Begin typing your search above and press return to search.

తెలంగాణా హామీల మీద సీరియస్ స్టడీ చేస్తున్న టీడీపీ...!

గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఏమైనా చేస్తాయి. కర్నాటక హామీలలో చాలా వరకూ తెలంగాణా కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టి అధికారం చేపట్టింది.

By:  Tupaki Desk   |   11 Dec 2023 2:45 AM GMT
తెలంగాణా హామీల మీద సీరియస్ స్టడీ  చేస్తున్న టీడీపీ...!
X

గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఏమైనా చేస్తాయి. కర్నాటక హామీలలో చాలా వరకూ తెలంగాణా కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టి అధికారం చేపట్టింది. ఆరు గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు జనంలోకి చాలా వేగంగా వెళ్ళిపోయాయి. దాంతో ఇపుడు తెలంగాణా హామీలను ఏపీలో తమ ఎన్నికల ప్రణాళికలలో పెట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ సీరియస్ గా స్టడీ చేస్తోందని అంటున్నారు.

ముఖ్యంగా కర్నాటక, తెలంగాణాలలో కాంగ్రెస్ అధికారంలోకి అధికారంలోకి రావడానికి ఉచిత విద్యుత్ హామీ బ్రహ్మాస్త్రంగా పనిచేసింది అని అంతా అంటున్నారు. రెండు వందల లోపు యూనిట్ల దాకా కరెంట్ వాడే వారికి ఉచితంగా ఇవ్వడం అన్నది కాంగ్రెస్ ని విజయ తీరాలకు చేర్చింది. ఇది నిజంగా పేదలే కాదు మధ్యతరగతి వర్గాలకు కూడా ఎంతో ఉపశమనం కలిగించే హామీ.

వారంతా నెలకు కనీసంగా ఏపీలో అయితే వేయి నుంచి పదిహేను వందల రూపాయల దాకా ప్రతీ నెలా ఆదా పొందుతారు. ఈ విధంగా లక్షలాది కుటుంబాలకు మేలు జరుగుతుంది. వారంతా అతి పెద్ద ఓటు బ్యాంక్ గా మారుతారు. దాంతో ఈ ఉచిత విద్యుత్ గురించి టీడీపీ చాలా సీరియస్ గానే ఆలోచిస్తోంది అని అంటున్నారు.

ఇప్పటికే మినీ మేనిఫేస్టోని రిలీజ్ చేసింది టీడీపీ. ఈ మధ్యనే జనసేనతో కలసి ఉమ్మడి మ్యానిఫేస్టోని కూడా రిలీజ్ చేసింది. ఇపుడు పూర్తి స్థాయి మ్యానిఫేస్టోలో ఉచిత విద్యుత్ అంశాన్ని పెట్టనుంది అని ప్రచారం అయితే సాగుతోంది.

ఇక ఆరు గ్యారంటీలలో మరో సూపర్ స్కీం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం. దీని వల్ల కూడా పేద మధ్యతరగతి వర్గాలు పూర్తి స్థాయిలో ఉపశమనం పొందనున్నాయి. ఇప్పటికే ఈ పధకం తెలంగాణాలో అమలు అవుతోంది. దాంతో అక్కడ ఉద్యోగిణులు అయిన మహిళలు పూర్తి స్థాయిలో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. తమకు బస్సు ఖర్చులు నెలకు రెండు వేల రూపాయలు దాకా ఆదా అవుతున్నాయని వారు అంటున్నారు

ఈ స్కీం మీద కూడా టీడీపీ కన్నేసింది అని అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అన్నది టీడీపీ కీలక హామీగా ఇవ్వబోతోంది అని అంటున్నారు. అదె విధంగా తెల్ల కార్డు ఉంటే చాలు మహిళల బ్యాంక్ ఖాతాలో ప్రతి నెలా నగదు జమ చేయడం అన్నది ఇంకో కీలకమైన హామీ. దీంతో మొత్తం మహిళా ఓటు బ్యాంక్ టర్న్ అవుతుందని టీడీపీ భావిస్తోంది.కాంగ్రెస్ ఈ హామీతో భారీగా లబ్ది పొందింది అని కూడా లెక్కలేస్తోంది.

ఇలాంటి చాలా ఉచిత హామీలతో పంచ భక్ష్య పరమాన్నం లాంటి ఎన్నికల ప్రణాళికను రెడీ చేయడానికి టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. టీడీపీకి ఈ ఎన్నికలు చావో రేవో లాంటివి. అందువల్ల ఆ పార్టీ ఉచితాల హామీలు బ్రహ్మాస్త్రాలుగా మార్చుకోవాలని చూస్తోంది. ఇంకో వైపు వైసీపీ కూడా జనరంజకమైన హామీలను తమ ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టాలని అనుకుంటోంది.

ఆ పార్టీ కూడా కాంగ్రెస్ తెలంగాణాలో ఇచ్చిన హామీలను వాటి పట్ల జనాల్లో వచ్చిన పాజిటివ్ రియాక్షన్ ని స్టడీ చేస్తోంది. మొత్తానికి ఈ రెండు పార్టీలు ఉచిత హామీలు ఎన్ని ఇస్తాయి అన్నది కీలకమైన పాయింట్. అయితే క్రెడిబిలిటీ ఉన్న రాజకీయ నేతలనే జనాలు ఎన్నుకుంటారు అని వైసీపీ నేతలు అంటున్నారు. ఉచిత హామీలు ఎన్నో ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన వాటిని పక్కన పెట్టే వారికి ఓటు వేయరని అంటున్నారు. జగన్ మాట ఇస్తే తప్పరు కాబట్టి ఆయన ఏ హామీ ఇచ్చినా జనల్లోకి వెళ్తుందని వారు నమ్మకంగా ఉన్నారు.