు వెలువడింది. దీంతో ఇపుడు ఏపీలో ఎవరికి లాభం అన్న చర్చ వస్తోంది.

ఏపీలో చూస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని జగన్ 2012 నుంచే కొల్లగొట్టారు. అది కాస్తా 2019 నాటికి పూర్తిగా వైసీపీ పరం అయింది. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో వైసీపీ ఆనాడు విజయఢంకా మోగించింది. అదే 2024 వచ్చేసరికి మాత్రం ఎస్సీలు వైసీపీకి దూరంగా జరిగి టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఇది రాజకీయంగా మార్పు కోరుతూ తీసుకున్న నిర్ణయం తప్పితే సామాజికవర్గం పరంగా దన్ను అయితే కాదని విశ్లేషణలు ఉన్నాయి.

ఇపుడు చూస్తే సుప్రీం కోర్టు తీర్పుతో మాలలు మధనం చెందుతున్నారు. తమ అవకాశాలు ఇపుడు తగ్గిపోతాయన్న ఆందోళన వారిలో ఉంది. అసలు ఎస్సీ వర్గీకరణకు కారకుడు చంద్రబాబు అన్నది కూడా వారిలో ఉందని అంటారు. ఈ పరిణామాల క్రమంలో మంద క్రిష్ణ మాదిగ కూడా చంద్రబాబుని పొగిడారు. ఆయన వల్లనే ఈ వర్గీకరణ సాధ్యపడింది అని తీర్పు తరువాత చేసిన వ్యాఖ్యలలో చెప్పారు.

ఇక చంద్రబాబు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. మాదిగలకు అవకాశాలు ఇచ్చింది తామే అని అన్నారు. అన్ని సామాజిక వర్గాలను తాము ఆదుకుంటామని బాబు చెప్పినా మాదిగలు అయితే టీడీపీకి శాశ్వత ఓటు బ్యాంక్ కాబోతున్నారు అలాగే మాలలలో మాత్రం భిన్నమైన వైఖరి కనిపిస్తోంది. వారు తిరిగి వైసీపీ వైపు మళ్ళేలా ఈ తీర్పు ఉండబోతోంది అని అంటున్నారు.

ఒక విధంగా ఈ తీర్పు వల్ల ఏపీలో వైసీపీకి రాజకీయంగా ఎంతో కొంత మేలు జరుగుతుంది అని అంటున్నారు. అదే టైం లో టీడీపీకి మాదిగల ఓటు బ్యాంక్ స్థిరపడబోతోంది. బాబు అన్ని వర్గాలను సమానంగా చూస్తామని చెప్పడం పట్ల మాలలు ఎలా రియాక్ట్ అవుతారో దానిని బట్టి మాలల మద్దతు టీడీపీకి ఎంత దక్కుతుందని ఆలోచించాల్సి ఉంది.