పాతికేళ్ళుగా గెలవని సీటులో టీడీపీ ఫైట్ !
ఈ సీటులో ఎక్కువగా కాంగ్రెస్ బలంగా ఉంటూ వచ్చింది.
By: Tupaki Desk | 24 March 2024 2:30 AM GMTటీడీపీ విశాఖ ఎంపీ సీటుని గెలుచుకుని పాతికేళ్ళు కావస్తోంది. టీడీపీ చివరిసారిగా ఈ సీటు గెలిచింది 1999లో. ఆనాడు దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి ఆ సీటు నుంచి రెండోమారు గెలిచారు. దాని కంటే ముందు టీడీపీ 1983 నుంచి జరిపిన రాజకీయ ప్రస్థానంలో విశాఖ ఎంపీ సీటుని మూడు సార్లు మాత్రమే గెలుచుకుంది అని చరిత్ర చెబుతోంది.
టీడీపీ ఏర్పడ్డాక పదిసార్లు ఎంపీ ఎలక్షన్లు జరిగితే విశాఖ ఎంపీ సీటులో కాంగ్రెస్ అయిదు సార్లు గెలిస్తే బీజేపీ వైసీపీ ఒక్కోసారి గెలిచాయి. ఈ సీటులో ఎక్కువగా కాంగ్రెస్ బలంగా ఉంటూ వచ్చింది. ఆ తరువాత బలం కాస్తా వైసీపీకి షిఫ్ట్ అవుతోంది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఉండడంతో బీజేపీ కూడా ప్రభావం చూపుతూ వస్తోంది. టీడీపీ నుంచి 2004, 2009లలో రెండు సార్లు పోటీ చేసి ఎంవీవీస్ మూర్తి ఓటమి పాలు అయ్యారు. ఆయన వారసుడిగా వచ్చిన మనవడు శ్రీభరత్ 2019లో ఓటమి పాలు అయ్యారు.
ఈసారి తన రాజకీయ అదృష్టాన్ని ఆయన పరీక్షించుకుంటున్నారు. విశాఖ ఎంపీ సీటు పరిధిలో విశాఖలోని నాలుగు అసెంబ్లీ సీట్లతో పాటు భీమిలీ, గాజువాక ఎస్ కోట ఉన్నాయి. ఇందులో వైసీపీ భీమిలీ ఎస్ కోట విశాఖ సౌత్, ఈస్ట్ మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది.
విశాఖ వెస్ట్ లో కూడా రాజకీయం నెమ్మదిగా మారుతోందని అది ఉపకరిస్తుందని భావిస్తోంది. టీడీపీ కూటమితో వైసీపీ ముఖా ముఖీ పోరునే సాగిస్తోంది. మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఎంపీగా పోటీ చేస్తాను అని చెప్పి చివరికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
దాంతో ఆ విధంగా టీడీపీకి కొంత సానుకూలత ఏర్పడింది అని అంటున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేసి ఉంటే ఓట్ల చీలిక జరిగేది అని అంటున్నారు. కాంగ్రెస్ పోటీ నామమాత్రంగా మారింది. దాంతో విశాఖ ఎంపీ సీటులో టైట్ ఫైట్ నడిచే అవకాశం ఉంది అని అంటున్నారు. పాతికేళ్ళ తరువాత టీడీపీ గెలుస్తుందా లేక వైసీపీ రెండవ మారు గెలిచి సత్తా చాటుతుందా అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.