పార్టీలో అభిప్రాయ సేకరణ మొదలైందా ?
టీడీపీ ఎన్డీయేలో జరిగితే ఎదురయ్యే పరిస్ధితుల గురించి సీనియర్లతో మాట్లాడుతున్నారు. వీరిలో ముఖ్యంగా ముస్లిం మైనారిటి నేతలు కూడా ఉన్నారట.
By: Tupaki Desk | 10 Feb 2024 12:30 PM GMTరాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబునాయుడు కోరిక. దానికి అనుగుణంగానే ఢిల్లీకి వెళ్ళి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపి వచ్చారు. పొత్తులో ఎన్నిసీట్లిస్తారనే విషయంలో క్లారిటి లేకపోయినా బీజేపీ అడిగినన్ని సీట్లు కాకపోయినా అందులో సగమన్నా ఇవ్వక చంద్రబాబుకు తప్పదని అందరికీ తెలిసిందే. బీజేపీతో పొత్తులో సీట్లు ఫైనల్ కావాలంటే అంతకన్నా ముందు జరగాల్సింది మరోటుంది. అదేమిటంటే టీడీపీ ఎన్డీయేలో చేరటం. ముందు ఎన్డీయేలో టీడీపీ పార్టనర్ అయితేనే తర్వాత పొత్తులను ప్రకటించగలదు.
ఈ నేపధ్యంలోనే పార్టీలో అభిప్రాయసేకరణ మొదలైందని సమాచారం. టీడీపీ ఎన్డీయేలో చేరితే జరిగే లాభనష్టాలపై పార్టీలోని సీనియర్లతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చర్చలు జరపటం అనేకన్నా అభిప్రాయాలు సేకరిస్తున్నారంటే కరెక్టుగా ఉంటుంది. టీడీపీ ఎన్డీయేలో జరిగితే ఎదురయ్యే పరిస్ధితుల గురించి సీనియర్లతో మాట్లాడుతున్నారు. వీరిలో ముఖ్యంగా ముస్లిం మైనారిటి నేతలు కూడా ఉన్నారట. ఎన్డీయేలో టీడీపీ చేరితే రాష్ట్రంలోని ముస్లిం మైనారిటిలు పార్టీకి దూరమవుతారనే భయం చంద్రబాబులో స్పష్టంగా తెలుస్తోంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్డీయేలో పార్టనర్ గా చేరినా చేరకపోయినా టీడీపీకి వచ్చే లాభమూ లేదు నష్టమూ లేదు. ఎందుకంటే గడచిన పదేళ్ళుగా ముస్లిం మైనారిటీల నుండి టీడీపీ తరపున ఒక్క ఎంఎల్ఏ కూడా గెలవలేదు. ముస్లిం మైనారిటిల్లో టీడీపీ కొంత మద్దతుండచ్చు కాని అది సీట్లను గెలిపించేంత లేదని అందరికీ తెలుసు. ఒక్క అసెంబ్లీలో కూడా పార్టీని గెలిపించలేని ముస్లిం మైనారిటీల గురించి చంద్రబాబు ఆలోచించాల్సిన అవసరంలేదు.
ఇంకా గట్టిగా చెప్పాలంటే ముస్లింలకు టికెట్లు ఇవ్వకపోయినా బీజేపీకి ఓట్లేవేసి గెలిపించటంలేదా ? ముస్లింల నుండి బీజేపీకే ఎదురుకాని ఇబ్బంది టీడీపీకి ఎందుకు ఎదురవుతుంది ? చిన్న విషయాన్ని కూడా బూతద్దంలో చూడటం చంద్రబాబుకు బాగా అలవాటు. పదేళ్ళుగా పార్టీ తరపున ఒక్క ముస్లిం ఎంఎల్ఏ కూడా గెలవలేదంటేనే వాళ్ళు పార్టీకి ఎప్పుడో దూరమైపోయినట్లు అర్ధమవుతోంది. ఇంతోటిదానికి చంద్రబాబు ముస్లిం మైనారిటిల గురించి ఇంత ఆలోచించటమే విచిత్రంగా ఉంది.