క్లైమాక్స్‌కు టీడీపీ ఎలక్షన్ పాలిటిక్స్... !
ప్రధానంగా 70 నియోజకవర్గాల్లో టీడీపీ అంతర్గత సర్వేలు.. భిన్నమైన ఫలితాన్ని ఇచ్చాయని సమాచారం.
By: Tupaki Desk | 21 Dec 2023 11:30 AM GMTతెలుగు దేశం పార్టీలో ఇక, కీలక ఘట్టం ప్రారంభం కానుంది. మరో రెండు మాసాల్లోనే ఎన్నికల నోటిఫికేష న్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీలో గెలుపు గుర్రాలను ఒడిసి పట్టుకునే అంతర్గత సర్వేకు మరో రెండు రోజుల్లో పచ్చజెండా ఊపనున్నారు. అత్యంత శరవేగంగా సాగనున్న ఈ సర్వేలో గెలుపు గుర్రాలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా 70 నియోజకవర్గాల్లో టీడీపీ అంతర్గత సర్వేలు.. భిన్నమైన ఫలితాన్ని ఇచ్చాయని సమాచారం.
ఆయా నియోజకవర్గాల్లోకీలకమైన అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, కృష్ణాజిల్లా వంటి బలమైన కంచు కోటలు ఉన్నాయి. పైకి ఒక రకంగా.. అంతర్గతంగా మరో విధంగా వ్యవహరిస్తున్న నాయకుల కారణంగా టీడీపీ ఇక్కడ గత ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కలేక పోయిందనే వాదన ఉంది. ఇదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతున్న నియోజకవర్గాల్లో కొంత మార్పు కోసం పార్టీ అధినేత ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఇప్పుడు అంతర్గత సర్వేలు చేయనున్నారు.
దీనిలో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ కీలకంగా వ్యవహరించ నున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో అంతర్గతంగా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి.. పార్టీని పటిష్టపరిచే వ్యూహాలతో ముందుకు సాగుతు న్న నాయకులను గుర్తించనున్నారు. వారికి సహకరించేలా.. ఇతర నాయకులను కూడా ఆదేశించనున్న ట్టు సమాచారం.
మరోవైపు.. ఇదే కమిటీ పొత్తుల ప్రభావంపైనా అంచనా వేయనుంది. అలాగే, క్షేత్రస్తాయిలో జనసేన-టీడీపీ ఉమ్మడి పోటీకి సహకరించే పరిణామాలు, పొత్తుల సమీకరణలు .. ఇలా అనేక విషయాలను ఈ కమిటీ పరిశీలించనుంది. మొత్తంగా కేవలం 15 రోజుల్లో ఈ కమిటీ జిల్లాల పర్యటనను పూర్తి చేసుకుని. అధినేతకు సమగ్ర వివరాలతో కూడిన నివేదికను అందజేయనుంది. దీంతో మొత్తంగా టీడీపీలో కీలక ఘట్టం ప్రారంభం కానుంది.