Begin typing your search above and press return to search.

టీడీపీకి సోలోగా మ్యాజిక్ ఫిగర్ దక్కేనా...!?

మొత్తానికి మూడు పార్టీల ముచ్చట తెలిసింది. ఎవరికి ఎన్ని సీట్లు అన్నది కూడా లెక్క తేలింది. 175 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 144 సీట్లకు పోటీ చేయడం ఖాయమైంది.

By:  Tupaki Desk   |   13 March 2024 3:38 AM GMT
టీడీపీకి సోలోగా మ్యాజిక్ ఫిగర్ దక్కేనా...!?
X

మొత్తానికి మూడు పార్టీల ముచ్చట తెలిసింది. ఎవరికి ఎన్ని సీట్లు అన్నది కూడా లెక్క తేలింది. 175 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 144 సీట్లకు పోటీ చేయడం ఖాయమైంది. బీజేపీ జనసేనలకు 31 సీట్లను కేటాయించింది. ఇపుడు మిత్రులకు ఇచ్చిన సీట్ల మీదనే టీడీపీలో హాట్ డిస్కషన్ సాగుతోందిట.

ఈ సీట్లలో ఎన్ని గెలుస్తారు అన్నదే వారి ఆలోచన అని అంటున్నారు. బీజేపీకి పది అసెంబ్లీ సీట్లు ఇస్తే అందులో కచ్చితంగా గెలిచేవి ఒకటో రెండో ఉండవచ్చు అని మిగిలినవి వైసీపీ ఖాతాలోకే అన్న మాట కూడా వినిపిస్తోంది. అలాగే జనసేనకు ఇచ్చే 21 సీట్లలో సగానికి సగం పది సీట్లు గెలిచినా మంచి విజయంగానే చూడాలని అంటున్నారుట.

అంటే మిత్రపక్షాలకు ఇచ్చిన 31 సీట్లలో 12 సీట్లలో గెలుపు అయినా మిగిలినవి 19 వైసీపీకి సులువుగా వెళ్తాయా అన్న ఆందోళన అయితే ఉంది అని అంటున్నారు. ఇక మిత్రపక్షాల నుంచి 12 సీట్ల దాకా సపోర్ట్ వస్తే ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 88లో ఎన్ని తెచ్చుకోవాలి అన్న చర్చ కూడా ఉంది.

నిజానికి చూస్తే టీడీపీకి తాను సోలోగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉంది. అంటే 144కి పోటీ చేసి 88 సీట్లను సాధించడం అన్న మాట. ఇది చాలా కష్టమైన ప్రక్రియగానే చూస్తున్నారు. ఎందుకంటే 2014లో బీజేపీకి 12 సీట్లు ఇచ్చి 163 సీట్లకు పోటీ చేస్తేనే సోలోగా 102 సీట్లు టీడీపీకి దక్కాయి. అపుడు చంద్రబాబు అనుభవం తో కూడిన పాలన ఇమేజ్, మోడీ ఫస్ట్ టైం ప్రధాని ఇమేజ్, పవన్ కళ్యాణ్ రాజకీయ వాసనలు పెద్దగా లేని పవర్ స్టార్ సినీ ఇమేజ్ ఇవన్నీ కలసి వచ్చాయి.

ఈ పదేళ్లలో ఎవరు ఏమిటి అన్నది బాగా తెలిసిపోయిన తరువాత మళ్లీ జట్టు కడుతున్నారు. మోడీ పవన్ ఎంత వరకూ కూటమికి హెల్ప్ అంటే 2014 మాదిరిగా అయితే జనాలకు కూటమి మీద మోజు ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఇక బాబు అనుభవం అన్నది మళ్లీ ముందు పెట్టినా 2014 నుంచి 2019 నాటి పాలన కూడా గుర్తుకు రాక మానదు.

అయితే వీటన్నిటినీ మించి మేలు చేసేది ఏంటి అంటే వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత. అది ఏ మోతాదులో ఉంది ఎంత వరకూ ఉంది అన్న దాని మీదనే కూటమి విజయం ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. సైలెంట్ వేవ్ ఏమైనా ఉంటే కనుక కూటమి మొత్తం మంచి నంబర్ తో బయటకు వస్తుంది. అలా కాకుండా హోరా హోరీ పోరు సాగితే మాత్రం సోలోగా టీడీపీ మ్యాజిక్ ఫిగర్ కి చేరుకోవడం కూడా కష్టమే అని అంటున్నారు.

మొత్తం 144 అసెంబ్లీ సీట్లకు పోటీ చేసి 88 సీట్లు సోలోగా సాధించాలి అంటే కనుక వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకతతో పాటు టీడీపీ మీద పూర్తి స్థాయిలో పాజిటివిటీ కూడా ఉండాలని అంటున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రకటించాక జనంలో పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు అన్నది ఒక మాటగా ఉంది

పాత సీసాలో పాత సారావే అని కూడా అంటున్నారు. మరి కూటమి గెలుపు మలుపుని తిప్పే సందర్భం ఏమిటి ఏ అంశంతో కూటమి వేవ్ ని క్రియేట్ చేయగలుగుతుంది అన్నది రానున్న రోజులే చెప్పాలి. ఏది ఏమైనా 160 సీట్లు గెలుస్తామని కూటమి పెద్దలు చెబుతున్నా టీడీపీ మాత్రం మిత్రులను కూడా తామే మోయాలన్న ఫీలింగ్ తో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.